తాడేపల్లి: చారిత్రక ప్రాధాన్యత కలిగిన విజయవాడపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఎన్డీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఆర్ పై ఉన్న కోపంతో, ఆయన పేరుతో విజయవాడ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడం వల్లే విజయవాడపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి గన్నవరం ఎయిర్‌పోర్ట్ మూసివేత, హెల్త్ యూనివర్సిటీని తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పాలన పూర్తికావొస్తున్నా విజయవాడ నగరంలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ది కార్యక్రమం కూడా తీసుకురాలేదు. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే వైయస్ జగన్ విజయవాడ నగరంలో గణనీయమైన అభివృద్ది కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ నిర్మాణం మొదలుపెట్టి పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేస్తే, వైయస్ జగన్ దాని పనులను వేగవంతం చేసి, విజయవంతంగా ప్రారంభించారు. విజయవాడలో ముఖ్యమైన బెంజి సర్కిల్ ఒక ఫ్లైఓవర్ ను చంద్రబాబు పాలనలో అసంపూర్తిగా వదిలేస్తే దాన్ని పూర్తి చేయడంతోపాటు రెండో ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చిన ఘనత వైయస్ జగన్ కే దక్కుతుంది. పశ్చిమ బైపాస్ పనులు పూర్తయితే అమరావతికి నష్టం జరుగుతుందని భావించి చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేస్తే, వైయస్ జగన్ సీఎం కాగానే పనులు పూర్తి చేయడమే కాకుండా తూర్పు బైపాస్ పనులు కూడా ప్రారంభించారు. ఆయన చేసిన పనులు కారణంగానే సంక్రాంతి వంటి సమయంలో ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. కృష్ణానది వరదల నుంచి కాపాడారు విజయవాడకి వరదలు వచ్చినప్పుడు దాదాపు 12 లక్షల క్యూసెక్కుల నీరు నగరాన్ని ముంచెత్తినా రాణిగారితోట, కృష్ణలంక ప్రాంతంలో ఒక్క ఇళ్లు కూడా ముంపునకు గురికాలేదు. ఆనాడు ముందుచూపుతో రూ.382 కోట్లతో వైయస్ జగన్ రిటైనింగ్ వాల్ నిర్మించిన కారణంగానే ప్రజలకు వరద నుంచి రక్షణ లభించింది. ఎన్నికలకు ముందు రిటైనింగ్ వాల్ కడతామని హామీ ఇచ్చిన చంద్రబాబు విజయవాడ ప్రజలను పట్టించుకోకుండా వదిలేశాడు. కానీ వైయస్ జగన్ తన పాదయాత్రలో రిటైనింగ్ వాల్ కడతానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పుష్కరాల సందర్భంగా పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు నాయుడు 44 ఆలయాలను కూల్చివేస్తే, వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని పునర్ నిర్మించారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేశారు. విజయవాడలో ప్రతి సెగ్మెంట్‌లో కొత్త సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల నిర్మాణం అభివృద్ధి చేయడంతోపాటు జీజీహెచ్‌లో రూ. 150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. కోవిడ్ సమయంలో ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడగలిగాం. అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారు విజయవాడ నడిబొడ్డున ఉన్న స్థలాన్ని సింగపూర్, జపాన్ కంపెనీలకు చంద్రబాబు అప్పనంగా కట్టబెడదామనుకుంటే, అందులో రూ. 400 కోట్లతో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా టూరిస్ట్ స్పాట్‌గా దానిని అభివృద్ధి చేశారు. అంబేడ్కర్ గొప్పతనం భావితరాలకు తెలిసేలా మినీ థియేటర్ ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఏ ఒక్కరూ ఒక్క పూలదండ కూడా ఆ మహనీయుడికి వేయలేదు. పైపెచ్చు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి సందర్భాల్లో లైటింగ్ తీసేసి మరీ మహనీయుణ్ని అవమానాలకు గురిచేస్తున్నారు. వివక్ష చూపిస్తున్నారు. బ్యూటిఫికేషన్ పనులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. విజయవాడ మీద చంద్రబాబుకి చిన్న చూపు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడకు తీవ్రమైన అన్యాయం చేశారేకానీ ఏ ఒక్క మేలు చేసిన పాపాన పోలేదు. విజయవాడకి బ్రాండ్‌గా ఉన్న ఎయిర్‌పోర్టును, హెల్త్ యూనివర్సిటీని అమరావతికి తరలించాలని కుట్ర చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చడానికి ఒక టెర్మినల్ నిర్మాణం పూర్తయింది. రెండో దానికోసం రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వేలాది ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. ఇప్పుడు అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కట్టే పేరుతో గన్నవరం విమానాశ్రయాన్ని మూసేయాలని కుట్ర పన్నారు. గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు ఏం సమాధానం చెబుతారు? వారికి ఏం న్యాయం చేస్తారు? విజయవాడ నగరమంటే ఎందుకింత చిన్నచూపు? అమరావతి రాజధాని నిర్మాణాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ అమరావతి పేరుతో విజయవాడ బ్రాండ్‌ను నాశనం చేస్తుంటే మాత్రం సహించేది లేదు. దాదాపు 16 లక్షల మంది నివసిస్తున్న విజయవాడను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో ఐదు గ్రామాల ప్రజలను భయపెట్టి స్పోర్ట్స్ సిటీ పేరుతో భూములను లాక్కోవాలని చూస్తున్నారు. ఈ ప్రాంతంలో క్రషర్స్ బిజినెస్ ఎక్కువగా నడుస్తుంది. స్పోర్ట్స్ సిటీ వస్తే ఈ వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉంది. వారికి ఏం సమాధానం చెబుతారు? అమరావతి పేరుతో విజయవాడ బ్రాండ్‌ను దెబ్బతీసే కార్యక్రమాలను వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు. ప్రజల తరఫున పోరాడుతుంది.