వివాదాలకు తావులేకుండా సమగ్ర భూసర్వే

వందేళ్ల తరువాత దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఆధునిక భూ రీసర్వే

అత్యంత శాస్త్రీయ‌ పద్ధతి, సాంకేతిక పరిజ్ఞానంతో తొలిదశలో 51 గ్రామాల్లో సర్వే

29,563 ఎకరాల భూముల రీసర్వే పూర్తి చేశాం

37 గ్రామాల్లోని సచివాలయాల్లో నేటినుంచి స్థిరాస్తులు రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

2023 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూసర్వే పూర్తి చేసే లక్ష్యంతో ముందడుగు

మంచి జరగాలనే తపన, తాపత్రయంతో వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం

యూనిక్‌ నంబర్, క్యూఆర్‌కోడ్, సబ్‌ డివిజన్స్‌ అప్‌డేట్‌తో భూయజమానుల చేతుల్లో పట్టాలు

సుమారు రూ.1000 కోట్లతో భూహక్కు–భూరక్ష ప్రాజెక్టు చేపట్టాం

భూయజమానుల సహకారం, సమ్మతితోనే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది

అభ్యంతరాల పరిష్కారానికి మండల స్థాయిలోనే మొబైల్‌ మెజిస్ట్రేట్‌ ఏర్పాటుl

క్లియర్‌ టైటిల్స్‌తో భూముల రికార్డులు యజమానుల చేతుల్లో పెట్టబోతున్నాం

స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

‘‘మనం రాత్రనకా, పగలనకా సంపాదించుకున్న రూపాయి.. రూపాయి దాచుకొని కొనుక్కున్న ప్లాటు, ఇల్లు భూ వివాదాల్లోకి వెళితే ఎలాంటి బాధ ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే తపన, తాపత్రయంతో వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష  కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’’
     – సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రతి ఒక్క గ్రామంలోనూ, ప్రతి ఒక్కరి భూమిని కూడా 2023 కల్లా సమగ్ర, ఆధునిక పద్ధతుల్లో రీసర్వే చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సమగ్ర భూసర్వే చేయడంతో పాటు యూనిక్‌ నంబర్‌ క్రియేట్‌ చేయడం, డేటా మొత్తం సబ్‌ డివిజన్స్‌తో అప్‌డేట్‌ చేయడం, పట్టాలను భూయజమానుల చేతుల్లో పెడతామని,  గొప్ప విప్లవాత్మక మార్పునకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. దేవుడి దయతో దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో అత్యంత శాస్త్రీయ‌ పద్ధతుల్లో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన సమగ్ర భూసర్వే తొలి దశలో 51 గ్రామాల్లో పూర్తి చేశామని, 37 గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లో ఈరోజు నుంచి భూములు స్థిరాస్తులు రిజిస్ట్రేషన్‌ చేసే మంచి కార్యక్రమాన్ని  ప్రారంభిస్తున్నామన్నారు. మిగిలిన 14 గ్రామాల్లో రాబోయే మూడు వారాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి 37 గ్రామాల్లోని సచివాలయాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ సేవలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకంలో భాగంగా రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించిన సమగ్ర భూసర్వే రికార్డులను ప్రజలకు అంకితం చేశారు. అంతకు ముందు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు.

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘ప్రతి గ్రామంలో అన్ని రకాలుగా సర్వేలు పూర్తిచేసి.. వివాదాలను పరిష్కరించుకుంటూ వచ్చాం. వివాదాలకు తావులేకుండా సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అనేది కాకుండా ప్రతి గ్రామంలో.. మీ ఇంటికి అతిదగ్గరలోనే.. మీ ఆస్తుల లావాదేవీలు.. మీ కళ్ల ఎదుటే కనిపించే విధంగా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాం. ఇలాంటి మంచి సంస్కరణను ఈరోజు నుంచి అమల్లోకి తీసుకువస్తున్నాం. ఈ సంస్కరణ ఎందుకు అవసరమో.. ఎలాంటి పరిస్థితులను మనం చూస్తున్నామో ఒకసారి బేరీజు వేసుకుంటే.. భూముల హద్దులు, హక్కులకు సంబంధించిన కొన్ని విషయాలు అందరూ తెలుసుకోవాలి. 

భారతదేశంలో 100 సంవత్సరాల క్రితం బ్రిటీషర్ల హయాంలో భూముల సమగ్ర సర్వే చేపట్టారు. ఆ తరువాత జమాబంధీ విధానంలో 1983 వరకు భూములకు సంబంధించిన అభ్యంతరాలు పరిష్కరించేవారు. 1983 తరువాత కరణాల వ్యవస్థ రద్దుకావడంతో మరో వ్యవస్థ ఏర్పాటుకాకపోవడంతో అంతవరకు జరిగిన జమాబంధీ విధానం కూడా ఆగిపోయింది. భూములకు సంబంధించిన రికార్డులు కూడా ట్యాంపరింగ్‌ జరుగుతుందని, మన భూమిని మనకు తెలియకుండా.. మన కళ్ల ఎదుటే వేరేవారి పేరుమీద రాసుకునే ట్యాంపరింగ్‌ జరుగుతుందని తెలుస్తుంది. 

నా పాదయాత్రలో 13 జిల్లాల్లోని ప్రజలు వచ్చి భూముల ట్యాంపరింగ్‌ గురించి నాతో చెప్పారు. ఇంటి స్థలం, పొలం ఏదైనా రికార్డులు, రిజిస్ట్రేషన్‌లోనూ ఉన్న వాస్తవంగా ఉన్న భూమికి మధ్య తేడాలు కూడా అనేక సివిల్‌ విధానాలకు దారితీస్తుంది. రిజిస్ట్రేషన్‌లో ఒక రకంగా, భూమి దగ్గరకు వెళ్లి కొలతలు వేస్తే మరో రకంగా భూములు ఉండే ఇలాంటి వివాదాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక సర్వే నంబర్‌లో అమ్మకాలు జరిగి ఉంటాయి.. కానీ అది సబ్‌ డివిజన్‌ జరిగి ఉండదు. అవన్నీ సివిల్‌ వివాదాలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పట్టాదారు పాసుపుస్తకాల ఏర్పాట్ల వల్ల ఆశించిన ప్రయోజనాలు మనకు అంతగా కనిపించని పరిస్థితి. 

భూములకు సంబంధించిన నిర్దిష్టమైన హద్దులు, శాశ్వతమైన హక్కులు రెండూ కూడా లేకపోవడం వల్ల రికార్డుల్లో తమ భూముల వివరాలు తారుమారయ్యాయనే ఫిర్యాదులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భూ ఆక్రమణలు కూడా పెరగడం, చివరకు సివిల్‌ కేసుల్లో దాదాపుగా 80 నుంచి 90 శాతం కేవలం భూవివాదాలకు సంబంధించిన కేసులుగా ఉన్నాయి. ఎంత దారుణమైన పరిస్థితుల్లో రికార్డులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. 

సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల, ట్యాంపరింగ్, ఇతరత్రా లోపాల వల్ల కష్టపడి సంపాదించిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన సంపద.. చేజారిపోయే పరిస్థితి ఎవరికైనా వస్తే అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. ఇటువంటి వివాదాలకు ముగింపు ఉండాలనే ఉద్దేశంతో భూములన్నీ కూడా కొలతలు వేసి.. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా నిర్దేష్టంగా ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ కూడా ప్రతి ఒక్క భూమిని డిజిటల్‌గా నిర్ణయించడం జరిగితే.. క్యూఆర్‌ కోడ్‌తో ల్యాండ్‌ మ్యాప్‌ ఇవ్వగలిగితే భూములకు సంబంధించి నిర్దిష్టమైన హద్దులు, శాశ్వత హక్కులను సరిహద్దు రాళ్లు కూడా పాతి మరీ ఇవ్వగలిగితే భూములపై లిటిగేషన్‌ లేని పరిస్థితి వస్తుంది. ఆ ప్రక్రియ చేయడం కోసం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

భూములు ఎవరైనా ఆక్రమించుకుంటారనే భయం  తొలిగిపోతుంది. డూబ్లికేట్‌ రిజిస్ట్రేషన్, లంచాలకు అవకాశం లేకుండా పోతుంది. ఇది జరగాలని ప్రజలంతా ఎప్పడినుంచో మనసారా కోరుకుంటున్నారు. మన ప్రభుత్వం మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకాన్ని దాదాపు 13 నెలల క్రితం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రతి ఒక్క గ్రామంలోనూ, ప్రతి ఒక్కరిభూమిని కూడా 2023 కల్లా సమగ్ర, ఆధునిక పద్ధతుల్లో రీసర్వే చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. సర్వే చేయడంతో పాటు యూనిక్‌ నంబర్‌ క్రియేట్‌ చేయడం, డేటా మొత్తం సబ్‌ డివిజన్స్‌తో అప్‌డేట్‌ చేయడం, పట్టాలను భూయజమానుల చేతుల్లో పెట్టడం.. ఇదొక గొప్ప విప్లవాత్మక మార్పు. 

దేశంలో ఎవరూ, ఎక్కడా ఇంత గొప్పగా భూముల సమగ్ర సర్వే చేపట్టే సాహసం చేయలేదు. 2020 డిసెంబర్‌ 21న భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టడం జరిగింది. కోర్స్, డ్రోన్స్‌ టెక్నాలజీతో మొత్తం 50 అంశాలలో 10,158 మందికి సర్వేలో శిక్షణ ఇవ్వడం జరిగింది. దాదాపుగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 4,500 సర్వే బృందాలను ఏర్పాటు చేశాం. 2వేల రోవర్స్, 70 కోర్స్‌బేస్‌ స్టేషన్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నాం. 

పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో 51 గ్రామాల్లో 12,776 మంది భూ యజమానులకు, 21,404 భూకమతాలకు సంబంధించిన 29,563 ఎకరాల భూముల రీసర్వే పూర్తిగా కంప్లీట్‌ చేయడం జరిగింది. సర్వేకు సంబంధించి 3,304 అభ్యంతరాలు పరిష్కరించడం జరిగింది. శాశ్వత భూహక్కు క్లియర్‌ చేసి, హద్దులు మార్కు చేయడం, మ్యాపులు ఇవ్వడం, సపరేట్‌ యూనిక్‌ ఐడీ నంబర్, క్యూఆర్‌ కోడ్‌లో భద్రపర్చడమే కాకుండా పర్మినెంట్‌ టైటిల్స్‌తో భూముల రికార్డులు భూయజమానుల చేతుల్లో పెట్టబోతున్నాం. 

శాశ్వత భూక్కు–భూరక్ష పథకం అమలు వల్ల నకిలీ పత్రాలకు తావుండదు. భూయజమానులకు తెలియకుండా రికార్డులు మార్చే అవకాశం ఎక్కడా ఉండదు. ఆస్తులను అమ్ముకున్నప్పుడు సబ్‌ డివిజన్‌ కూడా వెంటనే చేసిన తరువాతే ఆ లావాదేవీల ఆధారంగా మాత్రమే భూరికార్డుల్లో మార్పులు జరుగుతాయి. వేరే ఎవరూ కూడా ఆస్తులను కాజేసే అవకాశం ఉండకూడదనే మంచి సంకల్పంతో వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష కార్యక్రమానికి అడుగులు ముందుకేస్తున్నాం. 

సర్వే చేసేటప్పుడు కూడా ప్రతి అడుగులోనూ భూయజమానులను భాగస్వామ్యులుగా చేస్తున్నాం. భూయజమానుల సహకారం, సమ్మతితోనే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఒకవేళ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. మండల స్థాయిలోనే మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలను నియమించడం జరుగుతుంది. అభ్యంతరాలను అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుంది. 

భూకమతం ఒక సర్వే నంబర్‌ కింద ఉండి, కాల క్రమేణా విభజన జరిగి చేతులు మారినా కూడా సర్వే రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడంతో వస్తున్న భూవివాదాలు ఇలాంటివే కాకుండా ఇతరత్రా వివాదాలు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఇబ్బందులు ఇవన్నీ కూడా గత పరిస్థితికి తెరదింపి.. ప్రతి భూకమతానికి సబ్‌డివిజన్‌ చేయడమే కాకుండా విశిష్ట గుర్తింపు సంఖ్య నంబర్‌ కేటాయించి క్లియర్‌ టైటిల్స్‌ను  అందించడమే ఈ పథకమూల ఉద్దేశం. 

తొలిసారిగా గ్రామకంఠాల్లో ఇల్లు, స్థిరాస్తులు వీటిని కూడా సర్వే చేయించడంతో పాటు యాజమాన్య ధృవీకరణ పత్రాలను కూడా అందజేయడం జరుగుతుంది. అమ్ముకునే స్వేచ్ఛ కూడా అన్ని రకాలుగా యజమానులకు ఉంటుంది. ఈరోజు ప్రారంభిస్తున్న 37 గ్రామాల్లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశాన్ని దశలవారీగా విస్తరించుకుంటూపోతాం. 

గ్రామ సర్వేయర్ల ద్వారా ఫీల్డ్‌లైన్‌ దరఖాస్తులను 15 రోజుల్లో, పట్టా సబ్‌ డివిజన్‌ దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరించాలని డెడ్‌లైన్‌ పెట్టడం జరుగుతుంది. మరో అడుగు ముందుకేసి ఇప్పుడే అధికారులను ఆదేశిస్తున్నా.. కచ్చితంగా సబ్‌ డివిజన్‌ చేసిన తరువాతే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలి. దాని వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 

సింగిల్‌ విండో విధానంలోనూ ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూహక్కు పత్రం అందించే దిశగా మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. అంతేకాకుండా ఈ వ్యవస్థ ద్వారా భూ సమాచారాన్ని ఎవరైనా, ఎక్కడనుంచైనా పొందేందుకు వీలు కూడా కలుగుతుంది. 

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమం బాగా జరగాలని, త్వరలోనే అన్ని గ్రామ సచివాలయాలకు ఇది విస్తరించాలని, మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తున్నా. 
 

Back to Top