న్యూఢిల్లీ : వెలిగొండ ప్రాజెక్ట్‌కు సంబంధించి కృష్టా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంకా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) అందలేదని జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైయస్ఆర్ సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ టెక్నో-ఎకనమిక్ మదింపు కోసం వెలిగొండ ప్రాజెక్ట్ ప్రతిపాదన కూడా కేంద్ర జల సంఘానికి అందనందున జల శక్తి మంత్రిత్వ శాఖ సలహా సంఘం వెలిగొండ ప్రాజెక్ట్‌ను ఆమోదించలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 11వ షెడ్యూలు కింద నిర్దేశించిన ప్రాజెక్ట్‌లను (వెలిగొండతో సహా) పూర్తి చేయడానికి అనుమతించినందున వెలిగొండను ఆమోదం పొందిన ప్రాజెక్ట్‌గా పరిగణించి దానిని పూర్తి చేసి ఆపరేట్ చేయడానికి అనుమతించాలని గత అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల శక్తి మంత్రిత్వ శాఖను కోరినట్లు శ్రీ షెకావత్ తెలిపారు. అలాగే కేఆర్‌ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ వెలువడిన ఆరు మాసాలలోగా వెలిగొండకు క్లియరెన్స్‌లు పొందాలన్న నిబంధనలు కూడా విధించవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినట్లు ఆయన చెప్పారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు గత ఆగస్టు 15న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం వెలిగొండ ప్రాజెక్ట్ ఆమోదం పొందని ప్రాజెక్ట్‌ల జాబితాలోనే ఉన్నట్లు మంత్రి తెలిపారు. కేఆర్‌ఎంబీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఆమోదం పొందని ఏ ప్రాజెక్ట్ అయినా షెడ్యూలు 1, 2 లేదా 3లో చేర్చినంత మాత్రాన ఆ ప్రాజెక్ట్‌లు అనుమతి పొందినవిగా పరిగణించడానికి వీలు లేదు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు షెడ్యూళ్ళలో పూర్తి చేసిన లేదా నిర్మాణంలో ఉన్న ఆమోదం పొందని ప్రాజెక్ట్‌లపై మదింపు జరిగి ఆమోదం పొందాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రైవేట్‌కు బీచ్ శాండ్ తవ్వే అనుమతి లేదు బీచ్ శాండ్ ఖనిజాల తవ్వకాలకు కేవలం ప్రభుత్వ కంపెనీలు, ప్రభుత్వ అధీనంలోని కార్పొరేషన్లను మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 2019లో గనుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా బీచ్ శాండ్ మినరల్స్‌లో మోనోజైట్ థ్రెషోల్డ్ వాల్యూను 0.75% నుంచి 0.000%కు మార్పు చేసినట్లు తెలిపారు. ఫలితంగా ఈ థ్రెషోల్డ్ వాల్యూకు పైబడిన బీచ్ శాండ్ మినరల్ తవ్వకాలకు కేవలం ప్రభుత్వ సంస్థలకు మాత్రమే అనుమతించినట్లు తెలిపారు. ఇల్మెనైట్, మోనోజైట్, రుటైల్, సిలిమనైట్, గార్నెట్, జిర్కాన్ వంటి భార ఖనిజాల అన్వేషణ కోసం జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లోని పూడిమడక నుంచి ఒడిషాలోని పారాదీప్ వరకు 806 కిలోమీటర్ల మేర సముద్ర తీరాన్ని గుర్తించినట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి పరిశీలన, అన్వేషణ కొనసాగుతున్నందున నిక్షిప్తమైన ఖనిజాల విలువను అంచనా వేయలేదని చెప్పారు.