నారావారి పాల‌న‌ను అంతం చేద్దాం

మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపు

వైయ‌స్‌ జగన్‌ ప్రతి మహిళ గర్వపడేలా పాలించారు

మహిళలకు ఇచ్చిన హామీలు జగనన్న కులం, మతం, పార్టీ చూడకుండా అమలు

చంద్రబాబు కూటమి ప్రభుత్వం మహిళలంద‌రిని మోసం చేసింది

జగనన్న 2.0లో వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం 

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం

తాడేపల్లి: రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతుంద‌ని, ఈ పాలన ను అంతమొందించే వరకు మహిళలు న‌డుం బిగించాల‌ని మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు.  వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర‌ అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అధ్యక్షతన నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,  మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, అప్పిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా సమావేశానికి హజరైన మహిళా విభాగం ప్రతినిధులనుద్దేశించి ప‌లువురు పార్టీ నేత‌లు మాట్లాడారు.  

వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ  వరుదు కళ్యాణి 
మన మహిళలంతా జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం. కూటమి ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసింది. చంద్రబాబు పాలనలో మహిళా లోకం కుమిలిపోతుంది, నాడు జగనన్న హయాంలో మహిళా పక్షపాత ప్రభుత్వం కొనసాగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం కుట్రలకు, ప్రజా నాయకుడైన జగనన్నకు మధ్య యుద్దం జరుగుతోంది, చంద్రబాబు వంచనకు, జగనన్న విశ్వసనీయతకు, చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు, జగనన్న పోరాటపటిమకు మధ్య యుద్దం జరుగుతోంది. ఈ యుద్దంలో మన మహిళలంతా జగనన్న సైన్యంలా మారుదాం, మనకు జగనన్న అనే నమ్మకం, ధైర్యం ఉన్నాయి. జగనన్న పాలన 2.0 వస్తుంది. మనమంతా ప్రజా సమస్యలపై పోరాడుదాం. కూటమి ప్రభుత్వంలో నాయకులు ప్రజలకు మొహం చూపించలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఒక్క రూపాయి అందడం లేదు. మహిళలను నిలువునా మోసం చేశారు. మహిళలకు జగనన్న పాలనలో జరిగిన లబ్ధి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదాం. కూటమి ప్రభుత్వంలో సూపర్‌ సిక్స్‌ అంటే గంజాయి, బెల్ట్‌ షాప్‌లు, పర్మిట్‌ రూమ్స్‌, పేకాట క్లబ్‌లు, డ్రగ్స్‌, మహిళలపై అఘాయిత్యాలు. అంతేకాదు సూపర్‌ సిక్స్‌ బదులు సూపర్‌ స్కామ్స్‌ అమలుచేస్తున్నారు. మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీద్దాం. జగనన్నను తాకాలంటే మన కార్యకర్తలందరినీ దాటాలి. మనమంతా వైఎస్సార్‌సీపీ నిర్మాణంలో భాగస్వామ్యమవుదాం. 

 ఆర్‌.కే.రోజా, మాజీ మంత్రి.
మహిళా సమస్యలపై పోరాటాలు మనకు కొత్త కాదు, మనపై ఒక గురుతరమైన బాధ్యత ఉంది, రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతోంది, మన వైఎస్సార్‌సీపీలోని ప్రతి మహిళ ఒక సత్యభామలా మారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించేలా నడుం బిగించాలి. చంద్రబాబు ఏడాది పాలనలో అవమానాలు, అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, వేధింపులు, ఇవే సూపర్‌ సిక్స్‌, ప్రజలకిచ్చిన వాగ్ధానాలు అమలుచేయాలన్న ధ్యాస లేదు. నాడు జగన్‌ గారు ప్రజలకిచ్చిన హామీలే కాదు చెప్పనివి కూడా ఎన్నో చేశారు, కులం, మతం, పార్టీ చూడకుండా అమలుచేశారు. కూటమి ప్రభుత్వం మహిళా లోకానే మోసం చేసింది. జనసేన, టీడీపీ,బీజేపీ మహిళలు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. మన మహిళా లోకం పాకిస్తాన్‌ యుద్దంలో కూడా సత్తా చాటింది, మన మహిళలు దేశ రక్షణలో ఉగ్రవాదులను మట్టుబెడితే మనం ఉన్మాదులను వధిస్తాం అని శపధం చేద్దాం. వైఎస్సార్సీపీ తరుపున గట్టిగా పోరాడుతున్న వారిని అక్రమ కేసుల్లో ఇరికిస్తూ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. మనం తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని జగనన్న ధైర్యం చెప్పారు, మనం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుదాం, మనమంతా ఒక్కటవుదాం, కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా రెడ్‌ బుక్‌ రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తున్నారు, వారికి ఒకటే చెబుతున్నా మీరు ఇలాగే వ్యవహరిస్తే మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాగానే చట్టపరంగా శిక్షిస్తాం. మన జగనన్న 2.0 పాలనలో తప్పుడు కేసులు పెట్టి వేధించే వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. మన వైఎస్సార్సీపీ కార్యకర్తలందరికీ న్యాయం జరుగుతుంది. జగనన్న మన మహిళలకు ఎన్నో పథకాలు అందజేసి వారిని లక్షాధికారులు చేశారు, కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. మన మహిళలంతా నడుం బిగించి జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం

 తానేటి వనిత, మాజీ హోం మంత్రి.
ఆంధ్రరాష్ట్రం నలుమూలల నుంచి మహిళా విభాగం సమావేశానికి వెళ్లాలన్న మీ పట్టుదల, కసి ఇవన్నీ రానున్న రోజల్లో జగనన్నని ముఖ్యమంత్రిని చేయడానికి ఉపయోగపడతాయి. నేను మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. జగనన్న అధికారంలో ఉన్నప్పుడు దివంగత నేత రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద,బడుగు, బలహీన వర్గాల వారికి ఎలా అండగా ఉన్నారో అలా ఉంటూ ప్రతిశాఖలోనూ సంస్కరణలు చేపట్టారు. సుపరిపాలన చేయాలన్న లక్ష్యం, ధృడసంకల్పంతో ఐదేళ్లూ పరిపాలన చేశారు. ఐదేళ్లూ కేవలం పరిపాలనమీదే దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో చెప్పినవాటితో పాటు, చెప్పని హామీలనూ నెరవేర్చారు. ఈ క్రమంలో పార్టీ మీద తగినంత దృష్టి పెట్టలేకపోయాం. మనం తప్పు చేసి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోలేదు. కేవలం తప్పుడు ప్రచారం వల్ల మాత్రమే ఓడిపోయాం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆయన అక్కున చేర్చుకున్నారు. దానిపైనా టీడీపీ కూటమి నేతలు దుష్ప్రచారం చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కూడా దుష్ర్పచారం చేశారు. ఇవాళ ఈ యాక్ట్ పై పురంధేశ్వరి మాట్లాడుతూ ఇది మోడీ గారి కల, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు. అంటే కేవలం అప్పుడు జగన్మోహన్ రెడ్డిపైన తప్పుడు ప్రచారం చేసి బురద జల్లారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలను మహరాణుల్లా చూశారు. అలాంటి జగనన్నను మనం మహారాజును చేసుకోవాలి. దానికోసం మనమంతా కష్టపడి పనిచేయాలి. కూటమి నాయకుడి మనసులో మనం మెదిలితే చాలు మనమీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏడాదిగా ఇదే జరుగుతుంది. మీరు మీ మీ నియోజకవర్గాల్లో మహిళా విభాగాన్ని యాక్టివేట్ చేయండి.
గ్రామస్థాయి వరకు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వాళ్లకి సమాచారం ఇవ్వండి. కూటమి ప్రభుత్వం మన మీద వేసిన నిందలపై సరైన సమాచారం ఇవ్వండి.
అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అందించినంత పారదర్శకంగా మరే ముఖ్యమంత్రి పాలన చేయలేదు.
ఎక్కడా ఎవరినీ దోచుకోలేదు. అవినీతి మరక అంటకుండా పాలన చేశారు. ప్రతి ఒక్క లబ్దిదారుడి అకౌంట్లోకే నేరుగా లబ్ది చేకూర్చాడు.
కాబట్టి ఆ నిందలను తొలిగిపోయేలా మీరంతా మాట్లాడాలి. మీరు పొందిన మేలు గురించి చెప్పాలి.  మన నాయకుడి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వాటిని తిప్పికొట్టాలి.

 సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్. 
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు, ఆలోచనలు వారసత్వంగా వచ్చిన పార్టీ. రాజశేఖర్ రెడ్డి ఆలోచనలు, ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా తీసుకుని తన తల్లితో కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు... ఆ ప్రస్ధానంలో ఉద్యమంలా చాలా మంది కలిసి వచ్చారు. అదే రాజకీయ పార్టీగా రూపొంది.. అడుగులు వేస్తూ అత్యున్నత స్థాయికి చేరుకుంది. 
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మీద ప్రభుత్వంమీద, ప్రజల సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టాం. పార్టీ మీద, పార్టీ కార్యకర్తల మీద  దృష్టి పెట్టలేకపోయాం. మొన్నటి ఫలితాల్లో దీని ప్రభావం కూడా కనిపించింది. ఇది మనకు ఓ పాఠం. ఇప్పుడు స్థిరమైన నిర్ణయానికి వచ్చాం. పార్టీలో రానున్న నాలుగేళ్లు నిలబడి పోరాటం చేయాలి. ఇది కష్టకాలం.  ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అయితే వెనుకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇంత కష్టకాలంలోను కూడా పార్టీలో బాధ్యతలు ఇవ్వమని లెక్కకు మించి అడుగుతున్నారు. ఏ రాజకీయ పార్టీలోను ఇలా లేదు. 

జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న విశ్వాసం, అభిమానంతో ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆ అభిమానం చెక్కు చెదరకపోగా మరింత పెరిగింది. పార్టీలో పది పదవులు ఉంటే వంద మంది వస్తున్నారు. ఇదే ఆ నమ్మకానికి నిదర్శనం. ఈ దఫా పార్టీలో అనుబంధ విభాగాల్లో రాష్ట్ర స్దాయి నుంచి గ్రామస్థాయి వరకు వీలైనంత వరకు ప్రతి పదవి కోసం ప్రజాస్వామ్యయుతంగా అభిప్రాయాలు తీసుకుని చేపట్టాం. గ్రామస్ధాయిలో బూత్ కమిటీలు పూర్తయ్యేసరికి పార్టీ నిర్మాణంలోకి దాదాపు 18 లక్షల మంది వస్తారని అంచనా. ఈ 18 లక్షల మంది  క్రియాశీలక సభ్యులు, నాయకులు ప్రజలతో అనుసంధాన కర్తలుగా ఉంటారు. 
అధ్యక్షుడు ఒక మెసేజ్ ఇస్తే.. కింద బూత్ కమిటీ వరకు వెళ్లేలా ఈసారి ఒక మెకానిజమ్ ఏర్పాటు చేస్తున్నాం. 
ఇది ఓ మందడుగు. కోట్లలో ఉన్న పార్టీ అభిమానులకు, లక్షల్లో ఆయన కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారితో అనుసంధానం చేసే మెకానిజమ్ ఇది. పార్టీ సంస్థాగతంగా, క్రియాశీలకంగా ప్రజలతో పూర్తి స్ధాయిలో మమేకమై పనిచేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. 

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత మేలు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో మహిళలకు చేశారు. పాలనలో మహిళలు తనతో పాటు అడుగులు వేయాలని.. నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని, ఉండగలరని, ఉంటారని అందరికంటే  ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి నమ్మారు. మహిళలు బాధ్యతాయుతంగా ఉండడంతో పాటు, బాధ్యతాయుతంగా పనిచేస్తారని, కుటుంబాన్ని కూడా బాగా నడపగలరని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్మారు. అందుకే మహిళలకు అంత ప్రాధాన్యాత ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి గారు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం వైపు దేశం మొత్తం తిరిగి చూసింది. ఇది విప్లవాత్మకమైన నిర్ణయం. 
పార్టీ అనుబంధ సంఘాలు ఒక ప్రణాళిక ప్రకారం సమావేశం కావాలని నిర్ణయించాం. ఆదే విధంగా జిల్లా స్ధాయిలో కూడా వివిధ అనుబంధ సంఘాలవలే మహిళా విభాగం కూడా సమావేశాం కావాలి. 
మరోవైపు రోజువారీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వాటిని ఫాలో అవ్వాలి. పార్టీ తరపున మన వాయిస్ ప్రజల్లోకి వెళ్లాలి. జిల్లా, నియోజకవర్గ స్ధాయిలో జిల్లా పార్టీ నాయకత్వాన్ని కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత, పూర్తి గౌరవం లభించడం, కుటుంబ సభ్యుల్లా చూడ్డం మన పార్టీలో మాత్రమే కనిపిస్తుంది.

పనిచేసే క్రమంలో అడ్డంకులు కూడా సహజం. వాటిని కూడా పార్టీలో వివిధ స్ధాయిల్లో ఉన్న నాయకుల సహకారంతో తొలగించుకోవాలి. అదే విధంగా రకరకాల అపోహలతో మనకు దూరమైన వర్గాలకు దగ్గరకావాల్సిన అవసరం ఉంది. మహిళలుగా మీరు ఆ పనిని సక్రమంగా నెరవేర్చగలరు. సోషల్ మీడియాను కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి. కూటమి ప్రభుత్వంలో మహిళలు  అని కూడా చూడకుండా కేసులు పెడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఇస్తున్న ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్తు సుధారాణి విషయంలో అయినా, కంతేరు ఎంపీటీసీ విషయంలోనైనా అదే రకంగా ప్రవర్తిస్తున్నారు. వీటిని సంఘటితంగా మనం ఎదుర్కోవాలి. పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. మనం సంయమంగా వ్యవహరిస్తూనే పార్టీ అనుబంధ విభాగం నాయకులుగా క్రియాశీలకంగా వ్యవహరించడంతోపాటు ... మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అండగా ఉంటుందనే సంకేతాలు పోయే విధంగా పనిచేయాలని సూచించారు.

Back to Top