జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు ఏపీ ప్రభుత్వం సత్కారం

ఆత్మీయ విందు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

 విజయవాడ: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆయన గౌరవార్థం ప్రభుత్వం ఆత్మీయ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి  గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. విజయవాడ ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమం, జస్టిస్  ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సత్కరించి, మెమెంటో అందజేశారు. కార్య‌క్ర‌మంలో  హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి,హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఇటీవలే సుప్రీం జడ్జిగా పదోన్నతి పొందారు.  జస్టిస్‌ మిశ్రా.. ఆగస్టు 29, 1964న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్‌ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకుని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు.

సివిల్, క్రిమినల్‌ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్‌ బార్‌ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్‌ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెప్టెంబర్‌ 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్‌ జనరల్‌గా కొనసాగారు.  డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా, 2021, జూన్‌ 1 వ తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. తర్వాత ఏపీ హైకోర్టు సీజేగా పని చేసి ఇటీవలే సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 

 

Back to Top