రాష్ట్రానికి రాహుకాలం..చ‌దువుల‌కు `చంద్ర‌` గ్ర‌హ‌ణం

వైయ‌స్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులు సర్వ నాశనం 

ఎమ్మెల్సీ పి. చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఫైర్‌

తాడేప‌ల్లి:  కూట‌మి పాల‌న‌లో రాష్ట్రానికి రాహుకాలం వ‌చ్చింద‌ని, పేద‌ల చ‌దువుల‌కు చంద్ర గ్ర‌హ‌ణం ప‌ట్టింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు.  టీడీపీ కూట‌మి పాల‌న‌లో విద్యారంగాన్ని విధ్వంసం చేశార‌ని, వైయ‌స్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను  సర్వ నాశనం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్రీహైస్కూల్స్, శాటిలైట్ స్కూల్స్ వంటి రీఫామ్స్ తీసుకువ‌చ్చి 25 వేల మంది టీచర్లకు వైయ‌స్ జగన్ ప‌దోన్న‌తులు క‌ల్పించార‌న్నారు.  జీవో 117 తో వైయ‌స్ జగన్ తెచ్చిన మార్పులు ఎప్పటికీ గుర్తుండి పోతాయ‌ని, చంద్రబాబు తెచ్చిన 9 రకాల వ్యవస్థల వలన విద్యారంగం నాశన‌మైంద‌న్నారు.  వైయ‌స్ జగన్ మీద ఉన్న కోపాన్ని స్కూళ్ల మీద చూపిస్తూ వాటిని నాశనం చేస్తున్నారని మండిప‌డ్డారు.  బుధ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి  మీడియాతో మాట్లాడారు.     

మూడు జీవోల‌తో విద్యారంగానికి చీక‌టి రోజులు  

  గ‌త వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో విద్యారంగంలో స‌మూల మార్పులు తీసుకొచ్చేందుకు ఉద్యోగుల‌ జీతాలు కాకుండా దాదాపు రూ. 73 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింది. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత దేశంలో ఇంత‌గొప్ప‌గా ఏ రాష్ట్రంలోనూ మార్పులు జ‌రిగింది లేదు. గ‌తంలో మా ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో నెంబ‌ర్ 117ను ర‌ద్దు చేస్తామ‌ని టీచ‌ర్ల‌కు హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు, దాదాపు ఏడాది కాలంగా కాల‌యాప‌న చేస్తూ వ‌చ్చాడు. చివ‌రికి నిన్న జీవోనెంబ‌ర్ 117కి ప్ర‌త్యామ్నాయంగా 3 కొత్త జీవోలు తీసుకొచ్చి టీచర్ల‌ను గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఈ మూడు జీవోలు చూసిన త‌ర్వాత ప్ర‌భుత్వ విద్యారంగాన్ని చంద్ర‌బాబు నాశ‌నం చేయ‌డానికే కంక‌ణం క‌ట్టుకున్నాడ‌ని ఉద్యోగులే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ త‌న పాల‌న‌లో విద్యావిప్ల‌వం తీసుకొస్తే చంద్ర‌బాబు విద్యారంగాన్ని విధ్వంసం చేస్తున్నాడ‌ని టీచ‌ర్లు బాహాటంగానే చెబుతున్నారు. విద్యా వ్య‌వ‌స్థ‌కు కూట‌మి ప్ర‌భుత్వం చంద్ర‌గ్ర‌హ‌ణంలా ప‌ట్టుకుంద‌ని, ఈ ఐదేళ్లు విద్యారంగానికి రాహు కాల‌మేన‌ని టీచ‌ర్లే చెబుతున్నారు. జీవో నెంబ‌ర్లు 19, 20, 21తో ప్ర‌భుత్వ విద్యారంగాన్ని స‌ర్వ నాశ‌నం చేసే కుట్ర‌లు జ‌రుగుతున్నాయి. 

నాడు జీవో నెంబ‌ర్ 117తో విద్యా విప్ల‌వం 

గ‌తంలో అంగ‌న్‌వాడీల‌తో క‌లిపి నాలుగు రకాల స్కూల్స్ ఉంటే, వైయ‌స్ జ‌గ‌న్ తీసుకొచ్చిన జీవో నెంబ‌ర్ 117 ద్వారా 6 ర‌కాల స్కూల్స్ విధానానికి శ్రీకారం చుట్టారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో తీసుకొచ్చిన జీవో నెంబ‌ర్ 117 ద్వారా అంగ‌న్‌వాడీ పాఠ‌శాల‌ల‌ను ఎల్కేజీ, యూకేజీల‌తో  శాటిలైట్ పాఠ‌శాల‌లుగా మార్చాల‌నుకున్నారు. ప్రైమ‌రీ స్కూల్స్‌లో ఉన్న పిల్ల‌ల‌ను కార్పొరేట్ స్కూల్స్‌తో స‌మానంగా తీర్చిదిద్దేందుకు మూడో త‌ర‌గ‌తి నుంచే సబ్జెక్టు టీచ‌ర్ విధానం తీసుకొచ్చాం. ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉన్న అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్స్‌ను 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు పెంచి వాటిని ప్రి హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేయాల‌ని నిర్ణ‌యించాం. ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివి డ్రాపౌట్ అవుతున్న అమ్మాయిల‌ను దృష్టిలో ఉంచుకుని వారిని చ‌దువుల వైపు ప్రోత్స‌హించేందుకు ద‌గ్గ‌ర్లోనే ఉన్న హైస్కూల్స్‌లోనే ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివించాల‌ని హైస్కూల్ ప్ల‌స్ విధానం తీసుకొచ్చాం. చ‌దువుల‌ను ప్రోత్స‌హించ‌డానికి తీసుకొచ్చిన వినూత్న విధానాల‌ను పాపాలుగా నాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబు ప్ర‌చారం చేసి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం మీద బుర‌ద‌జ‌ల్లాడు. 

వైయ‌స్ జ‌గ‌న్ తీసుకొచ్చిన వినూత్న విధానాల ద్వారా 25 వేల మంది టీచ‌ర్ల‌కు వివిధ ర‌కాలుగా ప్ర‌మోషన్లు పొందారు. ఇంత భారీ స్థాయిలో టీచ‌ర్లు ప్ర‌మోష‌న్లు పొంద‌డం గ‌తంలో ఏనాడూ జ‌ర‌గ‌లేదు. 8 వేల మంది పీజీటీల‌కు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్న‌తి పొందారు. సుమారుగా 10,254 మంది లాంగ్వేజ్ పండిట్స్‌కి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్న‌తి పొందారు. 2600 మంది పీఈటీల‌కు స్కూల్ అసిస్టెంట్లుగా, 673 ఎంఈవో 2 పోస్టులు క్రియ‌ట్ చేసి ప‌దోన్న‌తి ఇచ్చారు. ఇదంతా జీవో నెంబ‌ర్ 117 ద్వారానే జ‌రిగింది. ఇప్పుడు చంద్ర‌బాబు తీసుకొచ్చిన జీవో నెంబ‌ర్ 19, 20, 21 ల ద్వారా ప్ర‌భుత్వ బ‌డులు ఉంటాయో లేదో కూడా అనుమానం క‌లిగే ప‌రిస్థితులు తీసుకొచ్చారు. 

జీవో నెంబ‌ర్ 117ను ర‌ద్దు చేసి పాత రోజుల్లో ఉన్న నాలుగు ర‌కాల స్కూల్స్ విధానాన్ని తీసుకొస్తాన‌ని ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు హామీ ఇచ్చాడు. తీరా అధికారంలోకి వ‌చ్చి ఏడాది పాల‌న పూర్తి చేసుకుంటున్న త‌రుణంలో ఇచ్చిన హామీకి భిన్నంగా 9 ర‌కాల స్కూల్స్ విధానాన్ని తీసుకొస్తూ జీవో నెంబ‌ర్లు 19, 20, 21 ఇచ్చారు. విద్యావ్య‌వ‌స్థ‌ను పూర్తిగా అగమ్య‌గోచ‌రంగా మార్చే విధానానికి చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. స్టాన్‌ఫ‌ర్డ్‌లో చ‌దివాన‌ని గొప్ప‌లు చెప్పుకునే మంత్రి లోకేష్‌కి ప్ర‌భుత్వ స్కూల్ విధానం ఇప్ప‌టికీ అర్థం చేసుకోవ‌డంలో ఫెయిల‌య్యారు. 

కొత్త జీవోల వ‌ల్ల న‌ష్టాలు.. 

- గ‌తంలో ప్రైమ‌రీ స్కూల్స్‌ను ఫౌండేష‌న్ స్కూల్స్‌గా మారుస్తామంటే ప్రైమ‌రీ స్కూల్ వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంద‌ని గ‌గ్గోలు పెట్టిన చంద్ర‌బాబు, ఈరోజు ఆయ‌న తీసుకొచ్చిన విధానం ద్వారా 5,058 స్కూల్స్ ని ఫౌండేష‌న్ స్కూల్స్ గా మార్చేశారు. గ‌తంలో ఈ ఫౌండేష‌న్ స్కూల్స్ సంఖ్య కేవ‌లం 4731 మాత్ర‌మే ఉండేది.  దీంతోపాటు గ‌తంలో 20 మంది విద్యార్థుల వ‌ర‌కే సింగిల్ టీచ‌ర్ ఉంటే, చంద్రబాబు 30 మంది విద్యార్థులకు పెంచేశారు. ఈ నిర్ణ‌యం కార‌ణంగా దాదాపు 99 శాతం ఫౌండేష‌న్ స్కూల్స్ లో సింగిల్ టీచ‌ర్లే ఉండే ప్ర‌మాదాన్ని చంద్ర‌బాబు సృష్టించారు.  

- గ‌తంలో దాదాపు 34 వేల ప్రైమ‌రీ స్కూల్స్ ఉంటే వాటిని మూడు ముక్క‌లు చేశారు. 20 వేల బేసిక్‌, 7,953 మోడ‌ల్‌, హైస్కూల్స్‌లోనే ప్రైమ‌రీ స్కూల్స్ అంటూ 1661 స్కూల్స్‌ను మార్చేశారు. ఈ స్కూల్స్‌లో వైష‌మ్యాలు సృష్టించేలా టీచ‌ర్ల కేటాయింపు చేశారు. బేసిక్ ప్రైమ‌రీ స్కూల్స్‌లో 20 మంది విద్యార్థుల‌కి సింగిల్ టీచ‌ర్, 60 మంది వ‌ర‌కు ఇద్ద‌రు టీచ‌ర్ల విధానం తీసుకొచ్చారు. మోడ‌ల్ ప్రైమ‌రీ స్కూల్స్ లో 60 మంది వ‌ర‌కు న‌లుగురు టీచ‌ర్లను కేటాయించారు. హైస్కూల్స్‌లో ఏర్పాటు చేసే ప్రైమ‌రీ స్కూల్స్ లో 10 మందికి ఒక ఎస్జీటీ, 30 మందికి రెండో ఎస్టీటీ ఇస్తామ‌ని నిబంధ‌న పెట్టారు. ఒక్కో ప్రైమ‌రీ స్కూల్స్‌లో ఒక్కో విధానం ఏంటో అర్థం కావ‌డం లేదు. ఎందుకీ వైష‌మ్యాలు సృష్టిస్తున్నారు?  ఈ విధానం కార‌ణంగా ప్ర‌భుత్వ బడుల్లో చేర్చాల‌న్న త‌ల్లిదండ్రులు కూడా టీచ‌ర్లు లేర‌న్న కార‌ణంతో ప్రైవేటు స్కూల్స్ లో చేర్చడానికి సిద్ధ‌మ‌వుతారు. ఈ అనాలోచిత నిర్ణ‌యంతో దాదాపు 26 వేల  ప్ర‌భుత్వ బ‌డులు మూత‌బ‌డే ప్ర‌మాదం ఉంది. 

గ‌తంలో 3,158 అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్స్ ఉంటే, దాన్ని పూర్తి ర‌ద్దు చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించాడు. దీన్ని వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా వ్య‌తిరేకించడంతో ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. సుమారుగా 1303 అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్స్ కొన‌సాగిస్తామ‌ని, 1076 అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్స్ బేసిక్ ప్రైమ‌రీ స్కూల్స్‌గా మార్చేస్తామ‌ని మ‌రో అడ్డ‌గోలు నిర్ణ‌యం తీసుకుంది. ఈ 1303 అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్స్ లో 6, 7,8 త‌ర‌గ‌తుల‌కు 10 మందికి ఒక ఎస్జీటీనే ఇస్తామ‌ని అది కూడా హిందీ లేదా తెలుగు టీచ‌ర్స్‌నే ఇస్తామ‌ని మెలిక పెట్టారు. మూడు త‌ర‌గ‌తుల‌కు 18 స‌బ్జెక్టుల‌ను ఒకే టీచ‌ర్ బోధించ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నేనా?  స్కూల్స్‌ను నేరుగా ఎత్తేయ‌కుండా భారంగా న‌డిపేలా కుట్రలు చేస్తున్నారు. గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ వ్య‌వ‌స్థ మీద‌నే విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌కు విర‌క్తి పుట్టే నిర్ణ‌యం ఇది. ప్రైమ‌రీ, హైస్కూల్స్ ను ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఒకే కాంపౌండ్‌లో ఉంచి ఒకే హెడ్మాస్ట‌ర్  ప‌ర్య‌వేక్ష‌ణ కిందకి తీసుకొచ్చారు. 

- మా ప్ర‌భుత్వం 117 జీవో ద్వారా గ్రామీణ విద్యార్థుల కోసం హైస్కూల్ ప్ల‌స్ వ్య‌వ‌స్థ‌ను తీసుకొస్తే, కూట‌మి ప్ర‌భుత్వం ర‌ద్దు చేస్ కుట్ర చేసింది. వైయ‌స్ఆర్‌సీపీ పోరాటంతో వెన‌క్కి త‌గ్గిన ప్ర‌భుత్వం 292 హై స్కూల్స్ ప్ల‌స్‌ను తాత్కాలికంగా మాత్ర‌మే కొన‌సాగిస్తామ‌ని మ‌రో 210 హైస్కూల్స్ ప్ల‌స్‌ను ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. 1800 మంది పీజీటీలు అవ‌స‌రం ఉంటే ప్ర‌భుత్వం నియ‌మించ‌డం లేదు. వైయ‌స్ జ‌గ‌న్ మీద ఉన్న కోపాన్ని విద్యార్థుల మీద చూపించి టోట‌ల్‌గా విద్యావ్య‌వ‌స్థ‌నే నాశ‌నం చేసే నిర్ణ‌యాలు తీసుకున్నారు. 

- డీఎస్సీ నోటిఫికేష‌న్ ద్వారా 16,347 పోస్టులు భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు, కొత్త‌గా ఇచ్చిన మూడు జీవోల ద్వారా కేవ‌లం 13,192 మాత్ర‌మే ఖాళీలున్న‌ట్టు చూపిస్తున్నారు. ఈ లోటును భ‌ర్తీ చేస్తారో లేదో చెప్ప‌డం లేదు. డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న నాలుగు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల‌ను క‌న్ఫ్యూజ్ చేస్తున్నారు. 

 ప్రైమ‌రీ స్కూల్స్‌కి స్కూల్ అసిస్టెంట్‌ల‌ను తీసుకురాకూడ‌ద‌నే నిబంధ‌న ఉన్నా, బీఈడీ  చేసిన స్కూల్ అసిస్టెంట్‌ల‌ను ప్రైమ‌రీ స్కూల్స్‌కి హెచ్ఎంలుగా మార్చేడానికి నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యం కార‌ణంగా ఎస్జీటీలుగా ఉన్న‌వారికి ప్ర‌మోష‌న్ కింద ప్రైమ‌రీ స్కూల్స్‌కి హెచ్ఎంలుగా వెళ్ల‌డానికి ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి. భ‌విష్య‌త్తులో ప్ర‌మోష‌న్లు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉండ‌దు. 

- 2215 జెడ్పీ పోస్టుల‌ను వేరే మేనేజ్‌మెంట్‌కు మారుస్తామ‌ని చెప్ప‌డం సాధ్య‌మేనా? ఎలా చేస్తామంటున్నారు. 2754 క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ అకడ‌మిక్  కింద టీచ‌ర్స్ ను హోల్డ్ చేస్తామంటున్నారు. వీళ్ల‌ను సింగిల్ టీచ‌ర్లు ఉన్న చోట‌కు పంపిస్తే విద్యార్థుల‌కు నాణ్య‌మైన బోధ‌న అందించ‌వ‌చ్చు క‌దా. వీళ్ల‌ను రోజుకోక స్కూల్‌కి టీచింగ్ కోసం పంప‌డం వారిని వేధించ‌డం కాదా? ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌వ‌స్థ‌. ఇంగ్లిష్ మీడియంతోపాటు తెలుగు మీడియం తెస్తామ‌ని చెప్పి, ఇప్పుడు దాని గురించి మాట్లాడ‌టం లేదు. 

బ‌డులు స‌మూలంగా మూత‌ప‌డే ప్ర‌మాదం 

2014-19 మ‌ధ్య మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా పెట్ట‌క‌పోతే, 2019లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వ‌చ్చాక మెనూలో స‌మూల‌మైన మార్పులు తీసుకొచ్చి నాణ్య‌మైన పౌష్టికాహారం భోజ‌నం అందించాం. అమ్మ ఒడి కింద పిల్ల‌ల త‌ల్లుల ఖాతాల్లో రూ. 15వేలు జమ చేశాం. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌క్కాగా అమ‌లు చేశాం. నాడు -నేడు ద్వారా స్కూల్స్ రూపురేఖ‌ల‌ను పూర్తిగా మార్చి కార్పొరేట్‌కి దీటుగా తీర్చిదిద్దాం. ఇన్ని చేశాం కాబ‌ట్టే ప్ర‌భుత్వ బ‌డుల్లో డ్రాపౌట్స్ త‌గ్గించగ‌లిగాం.  ఇన్ని మార్పులు తీసుకొచ్చినా నిస్సిగ్గుగా డ్రాపౌట్స్ పెరిగారంటూ అర్థంలేకుండా మాపై దుష్ప్ర‌చారం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం తీసుకొచ్చిన 9 బడుల విధానంతో విద్యారంగాన్ని విధ్వంసం చేస్తోంది. మా హ‌యాంలో తీసుకొచ్చిన వెయ్యి సీబీఎస్ఈ స్కూల్స్‌ను ర‌ద్దు చేశారు. ఐబీ సిల‌బ‌స్‌, టోఫెల్ శిక్ష‌ణ ర‌ద్దు చేశారు. ట్యాబ్‌లు ఇవ్వ‌డం లేదు. డిజిట‌ల్ బోర్డులు, బాత్‌రూమ్‌ల మెయింటినెన్స్ లేదు. త‌ల్లికి వంద‌నం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వ‌డం లేదు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చి ఏడాది గ‌డ‌వ‌కుండానే విద్యా వ్య‌వ‌స్థ‌ను స‌ర్వ‌నాశ‌నం చేశారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా త‌మ నిర్ణ‌యాల‌ను స‌వ‌రించుకోవాల‌ని టీచ‌ర్ల త‌ర‌ఫున ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

Back to Top