ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా అడుగులు

ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం

‘వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా’తో రెస్ట్‌ పిరియడ్‌లో సైతం తోడుగా నిలిచాం

కేన్సర్‌ వ్యాధిని ఆరోగ్యశ్రీ పరధిలోకి తీసుకువచ్చాం

హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కూడా ఆరోగ్యశ్రీ అమలు

ఆరోగ్యశ్రీ కింద 2వేల రోగాలతో పశ్చిమగోదావరిలో పైలెట్‌ ప్రాజెక్టు

‘నాడు–నేడు’తో ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నాం

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి తోడుగా నిలిచాం

9,712 మంది వైద్యులు, సిబ్బంది భర్తీకి వారంరోజుల్లో నోటిఫికేషన్‌ 

‘వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌’ ద్వారా ఇంటి వద్దకే వైద్యం

జూలై 1న 1060 కొత్త 104, 108 వాహనాలు, టెలీ మెడిసిన్‌ బైక్‌ల ప్రారంభం

రాష్ట్రంలో మరో 16 టీచింగ్‌ మెడికల్‌ కాలేజీలు, ఐటీడీఏ పరిధిలో 7 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు

కోవిడ్‌–19ను అరికట్టడంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచాం

వైద్య, ఆరోగ్య శాఖపై మేధోమథన సమీక్షలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ‘‘ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి బాగోలేకపోయినా.. మన ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తే మంచి వైద్యం, మెడిసిన్‌ దొరుకుతాయని గర్వంగా చెప్పే పరిస్థితిని మన రాష్ట్రంలో తీసుకువచ్చాం.’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదవాడు వైద్యం చేయించుకునేందుకు, పిల్లలను చదివించుకునేందుకు అప్పులపాలు కాకూడదని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి నాన్నగారు బలంగా నమ్మారని, అందుకనే ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకానికి నాన్న శ్రీకారం చుట్టారన్నారు. నాన్న మరణం తరువాత ఆరోగ్యశ్రీ పరిస్థితి దయనీయంగా తయారవుతూ వచ్చింది. మన రాష్ట్రంలోనే ఎలుకలు కొరికి పసిపిల్లాడు చనిపోయిన పరిస్థితిని చూశాం. సెల్‌ఫోన్‌ లైట్స్‌తో ఆపరేషన్‌ చేస్తే దౌర్భగ్య సంఘటనను మన కళ్లతోనే చూశాం. ఈ వ్యవస్థలోకి సమూల మారాలని మనం అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలోనే ఆరోగ్యశ్రీ పథకానికి పునర్జీవం పోశామని, వైద్య, ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మనపాలన–మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన మేధోమథన సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం అవుతున్న ఈ సమయంలో ఆరోగ్య రంగం  మీద ఈ సంవత్సరకాలంలో మనం చేయగలిగాం.. చేసిన వాటిల్లో ఇంకా ఏదైనా మార్పులు, చేర్పులు చేస్తే బాగుంటుందా..? అని చెప్పి మీ దగ్గర నుంచి సూచనలు, సలహాలు తీసుకునేందుకు అందరం ఏకమయ్యాం. 

ఈ సంవత్సరకాలంలో ఒకవైపున అమ్మ ఒడి, రైతు భరోసా, ఇంగ్లిష్‌ మీడియం, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్, సంక్షేమ పెన్షన్‌లు, సున్నావడ్డీ, దిశ చట్టం ఇటువంటివన్నీ ఒకవైపున చేస్తూనే మరోవైపున ఆరోగ్యరంగంలో రెండు అడుగులు ముందుకువేశాం. కోవిడ్‌ కష్టాలు ఎన్ని ఉన్నా కూడా గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానా మీద కట్టవలసిన బకాయిలు పేర్చిపోయినా కూడా ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా ఆలోచన చేశాం. ఆరోగ్యరంగానికి అత్యున్నత స్థానాన్ని ఇచ్చి అడుగులు ముందుకు వేశాం. 

104, 108 వాహనాలు ఎక్కడ కనిపించినా కూడా కుయ్‌.. కుయ్‌.. కుయ్‌ అంటూ సౌండ్‌ వచ్చినప్పుడు మన మనసుకు తట్టే పేరు అది నాన్నగారి పేరే.. పేదవాడు అప్పులపాలు కాకూడదు. అప్పులపాలు అయ్యే పరిస్థితి పేదవాడికి రెండే సందర్భాల్లో బలంగా ఉంటుంది. ఒకటి వైద్యం.. రెండోది ఆ పేదవాడు చదివించాలనే ఆరాటపడినప్పుడు. ఈ రెండు పరిస్థితులను మార్చాలి.. పేదవాడు అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదని గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి ఆ దివంగత నేత నాన్నగారు. 

నాన్నగారు చనిపోయిన తరువాత ఆరోగ్యశ్రీ పరిస్థితి దయనీయంగా తయారవుతా వచ్చింది. ప్రతి పాలకుడు కూడా ఆరోగ్యశ్రీని పట్టించుకుంటే వైయస్‌ఆర్‌కు క్రెడిట్‌ వస్తుందనే ఉద్దేశంతోనేమో పూర్తిగా ఆరోగ్యశ్రీని నీరుగారుస్తూ వచ్చారు. 

చివరకు ఏ స్థాయిలోకి గవర్నమెంట్‌ ఆస్పత్రులను తీసుకువచ్చారంటే.. గత ప్రభుత్వ హయాంలో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోయిన పరిస్థితి. అంతటి అధ్వాన్నమైన పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్ప్రతులు నడిచేవి. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో సెల్‌ఫోన్‌ లైట్స్‌ వెలుగుల్లో డాక్టర్లు ఆపరేషన్‌ చేయించారని మరో సంఘటన. ఇటువంటివి సర్వ సాధారణంగా గత ప్రభుత్వ హయాంలో కనిపించే పరిస్థితులు. 

ఆస్పత్రుల్లో వసతులు సరిగ్గా ఉండవు. డాక్టర్లు అంతంత మాత్రమే. నర్సులు అంతంత మాత్రమే. ఖాళీలు ఉన్నా కూడా భర్తీ చేయాలనే ఆలోచనలు ఉండవు. పరికరాలు మూలనపడి ఉంటాయి. కాంట్రాక్టు రూపంలో సేవలు తెచ్చేవారు.. కాంట్రాక్టులు డబ్బులు చేసుకునేందుకే ఉపయోగించేవారు తప్ప నిజంగా ప్రజలకు మేలు చేయాలి.. సేవలందించాలనే ఆలోచన గత ప్రభుత్వంలో ఎక్కడా కనిపించేది కాదు. అటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నాం. 

ఆరోగ్యరంగానికి మనం చేయబోతున్నామని మేనిఫెస్టోలో పొందుపరిచాం. రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో రూపకల్పన చేశాం. అది ప్రతి ఇంట్లో ఉండేట్లు చేశాం. ప్రతి అధికారి దగ్గర, ప్రతి మంత్రి దగ్గర ఈ రోజు మేనిఫెస్టో కాపీలు కనిపిస్తాయి. మేనిఫెస్టోను ఒక బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా భావించి.. అందులో చెప్పిన ప్రతి అంశం కూడా పూర్తి చేయడం కోసం అన్ని రకాలుగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ పోయింది.. 

సంవత్సరకాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం.. ఆరోగ్యశ్రీ పరిస్థితిని సంవత్సరానికి రూ.5 లక్షల వరకు (నెలకు రూ.40 వేల సంపాదించే) ఆదాయం ఉన్న వారికి వర్తింపజేస్తామని చెప్పాం. ఈ సంవత్సరకాలంలో అది అమలు చేశాం. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. 1.42 కోట్ల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. 

వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని చెప్పాం. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టు కిందకు తీసుకున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిలో ఇంతకు ముందున్న వెయ్యి రోగాలు కాకుండా 2 వేల రోగాలకు వర్తింపజేసేలా పశ్చిమగోదావరిలో పైలెట్‌ ప్రాజెక్టు నడిపించాం. ఈ జూలై 8వ తేదీన నాన్న పుట్టిన రోజున మరో 6 జిల్లాల్లో 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయిస్తాం. ఆ తరువాత మిగిలిన ఆరు జిల్లాల్లో దీపావళి నాటికి నవంబర్‌లో పూర్తిగా రాష్ట్రమంతా 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించేలా వర్తింపజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 12 వందల జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నాం. 

కేన్సర్‌కు సంబంధించిన వైద్యం కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. పుట్టుకతోనే మూగ, చెవుడు ఉంటే.. ఆ పిల్లాడికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ చేయించకపోతే జీవితకాలం మూగ, చెవుడుతోనే ఉండే పరిస్థితి. గతంలో సింగిల్‌ కాక్లియర్‌ ఆపరేషన్‌ చేయించకుండా ఎలా ఎగరగొట్టాలని గత ప్రభుత్వం రకరకాల నిబంధనలు పెట్టిన సందర్భాలున్నాయి. 

నా పాదయాత్రలో మూగ, చెవుడుతో బాధపడే వాళ్లను చాలా మందిని చూశాను. నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి సొంత ఖర్చులతో ఆపరేషన్లు కూడా చేయించాను. అది ఆరోజు ఉన్న ఆరోగ్యశ్రీ పరిస్థితి. ఈ రోజు మార్పు చేసి సింగిల్‌ కాక్లియర్‌ కాదు.. డబుల్‌ కాక్లియర్‌ ఆపరేషన్‌ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. అదనంగా బ్యాటరీ కూడా మూడు సంవత్సరాల్లో పోతుదంటే.. ఆ బ్యాటరీ అందించేలా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. స్పీచ్‌ థెరఫీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చే కార్యక్రమం చేశాం. 

ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందాలని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలి.. ఆరోగ్యశ్రీని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని 132 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వర్తింపజేస్తున్నాం. 

ఈ సంవత్సరకాలంలో ఆరోగ్యశ్రీని మెరుగులు దిద్దుతున్నాం. పేదవాడు అప్పులపాలు కాకుండా వైద్యం ప్రతిపేదవాడికి కూడా అందాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకువేశాం. అందులో భాగంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులు అనేవి చాలా ముఖ్యం. గతంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. గవర్నమెంట్‌ బకాయిలు మాకు ఇప్పటికీ ఇవ్వలేదు.. ఆ డబ్బులే సంవత్సరకాలం నుంచి రావడం లేదు.. ఇప్పుడు వైద్యం చేయమంటే.. చేసే పరిస్థితుల్లో లేమని గతంలో రోగులను వెనక్కి పంపించే పరిస్థితి ఉండేది. 

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సంబంధించి గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.686 కోట్లు మనం అధికారంలోకి వచ్చిన తరువాత చెల్లించాం. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు మనోధైర్యాన్ని ఇచ్చాం. ఈ రోజున ఒక్క రూపాయి బకాయిలు లేకుండా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ నడిపే విధంగా పరిస్థితి తీసుకువచ్చాం. ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రోగి వెళ్తే చిరునవ్వుతో వైద్యం అందించే పరిస్థితిలోకి ఈ రోజు ఆరోగ్యశ్రీ పరిస్థితిని తీసుకెళ్లాం. 

నెట్‌వర్క్‌ ఆస్పత్రులను గ్రేడింగ్‌ కూడా చేశాం. ఏ+, ఏ, బీ గ్రేడింగ్‌ పెట్టాం. బీ గ్రేడింగ్‌లో ఉన్న ఆస్పత్రులను ఆరు నెలల్లో ప్రభుత్వ సూచించిన రోగాలన్నింటికీ వైద్యం చేసేలా ఆస్పత్రుల స్థాయిని పెంచాలని, లేకపోతే ఆరోగ్యశ్రీ పరిధిలో నుంచి తీసేస్తాం.. మౌలికసదుపాయలు, వైద్య పరికరాలు పెంచితే ఏ కేటగిరి అవుతుందని బీ గ్రేడింగ్‌లో ఉన్న ఆస్పత్రులను గట్టిగా ఆదేశించాం. ప్రభుత్వ ఆదేశాలతో బీ కేటగిరిలో ఉన్న ఆస్పత్రులు మౌలికసదుపాయాలు పెంచి ఏ కేటగిరివైపు వెళ్తున్నాయి. 

ఆరోగ్యశ్రీలో మనం చేసిన గొప్ప విప్లవాత్మక మార్పు ఏంటంటే.. ‘వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా’ తీసుకువచ్చాం. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుంటే.. డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకునే సమయంలో కుటుంబాల పరిస్థితిని బట్టి మళ్లీ పనులకు వెళ్తే.. ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని ఆలోచన చేసి రెస్ట్‌ పిరియడ్‌లో కూడా రోజుకు రూ. 225 చొప్పున, నెలకు రూ.5 వేల చొప్పున.. డాక్టర్లు ఎన్ని రోజులు సూచిస్తే.. అన్ని రోజులకు ఆర్థికసాయం అందిస్తున్నాం. ఇది ఆరోగ్యశ్రీలో మనం తీసుకువచ్చిన గొప్ప విప్లవాత్మక మార్పు. ఇంతకు ముందు చెయ్యి విరిగితే.. వైద్యం అందుతుందా లేదా.. అనే పరిస్థితి నుంచి.. ప్రమాదవశాత్తు చెయ్యి విరిగినా పర్వాలేదు.. వైద్యం చేయిస్తున్నాడు జగనన్న.. రూ.10 వేలు చేతిలో పెట్టి పంపిస్తున్నాడు జగనన్న అనే పరిస్థితిలోకి తీసుకెళ్లాం. 

తొమ్మిదిరకాల దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి పెన్షన్‌ రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచి అందిస్తున్నాం. ఇంతకు ముందు దీర్ఘకాలిక రోగుల గురించి ఆలోచించేవారు కాదు.. నా పాదయాత్రలో చాలా మందిని చూశాను.. పక్షవాతం వచ్చి వీల్‌ చైర్‌కే అంకితమైపోయిన వారు. వెన్నెముకకు దెబ్బతగిలి మంచానికే పరిమితమైన వారిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఈ రోజు అటువంటి వారికే కాకుండా.. లెప్రసీ ఉన్నవారికి రూ.3 వేలు, బోదకాళ్లు, పక్షవాతం వంటి వారికి, మంచానికే పరిమితమైన వారికి, గుండె, లివర్, కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారికి, డయాలసిస్‌ చేయించుకునేవారికి, తలసేమియా ఉన్నవారికి, సికిల్‌సెల్‌ అనేమియా ఉన్నవారికి, తీవ్రమైన హిమోఫేలియా బాధితులకు అందరికీ పెన్షన్లు నెల నెలా ఇంటికి వచ్చి రూ. 5 వేల నుంచి రూ.10 వేలు ప్రతి నెల వలంటీర్‌ వచ్చి వీరి చేతుల్లో పెట్టిపోతున్నారు. 

రూ. 5లక్షల వార్షికాదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చడమే కాకుండా..  వీరందరికీ క్యూఆర్‌ కోడ్‌తో కలిగిన ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాం. ప్రతి సారి ఆస్పత్రికి వెళ్లినప్పుడు రిపోర్టు తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆరోగ్యశ్రీ కార్డుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే చాలు మన రిపోర్టు అంతా డాక్టర్‌కు తెలిసే పరిస్థితి తీసుకువచ్చాం. 1.42 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటికే 1.33 కోట్ల మందికి కార్డులు జారీ చేశాం. మిగిలిన వారికి కూడా మరో రెండు వారాల్లో ఆరోగ్యశ్రీ కార్డులు అందుతాయి. 

గతంలో మెడిసిన్‌ పరిస్థితి గమనిస్తే.. గవర్నమెంట్‌ ఆస్పత్రికి వెళ్లి మెడిసిన్‌ తీసుకోవాలంటే ప్రజలకు భయం ఉండేది. ఆ మందులు ఏం పనిచేస్తాయి.. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో అంతా లంచాల మయమే కదా.. ఆ మందులు వేసుకుంటే తలనొప్పి.. కడుపు నొప్పి కూడా తగ్గదు.. అవన్నీ కల్తీ మందులని ప్రతి నోటా వినిపించేది. 

ఈరోజు గర్వంగా చెబుతున్నాను.. మెడిసిన్‌ సంఖ్య ఇంతకు ముందు గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో 230 ఉంటే.. దాన్ని 500 సంఖ్యకు పెంచాం. అంతేకాకుండా మెడిసిన్‌ (డబ్లూహెచ్‌ఓ) వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ స్టాండెట్స్, (జీఎంపీ) గుడ్‌ మెడికల్‌ ప్రాక్టీసెస్‌ స్థాయి ఉన్న మెడిసిన్‌ మాత్రమే ఆస్పత్రుల్లో ఉంచాలని గట్టి చర్యలు తీసుకున్నాం. 

నేను గర్వంగా చెప్పగలుగుతా.. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాగాలేకపోయినా.. మన గవర్నమెంట్‌ ఆస్పత్రులకు వస్తే మంచి మందులు దొరుకుతాయని గర్వంగా చెప్పే పరిస్థితిలో మన ఆరోగ్యశ్రీలో ఉంది. ఎందుకంటే డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ స్టాండెట్స్‌ కలిగిన మెడిసిన్‌ సప్లయ్‌ చేస్తున్నాం కాబట్టి. మూడు ప్రాంతీయ డ్రగ్‌స్టోరేజ్‌ వ్యవస్థను కూడా తీసుకువచ్చేందుకు మంజూరు చేశాం.. అవి నిర్మాణం కూడా జరుగుతున్నాయి. 

ఈ సంవత్సరకాలంలో ఆరోగ్యశాఖలో నా మనసుకు నచ్చిన కార్యక్రమం ఏంటంటే.. కంటి వెలుగు కార్యక్రమం. కంటి వెలుగు ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయించి.. అవసరం ఉన్నవారందరికీ కళ్లజోళ్లు, శస్త్ర చికిత్సలు చేయాలని ప్రభుత్వం ఉద్దేశించి దాదాపు రూ.560 కోట్లతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే మొదటి దఫా కింద స్కూళ్లలో చదువుతున్న ప్రతి పిల్లాడికి దాదాపు గవర్నమెంట్, ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతున్న 70 లక్షల మంది పిల్లలందరికీ పరీక్షలు చేయించాం. ఇందులో 4.36 లక్షల మంది పిల్లలకు దృష్టిలోపాలు ఉందని గుర్తించడం జరిగింది. ఇందులో 1.58 లక్షల మంది పిల్లలకు కళ్లజోళ్లు అవసరం అని తేల్చడం జరిగింది. ఇందులో 1.29 లక్షల మంది పంపిణీ చేయడం కూడా జరిగింది. మిగిలిన వారికి స్కూళ్లు తెరిచిన వెంటనే పంపిణీ చేస్తాం. శస్త్ర చికిత్స అవసరమైన వారు దాదాపు 46 వేల మంది ఉన్నారు. వీరందరికీ రాబోయే రోజుల్లో చేస్తాం. కోవిడ్‌ టైమ్‌ వల్ల కొంచెం కష్టం అయ్యింది. దసరా సెలవుల్లో ఈ 46 వేల మంది పిల్లలకు శస్త్ర చికిత్సలు చేయిస్తాం. 

అవ్వాతాతలకు రెండో విడత కంటి పరీక్షలు చేయించేందుకు సిద్ధం అవుతున్నాయి. అవ్వాతాతలకు కంటి పరీక్షలు, కళ్లజోళ్లు, శస్త్ర చికిత్సలు చేయించడం కోవిడ్‌ వల్ల ఆలస్యమైంది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం మొదలుపెడతాం.

ఆరోగ్యశ్రీలో ఒక మార్పు కనిపిస్తుంటుంది. దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్‌ ఉంటేనే పెన్షన్, గవర్నమెంట్‌ స్కీమ్‌లకు అర్హత ఉంటుంది. ఆ సర్టిఫికేట్‌ కోసం ఇంతకు ముందు నాలుగు నెలల పాటు పడిగాపులు కాయాల్సివచ్చేది. ఇంతకు ముందు 57 చోట్లు సదరం క్యాంపులు జరిగేవి.. వాటిని 167కు తీసుకెళ్లాం. ప్రతి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో సదరం క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందున్న నాలుగు నెలల వెయిటింగ్‌ పిరియడ్‌ను రెండు వారాలకే తీసుకొచ్చామని గర్వంగా చెప్పగలను. 

ప్రజారోగ్యరంగంలో గొప్ప మార్పును మనకు ఉన్న ఆస్పత్రులను ‘నాడు–నేడు’ అనే కార్యక్రమం ద్వారా తీసుకువస్తున్నాం. ప్రతి ఆస్పత్రి రూపురేఖలు మార్చుతున్నాం. మన ఆస్పత్రులు ఇప్పుడు స్థితి ఫొటోలను చూపించి.. మూడేళ్లలో ఈ మాదిరిగా మార్పు చేశామని చూపిస్తాం. పీహెచ్‌సీ దగ్గర నుంచి ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రులు వీటన్నింటి రూపురేఖలు మార్చుతాం. ఇప్పుడు 11 టీచింగ్‌ ఆస్పత్రులు మనకు ఉంటే.. కొత్తగా మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులు కట్టబోతున్నాం. మొత్తం 27 టీచింగ్‌ ఆస్పత్రులు, ఐటీడీఏ పరిధిలో దాదాపు 7 టీచింగ్‌ ఆస్పత్రులు రాబోతున్నాయి. వీటన్నింటికీ దాదాపు రూ. 16 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అపోలో ఆస్పత్రికి వెళ్తే ఏ విధంగా వైద్యం అందిస్తారో.. మన గవర్నమెంట్‌ ఆస్పత్రులు కూడా అదే మాదిరిగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుడుతున్నాం. 

ప్రతి గ్రామ రూపురేఖలు మార్చబోతున్నాం. ఒక వ్యక్తి ఊర్లో నుంచి బయటకు వస్తే.. వెంటనే అతనికి గ్రామ సచివాలయం, గ్రామ వలంటీర్లు కనిపిస్తారు. నాలుగు అడుగులు ముందుకువేస్తే.. ఇంగ్లిష్‌ మీడియం స్కూల్, మరో నాలుగు అడుగులు వేస్తే వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ తీసుకువస్తున్నాం. మన ఊర్లోనే విలేజ్‌ క్లినిక్‌లో ఏఎన్‌ఎం నర్సు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. అక్కడికే ఆశా వర్కర్లు వచ్చి రిపోర్టు చేస్తారు. విలేజ్‌ క్లినిక్‌లో 54 రకాలకు సంబంధించిన మెడిసిన్‌ అందుబాటులో ఉంటుంది. ఇంతకంటే పెద్ద వైద్యం చేయించుకునే పరిస్థితి వస్తే.. ఆరోగ్యశ్రీకి అక్కడి నుంచే రెఫరల్‌ పాయింట్‌. 104, 108 వాహనాలు 20 నిమిషాల్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితిని గ్రామ స్థాయిలోకి తీసుకువస్తున్నాం. దాదాపుగా 13 వేలకు పైచిలుకు విలేజ్‌ క్లినిక్స్‌ అండ్‌ వార్డు క్లినిక్స్‌ తీసుకువచ్చేందుకు శ్రీకారం చుడుతున్నాం. వీటి నిర్మాణం కూడా 2021 మార్చి వరకు పూర్తిచేస్తాం. ఇందుకు రూ.2600 కోట్లు ఖర్చుచేయబోతున్నాం. 

పీహెచ్‌సీల రూపురేఖలు మార్చబోతున్నాం. 149 చోట్ల కొత్త పీహెచ్‌సీలు కట్టబోతున్నాం. 1138 పీహెచ్‌సీలను అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చబోతున్నాం. ఇందుకోసమని దాదాపు రూ.671 కోట్లు ఖర్చుచేస్తున్నాం. వచ్చే మార్చి వరకు పూర్తి చేయిస్తాం. సబ్‌ సెంటర్లు, విలేజ్‌ క్లినిక్స్‌.. పంచాయతీ రాజ్‌ డిపార్టుమెంట్‌ పనులు చేయిస్తుంది. పీహెచ్‌సీ ఆర్‌ఎండ్‌బీ డిపార్టుమెంట్‌ చేస్తుంది. 

52 ఏరియా ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నాం. ఇందుకోసం రూ.695 కోట్లతో టెండర్లకు సిద్ధంగా ఉంది. 169 సీహెచ్‌సీ ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నాం. ఇందుకు రూ.541 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఇందుకు టెండర్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. మరో 15 రోజుల్లో టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది. 

ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌ కాలేజీల రూపురేఖలు మార్చుతూ.. వీటికి మరో 16 మెడికల్‌ కాలేజీలు యాడ్‌ చేస్తూ.. మొత్తం 27 మెడికల్‌ కాలేజీలను కట్టబోతున్నాం. ఇవేకాకుండా గిరిజన ప్రాంతంలో 7 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను కట్టబోతున్నాం. వీటికి ఆగస్టులో టెండర్లు పిలిచేందుకు ఆరోగ్యశాఖ కృషిచేస్తోంది. ఇందుకు రూ.12,270 కోట్లతో మూడేళ్లలో పూర్తిచేసేలా కార్యాచరణ చేస్తున్నారు. 

104, 108 వాహనాలకు ఫోన్‌ చేస్తే ఎప్పుడు వస్తాయో కూడా తెలియని అధ్వాన్నమైన పరిస్థితి నుంచి ఈ జూలై 1వ తేదీన విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ రోడ్డు మీద జెండా ఊపుతున్నాం.. 1060 కొత్త వాహనాలు 104, 108 వాహనాలు ప్రతి జిల్లాకు చేరుకుంటాయి. 

కోవిడ్‌ సమయంలో ఆరోగ్యరంగంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. అందరినీ ఇళ్లలో ఉండమని కోరుతున్నాం కాబట్టి వారికి వైద్య అవసరాలు ఏమైనా ఉంటే.. తోడుగా ఎలా ఉండాలని చెప్పి ‘వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌’కు కోవిడ్‌ టైమ్‌లో శ్రీకారం చుట్టాం. 14410 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలు.. దాదాపు 300 మంది డాక్టర్లు టెలీ మెడిసిన్‌ కోసం పనిచేస్తున్నారు.. వీళ్లలో ఎవరో ఒకరు వెంటనే తిరిగి ఫోన్‌ చేస్తారు.. పేషంట్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకొని మందులు ప్రిస్క్రైబ్‌ చేసి మరుసటి రోజు నేరుగా డోర్‌ డెలివరీ చేసే విధంగా వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ తీసుకొచ్చాం. 

ఇంకా మెరుగైన సేవల కోసం జూలై 1న 1060 అంబులెన్స్, 104 వాహనాల ప్రారంభోత్సవంతో పాటు ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్‌ కేటాయించబోతున్నాం. ఎవరికైనా బాగోలేకపోతే బైక్‌లో ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. 

మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది లేకపోతే ఎంతచేసినా లాభం లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఏయే ఆస్పత్రికి ఎంతమంది అవసరం అని.. జాతీయ ప్రమాణాలు ఐపీహెచ్‌ఎస్‌ ప్రకారం ఎంతమంది కావాలో వారందరినీ రిక్రూట్‌ చేసుకోండి అని ఆరోగ్య శాఖకు ఆదేశాలిచ్చాం. 9,712 మంది డాక్టర్లు, నర్సులు, ఇతర ఇబ్బందిని రిక్రూట్‌ చేసుకునేందుకు శ్రీకారం చుడుతుంది. మరో వారంలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇవ్వనున్నాం. నెలన్నర రోజుల్లో 9,712 మంది కొత్త ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. 

వైద్య, ఆరోగ్య శాఖలో మార్పులు చేస్తూనే.. కరోనాను అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన అడుగులు ముందుకు వేశాం. యుద్ధం వస్తే ఎలా పనిచేస్తామో.. అదే స్థాయిలో కోవిడ్‌ సమయంలో మనవారంతా పనిచేశారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఒక్కల్యాబ్‌తో ప్రారంభమై.. కేవలం ఈ 70 రోజుల్లోనే 13 ల్యాబ్‌లను తయారు చేసి పెట్టాం. వీటితో పాటు మరో 337 ట్రూనాట్‌ మెషిన్లను కూడా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలోనే అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం.

కోవిడ్‌ రాకముందు రోజుకు 2 టెస్టులు కూడా చేసే అవకాశం లేని ఆంధ్రరాష్ట్రంలో.. ప్రస్తుతం రోజుకు 11 వేల టెస్టులు చేసే పరిస్థితిలోకి వచ్చాం. ఇప్పటి వరకు 3.42 లక్షల టెస్టులు చేశాం. టెస్టుల పరంగా చూస్తే.. పది లక్షల జనాభాకు మనం 6,627 టెస్టులు చేశాం.. ఇది దేశంలోనే అత్యధికం. 

దేశం మొత్తం మీద పాజిటివ్‌ కేసు రేట్‌ ఎంతంటే.. 4.71 శాతంగా ఉంటే.. మన రాష్ట్రంలో పాజిటివ్‌ రేట్‌ 0.95 శాతం మాత్రమే. దేశం మొత్తం మీద రికవరీ రేట్‌ 42.7 శాతం అయితే.. మన రాష్ట్రంలో 65.49 శాతం. దేశం మొత్తం మీద కోవిడ్‌ మరణాల రేట్‌ 2.86 ఉంటే.. మన రాష్ట్రంలో 1.82 మాత్రమే. కరోనా మీద యుద్ధంలో దేశంలోనే అగ్రగామిగా మనం ఉన్నాం. 

ఆరోగ్యపరంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అందరికంటే ముందుగా సమాజాన్ని మనం సిద్ధం చేశాం. ఈ కోవిడ్‌ అనేది పోయేది కాదు.. మనం కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిందే. ఇది మనం గమనించుకోవాలి. కోవిడ్‌ వస్తే ఆ మనిషిని అంటరానివారిగా చూడకూడదు. దయ ఉంచి అలాంటి కార్యక్రమం ఎక్కడ జరగకూడదు. కోవిడ్‌ ఎవరికైనా వస్తుంది. జ్వరం వస్తుంది.. పోతుంది. ఇందులో 98 శాతం మంది రికవరీ అవుతున్నారు.. ఇందులో ప్రత్యేక ఏంటంటే.. 85 శాతం మంది ఇంట్లోనే మందులు వాడి నయం అవుతున్నారు. మన ఇంట్లో పెద్దవాళ్లను, చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదేదో ఇస్తే ఇబ్బంది పడతామని.. వచ్చిన వాళ్లను అంటరానితనంగా చూడడం ఇలాంటి అపోహలు మానేయాలి. 

రాష్ట్ర స్థాయిలో 5 కోవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలోనూ ఆస్పత్రులు ఉండేలా.. 65 జిల్లాస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 38వేల ఐసోలేషన్‌ బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 15 వేల బెడ్స్‌ ఆక్సిజన్‌ సప్లయ్‌తో రెడీగా ఉన్నాయి. వీటిల్లో 5400 బెడ్స్‌ ఐసీయూ బెడ్స్‌గా రెడీగా ఉన్నాయి. వీటిల్లో కూడా 1350 బెడ్స్‌కు వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. 24 వేల డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు.. 22,500 మంది ఫ్యారామెడికల్‌ స్టాఫ్‌ కూడా సన్నద్ధంగా ఉన్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నాం. 

 

Back to Top