ఢిల్లీ: మద్యం విధానం కేసులో మెకానికల్ అరెస్టులు సరికాదని దేశ అత్యున్నత న్యాయ స్థానం ఏపీ సీఐడీకి హితవు పలికింది. ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా విచారణ జరపాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ‘‘గత విచారణ సందర్భంగా ఈ కేసులో ఆధారాలను హైకోర్టు సరిగ్గా పరిశీలించలేదు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను మరోసారి హైకోర్టు పరిశీలించాలి. దర్యాప్తు అధికారి సేకరించిన మెటీరియల్ హైకోర్టు చూడాలి. ఈ కేసులో పిటీషనర్ పాత్రకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదు. అరెస్ట్‌కు సహేతుక కారణాలు చూపించాలి. మెకానికల్ అరెస్టులు సరికాదు. కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయాలని యోచన సరికాదు’’ అని సుప్రీంకోర్టు తెలిపింది. ‘‘పార్లమెంట్ సభ్యుడి పరువు ప్రతిష్టలను పరిగణలోకి తీసుకోవాలి. తాజాగా మరోసారి పిటిషన్ హైకోర్టు విచారణ చేయాలి. ఏపీ హైకోర్టు తగిన అఫిడవిట్ దాఖలు చేయాలి. హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు మిథున్‌రెడ్డిని అరెస్టు చేయొద్దు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.