బాబు వాడకానికి మరో బలిపశువు

చంద్రబాబు అవసరానికి సొంత వాళ్లు, పరాయివాళ్లు అన్న తేడా లేకుండా ఎవరినైనా వాడుకుని వదిలేయగలడు.

నందమూరి కుటుంబాన్ని నారా చంద్రబాబు అలా వాడుకునే, చివరకు ఏ స్థాయిలో పతనం చేసాడో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, దుర్మార్గంగా పార్టీ నుంచి వెళ్లగొట్టాడు. నందమూరి వారసులందరినీ తన గుప్పెట్లో పెట్టుకుని, రాజకీయంగా ఏ మాత్రం ఎదగకుండా అణగదొక్కేసాడు. బాలయ్యతో వియ్యం కలుపుకుని భవిష్యత్ లో రాజకీయ ప్రత్యర్థిని లేకుండా చేసుకున్నాడు. జూనియర్ ను ఎన్నికల్లో ఎడాపెడా వాడేసి మళ్లీ కన్నెత్తి చూడటం మానేసాడు.

గత ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డాక,  రెండు పదుల సంఖ్యకే పార్టీ పరిమితం అయ్యాక బాబు మళ్లీ తన వాడకానికి పదునుపెట్టాడు. ముసలి వాసనేస్తూ, మూలనపడ్డ పార్టీకి యువ నేతల ముఖం చూపించి ప్రాణం పోద్దామనుకుంటున్నాడు.  పార్టీని కొడుకు లోకేష్ చేతికి అప్పజెప్పేందుకు బాబు పడరాని పాట్లు పడుతున్నాడు. అధికారం ఉన్నప్పుడు అడ్డదారిలో మంత్రిని చేసి రెండు పోర్టుపోలియోలైతే ఇప్పించగలిగాడు కానీ కనీస పరిజ్ఞానం లేని లోకేష్ ను మంచి నాయకుడిని చేయలేకపోయాడు. ఎంత తోమినా ఇత్తడి పుత్తడి కాదుగా. ఇప్పటికే చినబాబు సత్తా తెలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక పార్టీకి దిక్కెవరు అన్నట్టు దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టకుండా కలుపుకుపోవాలని సలహాలిస్తున్నారు. టీడీపీలో బాబు తర్వాత ఇక అవకాశం నందమూరి వారసుడిగా జూనియర్ తారక్‌ కే దక్కాలని బాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు. అదే జరిగితే బాబు చేతుల్లోంచి టీడీపీ శాశ్వతంగా జారిపోతుందనేది వాస్తవం. ఏ నందమూరి కుటుంబం నుంచి పార్టీని లాక్కున్నాడో అదే కుటుంబం చేతుల్లోకి తిరిగి పార్టీ వెళ్లిపోతే, చివరకు తమ కుటంబానికి కుప్పమే దిక్కని అని అర్థం అయ్యింది బాబుకు. దాంతో తాను చెప్పినట్టల్లా వింటూ, అనుకూలంగా ఉండే ముఖాల కోసం కసరత్తు చేసాడు. జూనియర్ కు బదులుగా బాలయ్య చిన్నల్లుడు భరత్‌ను నెమ్మదిగా తెర మీదకు లాగాడు. పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదంటూ వివాదాస్పద వాఖ్యలు చేయించాడు. దీంతో బాలయ్య చిన్నల్లుడు భరత్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాజిటివ్ గా, నెగిటివ్‌ గా భరత్ పేరు ప్రజల నోళ్లలో నానేలా చేయడమే బాబు వేసిన ప్లాన్. ఎంపీగా గెలవలేకపోయిన భరత్ ను పార్టీకి కొత్త ఆశగా చూపించి తెరవెనుక తాను, తన కొడుకు తతంగం నడపాలన్నదే కొత్త స్కెచ్ లా కనిపిస్తోంది.

ఒకప్పుడు ఎన్టీఆర్‌ ను గద్దె దించేందుకు హరికృష్ణను, తోడల్లుడు వెంకటేశ్వరరావును ఇలాగే వాడుకుని తర్వాత పక్కన పెట్టిన విషయం ఒకప్పటి నందమూరి అభిమానులు మరిచిపోలేరు. తాజాగా తెలంగాణా ఎన్నికల్లోనూ హరికృష్ణ సింపతీని వాడుకునేందుకు ఆయన కుమార్తె సుహాసిని బరిలోకి దింపాడు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని ఆమె పట్టుమని పది మాటలు కూడా మాట్లాడలేక దారుణంగా ఓడిపోయింది. ఇలా తన రాజకీయ అవసరాల కోసం నందమూరి కుటుంబంలో ఎవ్వరో ఒకరిని బలిపశువులను చేయడం బాబుకు ఆనవాయితీ. పాపం నందమూరి ఇంటికి అల్లుడైన కారణంగా ఈ సారి ఆ అదృష్టం బాలయ్యచిన్నల్లుడిని వరించిందన్నమాట.

Back to Top