వైయ‌స్ జగన్‌ రాజకీయంతో చంద్రబాబుకు షాక్‌

చంద్రగిరి నుంచి కుప్పంకు ఎందుకు బదిలీ అయ్యావ్‌ 

మా ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నావ్‌ 

పవన్‌కళ్యాణ్‌ తన పార్టీని చంద్రబాబుకు లాంగ్‌లీజుకు ఇచ్చాడు 

 తెలంగాణలో జీవనం.. ఆంధ్రాలో రాజకీయం  

సీటు రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తా 

మా కుటుంబమంతా జగన్‌ మేలు కోసమే  

మాజీ మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న రాజకీయం చూసి చంద్ర­బాబుకు షాక్‌ తగిలిందని మాజీమంత్రి, బందరు శాసనసభ్యుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) చె­ప్పా­­రు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆ­య­న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు కొత్తగా వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. గోతికాడ నక్కలా రెండుకళ్ల సిద్ధాంతం, రెండు నాలుకల ధోరణితో మా­ట్లా­డుతున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయజీవితంలో, 13 ఏళ్ల ముఖ్యమంత్రిగా పాలనలో చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. 175 సీట్లలో విజ­యం సాధించాలనే దిశగా సీఎం వైయ‌స్‌ జగన్‌ పనిచేస్తుంటే చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయన్నారు. 
ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించటం విడ్డూరంగా ఉందన్నారు. మరి చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లాడు, కోడెల శివప్రసాద్‌ను నరసరావు­పేట నుంచి సత్తెనపల్లెకు ఎందుకు పంపారో చె­ప్పా­­లని డిమాండ్‌ చేశారు. నువ్వు చేస్తే రాజ్యాంగ­బద్ధం వేరొకరు చేస్తే తప్పు అని మాట్లాడటమా అని చంద్రబాబును ప్రశ్నించారు. మరి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నావని నిలదీశారు. అగ్రవర్ణానికి చెందిన ఎంపీ రా­జును ఎలా అక్కున చేర్చుకున్నావో చెప్పాలన్నారు.  

పవన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం 
జనసేన పార్టీ నేత పవన్‌కళ్యాణ్ వైయ‌స్ఆర్‌సీపీని ఓడించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాననటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి వైపు మాట్లాడకుండా కేవలం చంద్ర­బాబు రాజకీయ లబ్దికోసమే వ్యాఖ్యలు చేస్తు­న్నా­రని విమర్శించారు. పార్టీ పెట్టి పదేళ్లు దాటినా ఆత్మస్థైర్యం లేకుండా పనిచేస్తున్నారన్నారు. టెంట్‌హౌస్‌లాగా అద్దెకు ఇచ్చే పార్టీని నడుపుతున్నారని, తన పార్టీని చంద్రబాబుకు లాంగ్‌లీజ్‌కు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో జీవనం సాగిస్తూ ఆంధ్రాలో రాజకీయం చేయటం చంద్రబాబుకు, పవన్‌కళ్యాణ్‌కే చెల్లిందని విమర్శించారు.

ఈనాడు రామోజీరావు,ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పరాయి రాష్ట్రంలో ఉండి ఆంధ్రరాష్ట్రంలో ఎత్తుగడలు వేస్తూ విషం చిమ్ముతున్నారన్నారు. ప్రజాసంక్షేమానికి సీఎం జగన్‌ నేడు 2.5 లక్షల కోట్లు ఖర్చుపెడితే.. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఆ సొమ్ము­­ను ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక పోర్టు, మెడికల్‌ కాలేజీ, హార్బర్‌.. ఏమీ నిర్మించలేదని, అప్పులు మాత్రం దండిగా వదిలివెళ్లారన్నా­రు. మళ్లీ అధికారంలోకి వచ్చి జనం సొమ్ము మూటలు కట్టుకోవాలనే చూస్తున్నారన్నారు.
 
కరోనా సమయంలో కొల్లు రవీంద్ర ఎక్కడున్నాడు  
టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర ఏ తుపానులోగానీ, కరోనా సమయంలోగానీ కనిపించారా అని పేర్ని నాని ప్రశ్నించారు. తాను, తన కుమారుడు పేర్ని కిట్టు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి కరోనా బారినపడిన ప్రజలను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశామని గుర్తుచేశారు. ఏ పరికరం కావాలన్నా సొంత డబ్బుతో తెప్పించి ప్రాణనష్టం జరగకుండా చూశామన్నారు.

తుపాను హెచ్చరికల నుంచి చివరివరకు ప్రాణనష్టం జరగకుండా మోకాలులోతు నీటిలో పేర్ని కిట్టు తిరిగారని తెలిపారు. ముక్కుపచ్చలారని యువకుడు ప్రజల కోసం తిరుగుతుంటే కొల్లు రవీంద్ర సిగ్గుపడాలన్నారు. తాము సీటు వస్తే ఏంటి రాకపోతే ఏంటి అనే ఆలోచనతో  పార్టీ కోసం ఉంటామని చెప్పారు. వైయ‌స్ జగన్‌ బాగుంటే చాలు రాష్ట్రమంతా బాగుంటుందనే తమ కుటుంబమంతా ఆలోచిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Back to Top