తాడేపల్లి: ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది. ప్రతిభ ఉండి గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో సీట్లు సాధించి ఫీజులు కట్టలేక వెనకడుగు వేస్తున్న మన పిల్లలకు మనందరి ప్రభుత్వం అండగా నిలబడుతోంది. మన పిల్లలు బాగా చదువుకోవాలి.. ప్రపంచ వేదికపై మన ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలి’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. విదేశాల్లో చదువుకునే మన పిల్లలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని, చదువుకు పేదరికం అడ్డుకాకూడదని, పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువే అని బలంగా నమ్ముతున్నానని చెప్పారు. అందుకే విద్యారంగంపై పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా గరిష్టంగా రూ.1.25 కోట్లను చెల్లిస్తున్నామని చెప్పారు. టాప్ 200 యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన 213 మంది మన పిల్లలకు తొలి విడతగా రూ.19.95 కోట్ల సాయాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం గురించి సీఎం వైయస్ జగన్ మాటల్లో.. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మనం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుందని ఈ పథకంలో భాగస్వాములైన ప్రతి చెల్లెమ్మకు, ప్రతి తమ్ముడికి తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు ఇంకా మెరుగైన స్థానాల్లోకి వెళ్లాలని ప్రభుత్వం మీ మీద పెట్టుబడి పెడుతోంది. గొప్ప స్థానంలోకి వెళ్లినప్పుడు రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మన రాష్ట్ర జెండా మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎగురుతుంది. కార్నెగి మిలన్ యూనివర్సిటీలో రూ.1.16 కోట్ల ఫీజు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా కోటి రూపాయల ఫీజు, బాస్టన్ యూనివర్సిటీ, మాస్టర్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్‌మాటిక్స్ 97 లక్షల ఫీజు, హార్వర్డ్ యూనివర్సిటీ 88.70 లక్షల ఫీజులు.. ఇలా చూసుకుంటే.. గరిష్టంగా కోటి 16 లక్షల రూపాయల ఫీజు మన పిల్లల చదువుల కోసం మనం చెల్లిస్తున్నాం. ప్రతిభ ఉండి, మంచి యూనివర్సిటీల్లో సీటు వచ్చినా కూడా డబ్బులు కట్టలేక, తల్లిదండ్రుల మీద భారం వేయడం ఇష్టంలేక సామాన్యులు, పేదల పిల్లలు పెద్ద చదువులు చదవడానికి వెనకడుగు వేసే పరిస్థితి. ఈరోజు ఆ విద్యార్థులకు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం మీకు తోడుగా ఉందనే భరోసా కల్పించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని, పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువే అని బలంగా నమ్ముతున్నాను. ఎడ్యుకేషన్‌లో మనం పెట్టే ప్రతి రూపాయి హ్యుమన్ రిసోర్సెస్‌లో పెట్టడం వల్ల వారి కుటుంబాల తలరాతలు మారడమే కాకుండా.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాత మార్చే గొప్ప పరిస్థితి వస్తుంది. పెద్దల గురించి ప్రస్తావన చేయాల్సి వస్తే.. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇలా గొప్ప నాయకులంతా.. గొప్ప గొప్ప యూనివర్సిటీల నుంచి వచ్చినవారే. నేటి ప్రపంచంలో మెరుగైన స్థానాల్లో ఉన్న ఇండస్ట్రీ లీడర్స్.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, ఐబీఎం అరవింద్ కృష్ణ, అడోబ్ శంతన్ నారాయణ్, గూగుల్ సుందర్ పిచాయ్..వీరి దగ్గర నుంచి మొదలుపెడితే.. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ దగ్గర నుంచి అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హ్యారీస్ వరకు.. మీలో కూడా ఆ డ్రీమ్స్ రావాలి. ఆ టార్గెట్ పెట్టుకొని ముందుకు అడుగేయండి.. ప్రభుత్వం మీకు మంచి వేదికను అందిస్తోంది. ఆ స్థాయిలోకి వెళ్లి.. ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలని బలమైన కోరికతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే.. ఆ సీటుకు డబ్బులు కట్టలేకపోవడం వల్ల వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదనే ఆలోచనతో పారదర్శకమైన పద్ధతిలో బెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ, కాలేజీలను (టాప్ 200 కాలేజీలను) గుర్తించాం. వాటి జాబితాను ప్రదర్శించడం జరుగుతుంది. బెస్ట్ యూనివర్సిటీ, కాలేజీల్లో మన పిల్లలకు సీటు వస్తే పారదర్శకంగా వారికి సపోర్ట్ చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. గతంలో ఉన్న పథకాలన్నీ అధ్యయనం చేశాం.. అవి కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయి. కేవలం రూ.10 లక్షలు, ఎస్టీ, ఎస్సీలకు అయితే రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చే పరిస్థితి గతంలో ఉండేది. ఈ డబ్బుతో విద్యార్థులకు మంచి జరగదు.. వారిలోని సై్థర్యాన్ని నీరుగార్చేలా గత ప్రభుత్వాలు ప్రవర్తించాయి. 2016–17లో విదేశీ విద్య అభ్యసిస్తున్న పిల్లలకు డబ్బులు రూ.300 కోట్లు బకాయిలుగా పెట్టడంతో ఆ పథకమే పూర్తిగా నీరుగారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కేవలం కొందరికి మాత్రమే చెత్త యూనివర్సిటీల్లో సీటు వచ్చినా సపోర్టు చేశారు. ఒక వ్యవస్థలో మంచి చేయాలనే తపన అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి నుంచి.. మన ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిస్థితులన్నీ మార్చాలనే తపన, తాపత్రయం నుంచి ఈ ఆలోచన పుట్టుకొచ్చింది. రాష్ట్రంలో ఇవాళ మన స్కూల్స్, కాలేజీలను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తూ, పిల్లలు కూడా మన ఇనిస్టిట్యూట్‌లో చదువుకునేలా అడుగులు వేయిస్తూ.. మరోవైపు ఇంకా పెద్ద యూనివర్సిటీల్లో మన పిల్లలకు సీటు వస్తే వారిని కూడా పెద్ద చదువులు చదివించాలనే ఆలోచనతో ఈ పథకం పుట్టుకొచ్చింది. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏ విధమైన కోటాలు లేకుండా అర్హులైన విద్యార్థులందరికీ సంతృప్త స్థాయిలో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన‘.. ప్రతి ఏడాది 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు.. సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా పూర్తి పారదర్శకంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ వరల్డ్ యూనివర్సిటీ క్యూఎస్Sర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 200 యూనివర్శిటీల ఎంపిక జరిగింది. – పూర్తి ఆర్థిక సాయం.. ప్రతిభకు పెద్ద పీట వేస్తూ టాప్ 100 క్యూఎస్Sర్యాంక్ విశ్వవిద్యాలయాలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి గరిష్టంగా రూ. 1 కోటి వరకు ఎంతైతే అంత 100% ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్.. 100 నుండి 200 క్యూఎస్S ర్యాంకులు పొందిన యూనివర్శిటీలలో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.75 లక్షల వరకు 100% ట్యూషన్ ఫీజు రీయింబర్సె్మంట్, ఇక మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ. 50 లక్షలు లేదా ట్యూషన్ ఫీజులో 50% ఏది తక్కువైతే అది చెల్లింపు.. విదేశీ విశ్వవిద్యాలయానికి వెళ్లే విద్యార్థులకు విమాన, వీసా ఛార్జీలు సైతం రీయింబర్స్ చేస్తున్న మన ప్రభుత్వం.. – విదేశాలకు వెళ్ళే విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునేలా వారి చదువులు ఒక్కో మెట్టూ ఎక్కే కొద్ది 4 వాయిదాల్లో స్కాలర్షిప్స్ మంజూరు... ఇమ్మిగ్రేషన్ కార్డు (ఐ–94) పొందిన విద్యార్థులకు మొదటి వాయిదా. మొదటి సెమిస్టర్ ఫలితాల అనంతరం రెండవ వాయిదా, 2వ సెమిస్టర్ ఫలితాలు విడుదలైన తర్వాత 3వ వాయిదా. విజయవంతంగా 4వ సెమిస్టర్ పూర్తి చేసి మార్క్ షీట్ సంబంధిత ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేసిన తర్వాత చివరి విడతగా నాలుగవ వాయిదా చెల్లింపు.. తద్వారా శాచురేషన్ విధానంలో పూర్తి పారదర్శకంగా నిజమైన అర్హులందరికీ లబ్ధి... – కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి అర్హతను రూ. 8 లక్షలకు పెంచడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం.. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. తల్లిదండ్రుల మీద భారం లేకుండా, విద్యార్థులు వారి కాళ్ల మీద వారు నిలబడేలా అడుగులు వేయడం జరుగుతుంది. నాలుగు వాయిదాల్లో పారదర్శకంగా చెల్లిస్తున్నాం. 213 మంది మన ఆంధ్రరాష్ట్ర జెండా గొప్పగా ఎగురవేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఇందులో ఎస్సీలు 30 మంది, మైనార్టీలు 35 మంది, బీసీలు 35 మంది, ఈబీసీలు 67, కాపులు 46 మంది ఉన్నారు. ఎవరైనా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్కీమ్‌ను తీసుకువచ్చాం. మనం వేసే ప్రతి అడుగూ మన పిల్లలకు మంచి జరగాలని వేస్తున్నాం. పేదరికంలో ఉన్న ఏ ఒక్కరికీ నష్టం జరగకూడదనే గొప్ప ఆలోచనతో, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విదేశాల్లో చదువుకునే మన పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. సీఎంవో నుంచి ఒక టెలిఫోన్ నంబర్ ఇస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. సీఎంవోలోని ఒక అధికారి అందుబాటులో ఉంటారు. నేనే మీకు అండగా ఉన్నట్టే. మీకు అక్కడ ఏ సమస్య ఉన్నా.. ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటా. మీకు తోడుగా ఉండి అన్ని రకాలుగా అండగా నిలబడతా. మీరు అత్యున్నతస్థానాలకు ఎదగాలి.. మీ కుటుంబంతో పాటు రాష్ట్రం ఖ్యాతిని పెంచాలని ఆశిస్తున్నా.’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.