ఇది మంచికి – మోసానికి మధ్య యుద్ధం

పేదవాడికి – పెత్తందారులకు మధ్య యుద్ధం

వెన్నుపోటుదారులంతా కూటములు కట్టి మీ బిడ్డ జగన్‌పై యుద్ధం చేస్తారట

మీ జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకం అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది

కుట్రలు, కుతుంత్రాలు, కుళ్లు, మోసం, దత్తపుత్రుడు, మీడియా వారి ఆయుధాలు

దేవుడి దయ, నా అక్కచెల్లెమ్మల కుటుంబాలే నా నమ్మకం

వీధి రౌడీలకంటే దారుణమైన భాషను వాడేవారు నాయకులా..?

మూడు రాజధానులు కాదు.. మూడు పెళ్లిళ్లతో మేలు జరుగుతుందని చెబుతున్నారు

మన ఇంట్లో ఆడవారి పరిస్థితి, మన కూతుళ్లు, చెల్లెమ్మల పరిస్థితి ఏంటీ..?

మూడు, నాలుగు పెళ్లీళ్లు చేసుకోండి అంటే ఆడవారి మానప్రాణాలు ఏం కావాలి..?

అవనిగడ్డ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

అవనిగడ్డ: ‘‘వివక్ష, లంచాలు లేకుండా నేరుగా 87 శాతం ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చిన మన ప్రభుత్వానికి – ప్రజలకు ఏనాడూ మంచి చేయని పచ్చరంగు పెత్తందారుల కూటమికి మధ్య నిరంతర పోరాటం సాగుతుంది. నాకు దేవుడి దయతో పాటు మన పాలనలో మంచి జరిగిన ప్రతి కుటుంబంలోని అక్కచెల్లెమ్మలు, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి తల్లి, ప్రతి అవ్వ, ప్రతి తాత.. వీరంతా తోడుగా నిలబడతారనే నమ్మకం నాకుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధం. పేదవాడికి, పెత్తందారులకు మధ్య యుద్ధం. సామాజిక న్యాయానికి, సమాజాన్ని ముక్కలు చెక్కలుగా చేయాలనే ఆలోచనకు మధ్య జరుగుతున్న యుద్ధం అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అనేది ఒక్కటే కొలమానంగా తీసుకొని, మంచి జరిగితే జగనన్నకు తోడుగా నిలవండి అని పిలుపునిచ్చారు. 

ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలపై అవనిగడ్డ బహిరంగ వేదికగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వానికి, మీ జగనన్న ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘‘మనందరి ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యేలు ప్రతీ నియోజకవర్గంలో మీ ఇంటికి ఈ మేలు చేశామని సవినయంగా, సగర్వంగా చెప్పుకుంటూ ప్రతీ గడప గడప తిరుగుతూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గొప్పగా జరిగిస్తున్నారు. 

ఒకవైపున ఇంత మంచిచేస్తూ గడపగడపకూ వెళ్లి ప్రతీ అక్కాచెల్లెమ్మ ఆశీస్సులు పొందుతుంటే.. చెప్పుకోవడానికి ఏమీలేని వారంతా, ప్రజలకు గతంలో ఏ మేలు చేయనివారంతా ఈరోజు ఏం చేస్తున్నారో గమనించాలని ప్రజలను కోరుతున్నాను. వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి బూతులు తిట్టడంలో ఏ స్థాయిలోకి వెళ్లారో మనం చూశాం. మామూలు బూతులు కూడా కాదు.. వీధి రౌడీలు కూడా ఆ భాష మాట్లాడుతారో లేదో నాకు తెలియదు. నాయకులుగా చెప్పుకుంటున్నవారు మీడియా ముందుకు  వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతుంటే.. ఇలాంటి వారు మన నాయకులా అని ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. 

ఇంటింటా అవ్వాతాతల గురించి, అక్కచెల్లెమ్మల గురించి, ప్రతీ కుటుంబంలో ఉన్న బిడ్డల గురించి మనం ఆలోచిస్తుంటే.. మొన్ననే దత్తపుత్రుడితో దత్తతండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నాడో మనమంతా చూశాం. మనం ఎవ్వరికీ అన్యాయం చేయకుండా ఏ ప్రాంతానికి అన్యాయం చేయకుండా మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని మనం చెబుతుంటే.. కాదు, మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుంది.. మీరూ చేసుకోండి అని ఏకంగా టీవీల్లో నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఈ మాదిరిగా మాట్లాడటం మొదలు పెడితే మన ఇంట్లో ఆడవారి పరిస్థితి ఏంటీ..? మన కూతుళ్ల పరిస్థితి ఏంటీ..? మన చెల్లెమ్మల పరిస్థితి ఏంటీ..? ప్రతీ ఒక్కరూ నాలుగుఐదేళ్లు కాపురం చేసి విడాకులు ఇచ్చేసి ఎంతోకొంత భరణమిచ్చి మరోపెళ్లి చేసుకోవడం మొదలుపెడితే.. ఒకసారి కాదు, రెండు, మూడు, నాలుగు సార్లు పెళ్లి చేసుకోవడం మొదలుపెడితే, మీరూ చేసుకోండి అని చెబుతూపోతే ఇక ఆడవారి మానప్రాణాలు ఏం కావాలి.. అక్కచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి..?ఇలాంటి వారు మన నాయకులా..? అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాంటి నాయకులు మనకు దశ, దిశ చూపగలరా..? ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. 

మంచి చేసిన చరిత్రలేని వారంతా, వెన్నుపోటుదారులంతా,  ఎన్నికల వేళ రంగు రంగులతో కూడిన మేనిఫెస్టోను ఇస్తారు. ఎన్నికలు అయిపోయిన తరువాత వాగ్దానాలు మరిచిపోతారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తారు. మళ్లీ ప్రజలు ప్రశ్నిస్తారేమోనని ఆ మేనిఫెస్టోను కనిపించకుండా చేస్తారు. కనీసం వారి పార్టీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మేనిఫెస్టో కూడా చూపించలేని పరిపాలన చేస్తారు. ఇటువంటివారు అందరూ దుష్టచతుష్టయంలా ఏర్పడ్డారు. కలిసి కూటములు కడుతున్నారు. కూటములు కట్టి మీ బిడ్డ మీద యుద్ధం చేస్తారట.. మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట. ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకం అవుతున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. 

వివక్ష,లంచాలు లేకుండా నేరుగా 87 శాతం ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చిన మన ప్రభుత్వానికి – ప్రజలకు ఏనాడూ మంచి చేయని పచ్చరంగు పెత్తందారులు, ఆ కూటమికి మధ్య ఇక నిరంతరం పోరాటం సాగుతుంది. మరో 19 నెలలు ఇవన్నీ రోజూ కనిపిస్తాయి. నాకు వారి మాదిరిగా ఓ ఈనాడు తోడుగా లేదు, ఓ ఆంధ్రజ్యోతి, టీవీ5, ఓ దత్తపుత్రుడు ఇటువంటివారంతా నాకు తోడుగా ఉండకపోవచ్చు. కానీ, నాకు దేవుడి దయతో పాటు మన పాలనలో మంచి జరిగిన ప్రతి కుటుంబంలోని ప్రతీ అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి తల్లి, ప్రతి అవ్వ, ప్రతి తాత.. వీరంతా నాకు తోడుగా నిలబడతారనే నమ్మకం నాకుందని తెలియజేస్తున్నాను. వారు అబద్ధాలను, మోసాలను, కుట్రలను, మీడియాను, పొత్తులను నమ్ముకుంటే.. నేను వారి మాదిరిగా కుతుంత్రాలు, కుళ్లు, మోసం, దత్తపుడ్రుడు, మీడియాను నమ్ముకోలేదు. నేను దేవుడి దయను నమ్ముకున్నాను.. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలను నమ్ముకున్నానని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

ఇది మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది సామాజిక న్యాయానికి, సమాజాన్ని ముక్కలు చెక్కలుగా చేయాలనే ఆలోచనతో జరుగుతున్న యుద్ధం. ఇలాంటి యుద్ధంలో మిమ్మల్ని కోరేది ఒక్కటే.. రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. మీ అందరినీ వేడుకునేది ఒక్కటే.. ఈ మోసాలను నమ్మొదు, ఈ కుతంత్రాలను నమ్మొదు, ఈ పేపర్లను చదవొద్దు, ఈ టీవీలను చూడొద్దు. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అనేది ఒక్కటే కొలమానంగా తీసుకోండి .మంచి జరిగితే జగనన్నకు తోడుగా నిలవండి. 

మీ బిడ్డకు వారి మాదిరిగా హంగులు, ఆర్భాటాలు లేకపోయినా, మీడియా ప్రతినిధులు, టీవీలు, పేపర్లు లేకపోయినా, దత్తపుత్రుడు తోడులేకపోయినా, మీ బిడ్డకు మీ గుండెల్లో స్థానం ఉంటే చాలు.. ఇదే మీ బిడ్డ జగన్‌ కోరుకునేది. దేవుడి దయతో ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని, మనసారా కోరుకుంటూ మీ అందరికీ ఇంకా ఎక్కువ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు. 

అవనిగడ్డ కోసం.. 
అవనిగడ్డలో కొన్ని మంచి కార్యక్రమాలకు సహాయ, సహకారాలకు కావాలని రమేష్‌ అన్న అడిగారు. 
– అవనిగడ్డ–కోడూరు ప్రధాన రహదారి అభివృద్ధి చేయడం కోసం రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నాను. 
– కృష్ణా నది కుడి, ఎడమ కరకట్ట, సముద్రపు కరకట్ట పటిష్టం చేయడం కోసం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాను. 
– కృష్ణనది పాయనందు గల పాత ఎడ్లలంక రహదారి వంతెన కోసం రూ.8.50 కోట్లు మంజూరు చేస్తున్నాను. 
– అవనిగడ్డ కంపోస్ట్‌ యార్డును తరలించేందుకు నిధులు మంజూరు చేస్తున్నాను. 
– అవనిగడ్డ నందు సీసీ, డ్రైన్ల ఏర్పాటు కోసం రూ.10–15 కోట్లు ఖర్చు అవుతుందని రమేషన్న అడిగాడు.. దాన్న కూడా మంజూరు చేస్తున్నాను. 
– అవనిగడ్డ ఏరియా ఆస్పత్రిలో కిడ్నీ డయాలసిస్‌ సెంటర్‌ అన్నింటికంటే మోస్ట్‌ ఇంపార్టెన్స్‌ ఇచ్చి చేస్తాను. 
రమేష్‌ అడిగిన అన్నీ కచ్చితంగా జరుగుతాయి. 
 

Back to Top