వైయస్ఆర్ జిల్లా: కడప పార్లమెంట్ సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ అవినాష్ రెడ్డి మంగళవారం దువ్వూరు మండలం చల్ల బసాయపల్లిలో పర్యటించి మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న, అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2400 ఉండగా మార్కెట్‌లో రూ.1400కే అమ్ముకోవాల్సి వస్తోందని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేస్తూ, మన రాష్ట్రంలో కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. అరటి పంట ధరలు కూడా తీవ్రంగా పడిపోయాయని, టన్నుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల మధ్య మాత్రమే ధర వస్తోందని తెలిపారు. కనీసం టన్నుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధర వచ్చేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోతే తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రేపు జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లాలని అధికారులను కోరుతూ, రైతులను వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచ్‌లకు ఆత్మీయ సన్మానం మైదుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీసీఆర్ కళ్యాణమండపంలో సర్పంచ్‌లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ రామ్ గోవింద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్, ఆరోగ్య కేంద్రం ప్రారంభం దువ్వూరు మండలం సలవాసపల్లె గ్రామంలో వాటర్ ప్లాంట్, రైతు భరోసా కేంద్రం, గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామ్ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామి రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు, ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్రయోజనం కలుగుతుందని నేతలు తెలిపారు.