కౌలుదారులకు గుర్తింపేది 

ఏటా ఏప్రిల్, మే నెలల్లో సీసీఆర్సీ మేళాలు

ఈ ఏడాది కౌలుకార్డుల జారీ ప్రక్రియ అంతా అస్తవ్యస్తం 

కొత్త కౌలు చట్టం పేరిట ఏడాదిగా కాలయాపన 

ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ సాయమంటూ హడావుడి 

పెట్టుబడి సాయానికి సీసీఆర్సీలే ప్రామాణికం 

ఏం చేయాలో పాలుపోని స్థితిలో కౌలుదారులు 

వ్యవసాయ రంగంలో 70–80 శాతం కౌలుదారులే ఉన్నారు. వీరికి సాగు హక్కు కార్డుల (సీసీఆర్సీ) జారీ కోసం ఏటా ఏప్రిల్, మే నెలల్లో సీసీఆర్సీ మేళాలు నిర్వహించేవారు. ఖరీఫ్‌ సాగు ప్రారంభంలోనే ప్రతి కౌలుదారునికి భూ యజమాని అనుమతితో సాగు హక్కు కార్డులు జారీ చేసేవారు. 

ఈ ఏడాది మరో 15 రోజుల్లో తొల­కరి సాగు మొదలవుతున్నప్పటికీ ఇప్పటివరకు కా­ర్డుల జారీ ప్రక్రియ పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో విత్తనాల నుంచి రుణాల వరకు, పెట్టుబడి సాయం నుంచి పెట్టుబడి రాయితీ వరకు అందుతాయో లేదోననే ఆందోళన కౌలు రైతుల్లో నెలకొంది.   

32 లక్షల మంది కౌలుదారులు
రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులుండగా, వారిలో సొంత భూమి సెంటు కూడా లేని కౌలుదారుల సంఖ్య 10లక్షల పైమాటే. బ్యాంకుల ఆంక్షలతో రుణాలకు దూరమయ్యే వీరు పెట్టుబడి కోసం ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించి రూ.3, రూ.5 వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేసేవారు. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ భూ యజమానుల హక్కులకు భంగం కలగని రీతిలో కౌలుదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తీసుకొచ్చిన సీసీఆర్సీ–2019 చట్టం ద్వారా వాస్తవ సాగుదారులకు 11 నెలల కాల పరిమితితో ఏటా సీసీఆర్సీలు జారీ చేసేవారు. 

ఇందుకోసం ఖరీఫ్‌ ప్రారంభానికి ముందుగానే సీసీఆర్సీ మేళాలు నిర్వహించేవారు. ఇలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య 25.94 లక్షల మందికి కార్డులు జారీ చేసింది. వీటి ప్రామాణికంగానే పంట రుణాలతోపాటు వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి సంక్షేమ ఫలాలు అందించడంతోపాటు కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తులను కళ్లాల నుంచే కొనుగోలు చేసింది. 

గడచిన ఐదేళ్లలో 6.78 లక్షల మందికి రూ.8,345 కోట్ల పంట రుణాలిచ్చింది. 5.57 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కౌలుదారులకు రూ.751.42 కోట్లను రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా అందించింది. 3.55 లక్షల మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 2.42 లక్షల మందికి రూ.253.56 కోట్ల పంట నష్టపరిహారం అందించింది.

అన్నదాత సుఖీభవకు దూరం 
అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. తొలి
విడత సాయం ఈ నెలాఖరులో జమ చేస్తామంది. కౌలు కార్డుల జారీ ప్రక్రియ ఇంకా మొదలు కాకపోవడంతో కార్డుల ప్రామాణికంగా పెట్టుబడి సాయం ఏవిధంగా అందిస్తారని కౌలు రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం అందించే పీఎం కిసాన్‌ సాయానికి కౌలు రైతులు దూరమయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వీరికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ,13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించేది. కానీ.. కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలేమీ చేపట్టడం లేదు.  

ఏడాది గడిచినా..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కౌలు రైతులు ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2024–25 సీజన్‌లో 10 లక్షల మంది కౌలుదారులకు కార్డులు జారీ లక్ష్యంగా నిర్దేశించింది. 9.13 లక్షల మంది కౌలుదారులకు కార్డులు జారీ చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వీరికి పెట్టుబడి సాయంతో పాటు ఏ ఒక్కరికీ బీమా పరిహారం, నష్టపరిహారం వంటివేమీ అందలేదు. మరోవైపు సీసీఆర్సీ చట్టం స్థానంలో కొత్త కౌలుచట్టం తెస్తామంటూ కూటమి ఇచ్చిన హామీ ఏడాది గడిచినా కార్యరూపం దాల్చలేదు. 

పాత కౌలుచట్టం ప్రకారమే ఈ ఏడాది కూడా 10 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయాలని నిర్ణయించారు. అయితే, భూ యజమానులు సమ్మతి తెలిపేందుకు ముందుకు రాలేదు. వారిని ఒప్పించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది విఫలమవుతున్నారు. కొత్త కార్డుల జారీ మాట దేవుడెరుగు.. ఉన్న కార్డులను సైతం రెన్యువల్‌ చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో సీజన్‌ ముంచుకొస్తున్నప్పటికీ సీసీఆర్సీ జారీ అడుగు ముందుకు పడటం లేదు.

కౌలుదారులకు మొండిచేయి 
కార్డుల జారీలో జాప్యం వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీసీఆర్సీ చట్టం–2019 స్థానంలో తెస్తామన్న కొత్త చట్టానికి అతీ­గతీ లేదు. గతేడాది వర్షాకాల సమావేశాల్లోనే తెస్తామన్న ఈ బిల్లు ఏ దశలో ఉందో కూడా చెప్పడం లేదు. సీజన్‌ ముంచుకొస్తున్నా ఏ ఒక్కరికీ కార్డు జారీ చేయలేదు. కౌలుదారులకు రుణా­లు అందడం లేదు. అన్నదాత సుఖీభవ సాయం కూడా వీరికి అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. – పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం  

Back to Top