మద్యపాన నిషేధం దిశగా కొత్త మద్యం పాలసీ

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైపు యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు వడివడిగా పడుతున్నాయి. ప్రతి ఊరూ స్వయం సమృద్ధితో ఉండాలన్న గాంధీ ఆశయాలకు ప్రతిరూపంగా యువనేత పథకాలు, ప్రణాళికలు అమలౌతున్నాయి. మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వ చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. 2019 అక్టోబర్ 2న గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా శ్రద్ధా భక్తులతో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంధీ జయంతి ఉత్సవాలు బాపూజీ ఆశయాల సాధిస్తూ, ఆయనకు అసలైన నివాళి అర్పిస్తున్నాయి.

మద్యం మహమ్మారిని కట్టడి చేసిన వైయస్ జగన్

విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చిన మద్యం దుకాణాలే కాదు, రాష్ట్రంలోని ప్రైవేటు దుకాణాలన్నిటినీ రద్దు చేసారు వైయస్ జగన్. మద్యం ఆదాయం ప్రభుత్వానికి అవసరమే కానీ, ప్రజల క్షేమం అంతకంటే ముఖ్యమని ప్రకటించారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపేలా చర్యలు తీసుకున్నారు. 4380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా 20% తగ్గించి 3500 దుకాణాలుగా వాటిని కుదించారు. రాష్ట్రంలోని 44000 బెల్టు షాపులు లేకుండా చేసారు. ఫలితం - గత ఏడాదితో పోలిస్తే ఎక్సైజ్ ఆదాయం 678 కోట్లు తగ్గింది. అంటే అంత మేర మద్యం వినియోగం తగ్గిందన్నమాట.

కొత్త మద్యం పాలసీ

అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. కనుక దుకాణాల వద్ద బార్లు ఉండే అవకాశం లేదు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ మాత్రమే మద్యం విక్రయించడం జరుగుతుంది. దీనిపై స్థానిక పోలీసు అధికారుల నిఘా ఉంటుంది. నిర్ణీత వేళల్లో తప్ప బ్లాక్ లో మద్యం అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. ఏ సైజు అయినా ఒకరికి 3 బాటిళ్లు మాత్రమే  పరిమితి. అంతకు మించి కొనేందుకు అనుమతి లేదు. మద్యం రేట్లు పెంచడం ద్వారా కొనుగోళ్లను మరింత తగ్గిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 3,500 మంది సూపర్ వైజర్లు, 8,033 మంది సేల్స్ మేన్లను నియమించారు. దీనిద్వారా 12000 మందికి పైగా ఉద్యోగావకాశాలు. రాష్ట్రంలో ఇప్పుడున్న 880 బార్లకు కూడా ప్రభుత్వ మద్యం షాపుల సమయాలనే వర్తింప చేస్తున్నారు. సంపూర్ణ మద్యపానం దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయాల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ఆడపడుచులకు మాట ఇచ్చిన వైయస్ జగన్ ఆ మాటను అక్షరాలా నిలబెట్టుకుంటున్నారు. తన మాటనే కాదు గాంధీజీ చెప్పిన బాటను కూడా అనుసరిస్తున్నారు.

Back to Top