గంగలకుర్రులో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి

నలుగురికి గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా: అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలోని గుంటమామిడి తోట ప్రాంతంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి. వినాయక నిమజ్జన ఊరేగింపులో భాగంగా గ్రామస్తులు సంప్రదాయం ప్రకారం మెయిన్‌ రోడ్‌ నుంచి ఊరేగింపు నిర్వహిస్తుండగా డీజేలో మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాటలు వేస్తూ యువత నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వివాదం తలెత్తి జనసేన కార్యకర్తలు ఇనుప రాడ్లు, కత్తులు, రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో నలుగురు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని, తలకు గాయాలతో పాటు కాళ్లకు గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌ ద్వారా అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

దాడి ఘటనపై పోలీసులు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయడం పట్ల పార్టీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గంగలకుర్రు, పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Back to Top