శింగనమల: ఏడాది కాలంగా హామీల అమలులో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పార్టీ శ్రేణులకు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వైయస్సార్సీపీ కార్యాలయంను ఆయన ప్రారంభించారు. అనంతరం'చంద్రబాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ' క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్‌ను పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోలో హామీల పేరుతో చేసిన మోసాలను ప్రజలందరికీ గుర్తుచేయడానికి వైయస్ జగన్ ఆదేశాలతో 'రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో' కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. ఇంకా ఆయనేమన్నారంటే... 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఆదర్శంగా నిలిచారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చేసిన మోసాలు, దాడులు, అవినీతి, అకృత్యాలు, ఆడవారిపై చేసిన అఘాయిత్యాల గురించి మాట్లాడాలంటే వారం కూడా సరిపోదేమో. ఐదేళ్ల పాలనతో వైయస్ జగన్ రాష్ట్రాన్ని పదేళ్లు ముందుకు తీసుకెళితే, చంద్రబాబు తన ఏడాది పాలనతోనే రాష్ట్రాన్ని 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఏడాదిలోనే 5 లక్షల పింఛన్లు తొలగించిన కూటమి ప్రభుత్వం మొత్తం 10 లక్షల పింఛన్లు తొలగించడం లక్ష్యంగా పెట్టుకుంది. నిద్ర లేచింది మొదలు వైయస్ జగన్ పేరెత్తకుండా కూటమి నాయకులకు రోజు గడవడం లేదు. ఆయన వ్యక్తిత్వం హననం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలను, నాయకులను జైళ్లలో పెట్టాలని చూస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో మనమే జైల్ భరో కార్యక్రమం చేసి మనమే జైల్లో ఉంటామని చెప్పాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. వైయస్సార్సీపీ కార్యకర్తల ప్రతిఘటనతో ఏడాదిలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ నాయకులకు అర్థమైపోయింది. అందుకే మట్టి, లిక్కర్, శాండ్, బూడిద, క్వార్ట్జ్ అనే తేడాలేకుండా అందినకాడికి దోచుకుంటున్నారు. గ్యారెంటీ బాండ్లు చూపించి మోసాలు వివరించండి ప్రజాస్వామ్యంలో రీకాల్ చేసే సిస్టం లేదు కాబట్టి ఐదేళ్లు నేనే అధికారంలో ఉంటాననే ధైర్యంతో చంద్రబాబు, లోకేష్ చేస్తున్న ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. కానీ వైయస్సార్సీపీ మాదిరిగా ప్రశ్నించే పార్టీ ఉన్నంతకాలం వారి ఆగడాలు ఎంతోకాలం సాగవు. వారి మెడలు వంచే ప్రయత్నంలో భాగంగానే రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో అంటూ మోసాలను ప్రజలకు గుర్తుచేసే కార్యక్రమానికి వైయస్సార్సీపీ శ్రీకారం చుట్టింది. జూలై ఫస్ట్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను గడపగడపకు వెళ్లమని చంద్రబాబు చెబుతున్నారు. ఆ రోజుకు ఎమ్మెల్యేలను నిలదీయడానికి ప్రజలను సిద్ధం చేయాలి. ఇచ్చిన అన్ని హామీలను జూన్ 2024 నుంచే త్రికరణ శుద్ధితో అమలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి ఇచ్చిన గ్యారెంటీ బాండ్లను వారికి చూపించాలి. ఎన్నికలకు ముందు బాండ్ల రూపంలో లెక్కలేసి ఇచ్చిన హామీలను వారికి గుర్తు చేయాలి. చంద్రబాబు అబద్ధపు హామీల వల్ల గతేడాది జరిగిన నష్టం లెక్కలతో సహా వారికి గుర్తుచేసి వారిని చైతన్యం చేయాలి. ఈరోజు జిల్లా స్థాయిలో మొదలైతే, తర్వాత రోజుల్లో నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిల్లోకి తీసుకెళదాం. మోసాల కారణంగా ప్రతి ఇంటికీ జరిగిన నష్టాన్ని వివరిద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బటన్ నొక్కడంలో జగన్‌తో పోటీ పడండి బాబూ : మాజీ మంత్రి సాకె శైలజానాథ్ కష్టనష్టాల్లో వైయస్ జగన్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నా. రెడ్ బుక్ చూపించి సీఎం చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు, బెదిరింపులకు ఈ శింగనమల నియోజకవర్గ ప్రజలు వెన్ను చూపే రకం కాదు. చంద్రబాబుకి దమ్ముంటే వైయస్ జగన్ మాదిరిగానే బటన్ నొక్కడంలో ఆయనతో పోటీ పడాలి. ఇళ్ల పట్టాలు, ఇళ్లు, సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించాలి. విద్య, వైద్య రంగంలో వైయస్ జగన్ అమలు చేసిన విప్లవాత్మక కార్యక్రమాలను కొనసాగించాలి. ఏడాది కాలంగా చేసిన కాలక్షేపం చాలు. ప్రజలు మిమ్మల్ని గెలిపించి అధికారం కట్టబెట్టారంటే దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదని గ్రహించండి. ఒక్క జగన్‌ని ఓడించడానికి మూడు పార్టీలు కలిసొచ్చాయి. అయినా కూటమి గెలుపు మీద ప్రజల్లో అనుమానాలున్నాయి. ఈవీఎంల మేనేజ్ చేశారేమోనని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఎవరెన్ని కుట్రలు చేసినా వైయస్ జగన్ ని సీఎం కాకుండా ఆపడం ఎవరితరం కాదని సాకె శైలజానాథ్ అన్నారు. మద్యం వ్యాపారులకే మద్దతు ధర దక్కుతోంది : ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఈరోజు ఎన్నికలు జరిగితే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఊడ్చుకునిపోతుందుని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏ పంటకూ మద్దతు ధర దక్కడం లేదు. దళారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారు. మద్యం వ్యాపారులకు మాత్రమే మద్దతు ధర దొరుకుతోంది. కూటమి ఎమ్మెల్యేలు తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. వైయస్ జగన్ పేరు తలచుకోకుండా చంద్రబాబు, లోకేష్‌కి రోజు గడవడం లేదు. ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అమరావతి రాజధాని పేరుతో మిగతా ప్రాంత ప్రజల కడుపుకొట్టడం తగదు. కూటమి పార్టీ వైఫల్యాలను, మేనిఫెస్టో పేరుతో చేసిన మోసాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీ మిధున్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి కేవీ ఉషాశ్రీ చరణ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సతీష్ రెడ్డి, అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు బోరెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.