హైదరాబాద్: శ్రీరామానుజ సహస్రాబ్ధి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శ్రీరామానుజచార్యుల వెయ్యి సంవత్సరాల సందర్భంగా శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే సమానత్వాన్ని బోధించారని, ఆయన బోధనలు అనుసరణీయమన్నారు. రామానుజాచార్యులు భావితరాలకు ప్రేరణగా నిలిచారని సీఎం వైయస్ జగన్ అన్నారు. ఒక స్వామి ఉపదేశించిన మంత్రాన్ని అందరికీ తెలియజేయాలని, ఈ క్రమంలో తనకు పాపం తగిలినా పర్వాలేదనే ఒక గొప్ప భావన, ఉద్దేశంతో ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేసిన గొప్ప మనిషిని మనందరం స్మరించుకుంటున్నామన్నారు. అమెరికా నుంచి వచ్చిన పిల్లలు చక్కగా శ్లోకాలు చదివి వినిపించారని, గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చినజీయర్ స్వామికి, ఇందుకు తోడ్పాటును అందించిన రామేశ్వరావుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ రామానుజచార్యులు బోధించిన విలువలను ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్న సమాజంలో ఉన్నామని, సమాజాన్ని మార్చాలి, అందరూ సమానులే అని చెప్పే గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి చినజీయర్ స్వామి శ్రీరామానుజచార్యుల విగ్రహాన్ని స్థాపించారని సీఎం వైయస్ జగన్ చెప్పారు.