కూట‌మి ప్ర‌భుత్వం కార్మికులనూ వదిలిపెట్టడం లేదు 

ఫిట్నెస్ ను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం ఉపసంహరించాలి
 
కార్మిక సంఘాల జె ఏ సి నిరసన ప్రదర్శనలో మాజీ ఎంపీ భరత్

రాజమహేంద్రవరం : కూట‌మి ప్ర‌భుత్వం కార్మికులనూ వదిలిపెట్టడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ మండిప‌డ్డారు. పిట్నెస్ ను (బ్రేక్) ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం తక్షణమే   ఉపసంహరించాలని  ఆయ‌న‌ డిమాండ్ చేశారు.  రవాణా వాహనాల ఫిట్నెస్ ను (బ్రేక్) రవాణా శాఖ అధికారుల నుండి ప్రైవేట్ సంస్థలకి కూటమి ప్రభుత్వం అప్పజెప్పడాన్ని నిరసిస్తూ  వివిధ రవాణా వాహన కార్మిక సంఘాల ప్రతినిధుల జె ఏ సి కన్వీనర్స్ వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్ తదితరుల ఆధ్వర్యాన రాజానగరం ఏ టి ఎస్ దగ్గర సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్ పాల్గొన్నారు. స్థానిక హైటెక్ బస్ షెల్టర్ నుంచి ఆటోల్లో ఊరేగింపుగా రాజానగరం ఏ టి ఎస్ సెంటర్ కి చేరుకొని నిరసన తెలిపారు. రవాణా శాఖ అధికారులకు వినతి పత్రం అందజేసారు.
    ఈసందర్బంగా కార్మికులను ఉద్దేశించి మాజీ ఎంపీ భరత్  మాట్లాడుతూ ..ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన  ఆటోలు, మినీ వ్యాన్లు, కార్లు, లారీల యజమానులు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. నిరసనకు 200మంది కంటే ఎక్కువ వస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడం ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వాపోయారు. పేదలు, కార్మికులు తమ ఇబ్బందులపై నిరసన తెలిపే హక్కుని కూడా కూటమి ప్రభుత్వం హరించేస్తోందని భరత్ విమర్శించారు.  కూటమి ప్రభుత్వం వచ్చాక  అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యుత్ బిల్లులు ఠారెత్తిపోతున్నాయన్నారు.  గత ప్రభుత్వంలో 600,700 బిల్లులు కట్టేవాళ్ళు ఇప్పుడు 1500 నుంచి 3000రూపాయల వరకు కట్టాల్సియాన్ దుస్థితి కూటమి ప్రభుత్వంలో దాపురించిందని భరత్ పేర్కొన్నారు. ఇంకా నాలుగేళ్ళ సమయం ఉందికదా అని ఏదోరకంగా దోచే కార్యక్రమాన్ని చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని నమ్మబలికారని, దీనర్ధం పేద మధ్యతరగతి ప్రజలను పీల్చి పిప్పి చేయడమా అని భరత్ నిలదీసారు. 
    రైతుల పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో బాగోలేదని, చిత్తూరు జిల్లాలో తోటాపురి రకం మామిడిపళ్ళు కిలో 15నుంచి 18రూపాయలకు జగన్ ప్రభుత్వంలో రేటు వచ్చేదని, ఇప్పుడు కేవలం మూడు రూపాయల రేటు మాత్రమే వస్తోందని భరత్ ప్రస్తావించారు. పుగాకు, ధాన్యం, మిర్చి, పసుపు, ఆక్వా ఇలా అన్ని రకాల రైతులు కూటమి ప్రభుత్వంలో  ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. రైతు ఘోష వస్తే , ఆ ప్రభుత్వాలు నిలబడబోవన్నారు. ఇక ఏ రోజు కూలితో ఆరోజు గడిపే ఆటో, వ్యాన్, కారు, లారీ డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేసేలా ప్రభుత్వం వ్యవహరించడం దారుణామన్నారు. కేంద్రం తీసుకున్న ఫిట్ నెస్ ప్రయివేటీకరణ  నిర్ణయాన్ని ఏ రాష్ట్రం కూడా అమలు చేయడం లేదని భరత్ అన్నారు.  రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ లలో అమలుచేస్తే, కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో కర్ణాటక, రాజస్థాన్ ప్రభుత్వాలు అమలు నిలిపివేశాయన్నారు. ఇక  గుజరాత్ లో అయితే పాత , కొత్త విధానాల్లో ఏదైనా అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం మాత్రం  కార్మిక లోకాన్ని ఇబ్బంది పెట్టేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం తగదని భరత్ పేర్కొన్నారు. ఏపీలో ఏమిచేసినా ప్రజలు ఎవరూ మాట్లాడారన్న ఉద్దేశ్యంతోనే కూటమి ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. 
   కార్మికులు ఏమిచేయలేరన్న ఉద్దేశ్యంతో  ఫిట్ నెస్ ప్రయివేటీకరణ ఏకంగా 20,30ఏళ్లకు రాసి ఇచ్చేసారని భరత్ విమర్శించారు. ప్రపంచ బ్యాంకు నుంచి వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకు రావడానికే ఇలా దీర్గకాలానికి లీజులు రాస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వా మ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. ఫిట్ నెస్ వ్యవహారంపై కార్మికుల నిరసన సెగ ప్రభుత్వానికి తగలాలంటే వేలసంఖ్యలో కార్మికులు రోడ్డెక్కుతారని, అప్పుడు ప్రభుత్వాలు దిగి వస్తాయని అన్నారు. ఇప్పుడు తక్కువమందితో నిరసన తెలుపుతున్నారని దీని ప్రభుత్వం గుర్తించి, కార్మికుల న్యాయమైన కోర్కె తీర్చాలని లేకుంటే భవిష్యత్తులో చేపట్టే ఆందోళనలో పెద్దఎత్తున కార్మికులు పాల్గొనాలని భరత్ కోరారు. కార్మిక జె ఏ సి ఏ నిర్ణయం తీసుకున్నాసరే వైసిపి సంపూర్ణ మద్దతు ఇస్తుందని, జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని భరత్ అన్నారు. 
   ఇప్పటికే ఫిట్ నెస్ ప్రయివేటీకరణ వంటి నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్న కార్మికులు ఆగస్టు 15నుంచి ఉచిత బస్సు విధానం అమల్లోకి వస్తే ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయోనని భరత్ పేర్కొన్నారు. దీనిపై జె ఏ సి ఆలోచన చేసి కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. గత వైసిపి ప్రభుత్వం వాహన మిత్ర పథకం ద్వారా 10వేల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చేదని ఇప్పుడు అదీ ఇవ్వడం లేదని ఆయన గుర్తుచేసారు. జగన్ హయాంలో 10లక్షల కోట్లు అప్పు చేసేశారని నోటికొచ్చినట్లు కూటమి నాయకులు మాట్లాడారని, అయితే 2014నుంచి 2024వరకు చూసుకుంటే ఏడు లక్షల 50వేల కోట్లు అప్పు తేలిందని ఇందులో , 2019వరకు చంద్రబాబు హయాంలో రెండు లక్షల 70వేల కోట్లు, జగన్ హయాంలో మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేసినట్లు, ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం లక్షా 60వేలకోట్ల అప్పు చేసారని ఇదంతా అసెంబ్లీ వేదికగా ఆర్ధికమంత్రి నివేదిక స్పష్టం చేసిందని భరత్ వివరించారు. నిజానికి జగన్ హయాంలో అప్పులు చేసినా ఏడాదికి 70,80వేలకోట్లు వివిధ పథకాల రూపేణా ప్రజలు ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ఒక లక్ష 60వేల కోట్ల రూపాయల అప్పు ఎలా అయిందని భరత్ ప్రశ్నించారు. ఈ సొమ్ముతో ఏంచేసారో, ఎవరెవరి జేబుల్లోకి వెళ్ళాయో  ఆ భగవంతుడికే తెలియాలన్నారు.  బాబు స్యురిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని ఎన్నికల్లో చెప్పారని ఇప్పుడు ఎవరికీ భవిషత్తు లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కార్మిక లోక జాగృతితో ఆలోచన చేసి, ఏ ప్రభుత్వం మంచి చేసిందో తెలుసుకోవాలన్నారు. కార్మికులు కలసికట్టుగా చేసే పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని భరత్ ప్రకటించారు.

Back to Top