ఆపరేషన్ సిందూర్ విజయవంతం హర్షణీయం 

ఆర్మీ, ప్రధాని నిర్ణయం భారతీయులకు గర్వకారణం 

తలసీమియా వ్యాధిగ్రస్తులకు జైన్ సేవా సమితి సేవలు అద్వితీయం

ప్రతిఒక్కరు అవగాహన కల్గి ఉండాలి

రక్తదానం వలన వేలాది మంది పిల్లల ప్రాణ దానం చేసినట్లే  

రక్తదానం చేసిన మాజీ ఎంపీ భరత్ 

రాజమహేంద్రవరం  : ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల మాజీ ఎంపీ,  వై.య‌స్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ హర్షం వ్యక్తంచేసారు. ఈ విషయంలో ప్రతి భారతీయుడు సగర్వంగా కాలర్ ఎగరేసుకుని ఉండేలా నిర్ణయం తీసుకున్న డైనమిక్ ప్రధాని మోడీ, ఆర్మీకి ఈ క్రెడిట్ దక్కుతుందని ఆయన అన్నారు. వారికి సెల్యూట్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  జైన్ సేవా సమితి  ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధిగ్రస్తుల సహాయం కోసం స్థానిక కొత్తపేట రౌతు తాతాలు కళ్యాణ మండపంలో   ఆదివారం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో  భరత్ పాల్గొని రక్తదానం చేసారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చాలామంది చిన్నపిల్లలు తలసీమియా వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకుని జైన్ సేవా సమితి రాజమండ్రిలోనే కాకుండా  దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. దత్తత తీసుకున్న విధంగా తలసేమియాతో బాధపడే పిల్లల పట్ల జైన్ సేవా సమితి సభ్యులు చూపిస్తున్న శ్రద్ధను భరత్ కొనియాడారు.  ఈ వ్యాధి ఎందుకు వస్తోందో, ఇది రాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పెళ్లిళ్లు చేసుకునేటప్పడు తలసీమియా వ్యాధికి సంబంధించిన టెస్టులు కూడా చేయించుకుంటే మంచిదని భరత్ పేర్కొన్నారు. రక్తదానం చేయడం వలన ఆ రక్తంతో కొందరికి ప్రాణం దానం చేసినట్లేనని గ్రహించి, ప్రతిఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని భరత్ సూచించారు. జాగృతి బ్లడ్ బ్యాంకు, మాగ్న ఆసుపత్రి సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఆయన అభిననందనలు తెలిపారు. అశోక్ కుమార్ జైన్, విక్రమ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top