ఆదిత్య బిర్లా ఏర్పాటు చరిత్రాత్మక ఘట్టం

ఫార్చూన్‌ 500 కంపెనీల్లో ఆదిత్య బిర్లా గ్రూపు ఒకటి

మంచి కంపెనీ పులివెందుల గడ్డ మీదకు రావడం అభినందనీయం

రూ.110 కోట్లతో పెట్టుబడి.. మొదటి దఫా కింద 2,112 మందికి ఉద్యోగాలు

ఆదిత్య బిర్లా గ్రూపు శంకుస్థాపనోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: పులివెందుల గడ్డ మీద ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటు చరిత్రాత్మక ఘట్టం అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఫార్చూన్‌ 500 కంపెనీల్లో ఒకటి.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీగా 2020లో ఫార్బ్స్‌ గ్రూపు ఆదిత్య బిర్లా కంపెనీకి గుర్తింపు కూడా ఇచ్చిందన్నారు. ఉద్యోగుల మేలు కోరే.. అత్యుత్తమ ఉద్యోగాలు కల్పించే ఇటువంటి మంచి కంపెనీ పులివెందులలో గడ్డ మీదకు రావడం అభినందనీయమన్నారు. 

పులివెందుల ఇండస్ట్రీయల్‌ పార్కులో ఆదిత్య బిర్లా గ్రూపు ఏర్పాటుకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రూ.110 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆదిత్య బిర్లా గ్రూపు ముందుకు వచ్చిందని, ఈ సంస్థ ద్వారా మొదటి దఫా కింద 2,112 మందికి ఉద్యోగాలు రానున్నాయన్నారు. ఈ సంస్థ 10వేల ఉద్యోగాలు కల్పించే స్థాయికి వెళ్తుందని సీఎం చెప్పారు. 

పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి చొప్పున  మొత్తం 26 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, అందులో ఒకటి పులివెందుల్లోనే ఏర్పాటవుతుందన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న స్కిల్‌డెవల్‌మెంట్‌ కాలేజీల్లో వస్త్ర ఉత్పత్తికి సంబంధించిన స్కిల్స్‌ను కూడా ట్రైనింగ్‌ ఇచ్చేందుకు ముందుకురావాలని ఆదిత్య బిర్లా యాజమాన్యానికి సీఎం విజ్ఞప్తి చేశారు. దీని వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్నారు. 

ఆదిత్య బిర్లా సంస్థకు దేశ వ్యాప్తంగా 3,031 స్టోర్లు, 25 వేల మల్టీబ్రాండ్‌ అవుట్‌లెట్స్, దాదాపు 6,500 డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ కలిగి ఉందన్నారు. పెద్ద పెద్ద బ్రాండ్స్‌ అన్ని కూడా ఆదిత్య బిర్లా గ్రూపు నుంచే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. 2019–20లో ఈ సంస్థ రూ.8,700 కోట్ల రిటైల్‌ టర్నోవర్‌ చేసి.. 25 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిందని, ఇందులో 85 శాతం అక్కచెల్లెమ్మలకే కేటాయించిందని ముఖ్యమంత్రి వివరించారు. ఇలాంటి మంచి సంస్థ పులివెందులకు రావడం సంతోషమని, ఇదొక మంచి పరిణామం.. దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి జరగాలని ప్రార్థిస్తున్నానని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

Back to Top