తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరై భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కోట్లాది మంది హృదయాల్లో దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. మన కాళ్ళపై మనం నిలబడే విధంగా ప్రజల జీవితాల్లో పూర్తి మార్పు తీసుకుని రావటం అంత తేలిక కాదు.. దీన్ని చేసి చూపించిన వ్యక్తులు అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి.. ఇప్పుడు ఆయన కుమారుడు వైయస్ జగన్ కే సాధ్యం అని ఆయన చెప్పారు. తండ్రిని మించిన తనయుడిగా వైయస్ జగన్ ఎదగటం గర్వ కారణం.. వైయస్ఆర్ కన్న కలలను నిజం చేస్తున్న వ్యక్తి వైయస్ జగన్ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత వైయస్ జగన్‌దేనన్నారు. ఇచ్చిన హమీలను నెరవేర్చి.. పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకులు వైయస్ జగన్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా బతికగలిగే అవకాశం ఈ రాష్ట్రంలోనే కనిపిస్తుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రజలకు ఏం చేయనవసరం లేదు.. చేసినట్లు నటిస్తే చాలు అని భావించే వ్యక్తి చంద్రబాబు.. మీడియాను అడ్డం పెట్టుకుని ఏదో చేసినట్లు ప్రజలకు భ్రమ కల్పించవచ్చని చంద్రబాబు భావిస్తారు.. ఉన్న డబ్బులు కాంట్రాక్టర్లకు దోచి పెట్టి దానిలో నుంచి తన వాటా తీసుకోవచ్చన్నది చంద్రబాబు వైఖరి.. వైయస్ జగన్ కు ఇవి చేతకావు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరికం 11 నుంచి 5 శాతానికి తగ్గించటంలో పేదల పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధి అర్థం అవుతుంది.. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా.. వనరులను పేదలకు పంచి పెట్టడం వల్లే ఆర్ధిక వ్యవస్థ నిలబడింది.. మూడు లక్షల కోట్లు నేరుగా డీబీటీ రూపంలో ప్రజలకు అందించారు అని పేర్కొన్నారు. అవినీతికి తావులేకుండా, అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామని సజ్జల తెలిపారు. గతంలో లాగా జన్మభూమి కమిటిల వేధింపులు లేవు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైయస్ జగన్ పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు.. ఎన్నికలు రాగానే మారీచ శక్తులు కలిసి వస్తున్నాయి.. ప్రజలకు చంద్రబాబు చేసింది మోసమే.. ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ ను బలవంతంగా తీసుకుని వచ్చారు.. వైయస్ జగన్ ను గద్దె దించటం పవన్ కళ్యాణ్ ఏకైక లక్ష్యం.. ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూస్తున్నారు.. అందరూ అప్రమత్తంగా ఉండాలి అని ఆయన చెప్పారు. పేదల జీవితాల్లో మార్పు కోసం చేస్తున్న యజ్ఞం కొనసాగాలంటే మళ్లీ వైయస్ జగన్ ప్రభుత్వం రావాలి అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. సేవా కార్యక్రమాలు.. సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎత్తున సేవా కార్యక్రమాలను వైయస్ఆర్‌సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో సీఎం వైయస్ జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి