తాడేపల్లి: ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించిన పీఎం – కిసాన్ సమ్మాన్ అవార్డును అందుకున్న అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అందుకున్న పీఎం – కిసాన్ సమ్మాన్ అవార్డును సీఎంకు చూపించారు. ఈ మేరకు కలెక్టర్ గంధం చంద్రుడిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పీఎం–కిసాన్ పథకం ప్రవేశపెట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పలు విభాగాల్లో జిల్లాలకు కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించిన పీఎం–కిసాన్ సమ్మాన్ అవార్డుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్ గెలుచుకుంది. వివాదాల పరిష్కారాల విభాగంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, భౌతికపరిశీలన విభాగంలో అనంతపురం జిల్లా ఈ అవార్డుల్ని సాధించాయి. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నుంచి నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అవార్డులు అందుకున్నారు.