పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే ..నేనే ధ‌ర్నాకు వ‌స్తా

ప్ర‌భుత్వానికి వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వార్నింగ్‌

అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి

ఈ ఘ‌ట‌న‌లో ఎంత మంది చనిపోయారో మంత్రుల‌కు తెలియదు

ఘటనా స్థలానికి ఆంబులెన్సులు కూడా రాని పరిస్థితి

ఎల్జీ పాలీమర్స్‌ ఘటనలో 24 గంటల్లోపే పరిహారం ఇప్పించాం 

కోటి రూపాయల పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం మాదే 

పరిశ్రమలపై పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు

వీళ్ల ధ్యాస అంతా రెడ్‌ బుక్‌ అమలుపైనే ఉంది

పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోండి:  వైయ‌స్ జ‌గ‌న్‌

అన‌కాప‌ల్లి: చ్యుతాపురం ఘటనలో బాధిత కుటుంబాల‌కు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే బాధితుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతుంద‌ని, స్వయంగా నేనే ధర్నాకు వస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..
 

ప్రభుత్వ స్పందన లేదు:
    అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో బ్లాస్ట్‌ తర్వాత ప్రభుత్వ స్పందన ఏ మాత్రం సక్రమంగా లేదు. ఘటనపై స్పందించకూడదు అన్న తాపత్రయం ప్రభుత్వంలో కనిపించింది. 17 మంది చనిపోయిన దుర్ఘటనపై ఆరోజు సా.4 గం.కు మీడియాతో మాట్లాడిన హోం మంత్రి సహాయక చర్యల పర్యవేక్షణకు తాను ఘటనా స్థలానికి వెళ్తున్నట్లు చెప్పలేదు. మరో గంటకు మీడియాతో మాట్లాడిన కార్మిక శాఖ మంత్రికి కనీస సమాచారం లేదు. 
    ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్ధలానికి కలెక్టర్‌ ఎప్పుడు వెళ్లారు? అధికారులు ఎప్పుడు వెళ్లారు? కమిషనర్‌ ఎప్పుడు వెళ్లారన్నది గమనిస్తే చాలా బాధ కలిగిస్తుంది. అంత తీవ్రస్థాయిలో ప్రమాదం జరిగినా తగిన సంఖ్యలో అంబులెన్సులు మొబిలైజ్‌ చేయకపోవడంతో కంపెనీ బస్సుల్లోనే బాధితులను ఆస్పత్రులకు తరలించారు.

అదే ఆనాడు చూస్తే..:
    తమ ప్రభుత్వ హయాంలో, కోవిడ్‌ సంక్షోభ సమయంలో, 2020 మే నెలలో విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటన జరిగినప్పుడు ఎలా స్పందించామో.. తేడా మీరే చూడండి.
    ఆ ఘటన తెల్లవారు జామున 3.40 గం.కు జరిగితే ఉ.5 గం.కల్లా కలెక్టర్, కమిషనర్‌ సంఘటనా స్ధలానికి వెళ్లారు. అప్పటికే పెద్దసంఖ్యలో అంబులెన్సులు మొహరించి, ప్రతి బాధితుడికి తోడుగా నిల్చాం. ఉ.6 గం.కల్లా సీనియర్‌ నాయకులంతా ఘటనా స్ధలానికి వెళ్లి, సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు. అదే రోజు ఉ.11 గం.కల్లా నేను స్వయంగా అక్కడికి చేరుకుని బాధితులను పరామర్శించాను. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఘటన తర్వాత కేవలం 24 గంటల్లోనే ఏకంగా కోటి రూపాయల పరిహారం అందించాం. అలా రూ.30 కోట్లు అందించి బాధితులకు తోడుగా నిలబడ్డాం. 
    మరోవైపు అస్వస్థతకు గురైన వారందరినీ తక్షణమే ఆస్పత్రిలో చేర్చాం. మూడు రోజులు ఆస్పత్రిలో ఉన్న వారికి రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చేరిన వారికి రూ.3 లక్షల పరిహారం అందించడంతో పాటు, స్వల్ప చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన వారందరికీ రూ.25 వేలు ఇచ్చాం. ప్రమాదం జరిగిన కంపెనీ చుట్టూ ఉన్న 5 గ్రామాల్లో 15 వేల మందికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి, వారికి తోడుగా నిలబడ్డాం. బాధితులు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలన్న దానికి ఇవన్నీ ఉదాహరణలు. తేడా గమనించమని కోరుతున్నాను.

చంద్రబాబు. పరనింద:
    అచ్యుతాపురం సెజ్‌ బ్లాస్ట్‌ తర్వాత, ఇక్కడికి వచ్చిన సీఎం చంద్రబాబు, గత మా ప్రభుత్వంపై నిందలు మోపి, సమస్య నుంచి ప్రజల దృషి మళ్లించే ప్రయత్నం చేశారు. మరి అంతకు ముందు 2014–19 మ«ధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదా? జరిగాయి. దుర్ఘటనలు ఎప్పుడైనా, ఎవరి హయాంలో అయినా జరగొచ్చు. కానీ, ఆ ఘటన తర్వాత ప్రభుత్వం ఎలా స్పందించింది అనేది ముఖ్యం. బాధితుల పట్ల సానుభూతి చూపాలి. ఘటనకు బా«ధ్యత తీసుకోవాలి. ఆరోజు, ఆ రెండూ మా ప్రభుత్వం చేసింది.

సెక్యూరిటీ ప్రొటోకాల్‌:
    ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజ్‌ తర్వాత, ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో హైలెవెల్‌ కమిటీ వేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీ, పొల్యూషన్‌ కంట్రోల్‌.. రెండూ క్రోడీకరించి, కంపెనీల్లో సెక్యూరిటీ ప్రొటోకాల్‌పై నివేదిక కోరాం. ఆ కమిటీ నివేదిక మేరకు, కంపెనీల్లో సెక్యూరిటీ ప్రొటోకాల్‌ నిర్ధారిస్తూ.. అదే ఏడాది ఆగస్టులో జీవో జారీ చేశాం. 
    దాని ప్రకారం అన్ని రెగ్యులేషన్స్‌ వేర్వేరు లోకేషన్లలో కాకుండా.. అన్నీ క్రోడీకరించి, ఒకే చోటుకు తీసుకొచ్చాం. ఇంకా దాంట్లో ముఖ్యమైంది.. ప్రతి కంపెనీ కూడా సెల్ఫ్‌ కంఫ్లెయిన్స్‌ రిపోర్ట్‌ ఇవ్వాలి. ఒకవేళ ఆ నైపుణ్యం కంపెనీకి లేకపోతే.. అందుకోసం అక్రిడేటెడ్‌ థర్డ్‌ పార్టీ ఏజెన్సీని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ ఇప్పుడూ అమల్లో ఉంది. దాన్ని ఈ ప్రభుత్వం మానిటర్‌ చేసి ఉంటే, ఇలాంటి ఘటనలకు తావుండేది కాదు.

పాలనపై దృష్టి లేదు: 
    దురదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వానికి పరిపాలనపై దృష్టి లేదు.  ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, సూపర్‌ టెన్‌ పేరుతో ఇచ్చిన హామీల అమలుపైనా చిత్తశుద్ధి లేదు. వారి ధ్యాస అంతా రెడ్‌బుక్‌ పరిపాలనపైనే. ఎక్కడికక్కడ రెడ్‌బుక్‌ తెరవడం.. ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడం కోసం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం. అదే రెండున్నర నెలల నుంచి ఈ ప్రభుత్వ పాలన.
    అవన్నీ కాకుండా, ఈ ప్రభుత్వం పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్రొటోకాల్‌పై దృష్టి పెట్టి ఉంటే, ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావు. ఇలా కార్మికులు బలయ్యే వారు కారు.
    
అదే మీ జగన్‌ ఉండి ఉంటే..
    అదే ఈరోజు మీ జగన్‌ సీఎంగా ఉండి ఉంటే.. స్కూళ్లు బాగుపడి ఉండేవి. ఇంగ్లిషు మీడియం, టోఫెల్‌ తీసి ఉండేవాళ్లు కాదు. నాడు–నేడు కార్యక్రమాలు కొనసాగేవి. గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది. 
    ఇంకా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌  ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదు. దీంతో రోగులకు పథకంలో చికిత్స అందడం లేదు. అయినా పట్టించుకునే నాధుడు లేడు. పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్, గతంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకొకమారు విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ అయ్యేది. ఈరోజు రెండు త్రైమాసికాలు అయిపోయాయి. మూడో త్రైమాసికం కూడా పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటికీ పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఇవ్వలేదు. అవి ఇస్తారో లేదో కూడా తెలియడం లేదు. దీంతో పిల్లలు ఫీజులు కట్టాల్పిందే అని కాలేజీల యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్స్‌ కూడా ఇవ్వబోమని వారు పిల్లల మీద ఒత్తిడి చేస్తున్నారు. అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. 
    వ్యవసాయం ముమ్మరంగా సాగుతోంది. రైతులందరికీ పెట్టుబడి సహాయం కింద రూ.20 వేలు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ పెట్టుబడి సహాయం ఏమైందని రైతులు అడుగుతున్నారు. గతంలో పెట్టుబడి సహాయం కింద కనీసం రూ.13,500 వచ్చేదని వారు గుర్తు చేస్తున్నారు.
    ఇంకా, గతంలో ఉచితంగా పంటల బీమా వచ్చేది. ఖరీఫ్‌ సీజన్‌లో అది రావాలంటే ఏటా ఏప్రిల్, మేలో ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ ప్రీమియం కట్టాలి. మే నెలలో ప్రభుత్వం కడితే కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇస్తుంది. జూన్‌లో ఇన్సూరెన్స్‌ వస్తుంది. ఆ ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారు. ఉచిత పంటల బీమా గాలికిపోయింది. 
    ఈ–క్రాప్‌ పోయింది. రైతులు ఎరువులు, విత్తనాల కోసం క్యూలైన్లో నిల్చోవాల్సిన పరిస్ధితులు మరలా వచ్చాయి. ఇంటి వద్దకే పెన్షన్, రేషన్‌ వచ్చే పరిస్థితి పోయింది. మరలా ప్రతి వ్యవస్ధలో అవినీతి, వివక్ష పెరిగిపోయింది. తెలుగుదేశం నాయకులు చుట్టూ తిరిగితే తప్ప పథకాలు రావన్న మెసేజ్‌ ఇస్తున్నారు.

ఏం జరుగుతోంది?:
    ప్రజలకు ఇవన్నీ అందడం లేదు. కానీ ఈ రెండున్నర నెలలుగా ఏం జరుగుతోంది అని చూస్తే.. యథేచ్ఛగా హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం.. మా పార్టీ వారిపై కక్ష తీర్చుకోవడం. ఇదే జరుగుతోంది.

పునరావృతం కాకుండా చూడండి:
    పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా ఇకనైనా సెక్యూరిటీ ప్రొటోకాల్‌ అమలుపై దృష్టి పెట్టాలి. ఇప్పటికీ అమలులో ఉన్న ఆ ప్రొటోకాల్‌ అన్ని కంపెనీలు పక్కాగా అమలు చేసేలా చూడాలి. ఆ మేరకు ప్రభుత్వం మానిటర్‌ చేయాలి.
    అచ్యుతాపురం సెజ్, ఫార్మా కంపెనీలో బ్లాస్ట్‌పై లోతైన విచారణ చేయాలి. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. కారణాలు గుర్తించి, అన్నింటినీ సరి చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇవన్నీ కచ్చితంగా జరగాలి.

Atchutapuram SEZ Incident: YS Jagan Slams Chandrababu's Govt
 


 

Back to Top