అశ్లీల వీడియోను సృష్టించి తప్పుడు ప్రచారానికి దిగారు 

టీడీపీపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్‌

రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ఇంతగా బరితెగించాలా

గోరంట్ల మాధవ్‌పై ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారు

 పోతిన ప్రసాద్‌ ఎవరో టీడీపీ నేతలు చెప్పాలి

నిత్యం అసత్య ప్రచారం చేయడమే చంద్రబాబు పని

ఫేక్‌ వీడియో సృష్టించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి

తాడేపల్లి: అశ్లీల వీడియోను సృష్టించి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తప్పుడు ప్రచారానికి టీడీపీ దిగిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు. ఫేక్‌ వీడియోను సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీపై బురద చల్లేందుకు చేసిన ప్రయత్నం కాదా అని ప్రశ్నించారు. అశ్లీలాన్ని కూడా తన రాజకీయం కోసం వాడుకునే వ్యక్తి చంద్రబాబు అన్నారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ఇంతగా బరితెగించాలా అని నిలదీశారు. గురువారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. దేవుడు చంద్రబాబుకి సిగ్గుపెట్టడం లేదు.. సిగ్గు శరం ఏమాత్రం లేకుండా రాజకీయాల కోసం దిగజారిపోతున్నారు. అసలు పోతిన ప్రసాద్ ఎవరు? ఆయనకు ఈ వ్యవహారానికి ఏం సంబంధం అని పేర్ని నాని ప్ర‌శ్నించారు. చంద్రబాబే విదేశాల్లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు లెటర్ రాయవచ్చు కదా అన్నారు. పోతిన ప్రసాద్ కి నేనిచ్చిన సర్టిఫికెట్ ఒరిజినల్ కాదని ల్యాబ్ రాసిందన్నారు. ఒక అశ్లీల వీడియో సృష్టించడం ఎందుకు? ఆ వీడియోని ప్రచారం చేయడం ఏంటి? నేనే తయారుచేశానని చంద్రబాబే ప్రకటించవచ్చు కదా అన్నారు.

పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..

బాబు నీచ రాజకీయాలను అంతా ఖండించాలి        
ఆడిన మాటకు విలువనిచ్చే వ్యక్తి వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి అయితే.. ఇచ్చిన మాటను మరుక్షణమే గాలికి వదిలేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇచ్చిన మాటను ఆచరించడం ద్వారా వ్యక్తిత్వాన్ని పెంచుకునే నాయకుడు, ఆదర్శ రాజకీయాలు చేసే వ్యక్తి వైయ‌స్‌ జగన్‌ అయితే రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారడం, రాజకీయంగా లాభం జరుగుతుందంటే, రాజకీయ లబ్ది వస్తుందంటే ఎంత నీచానికి అయినా దిగజారడం చంద్రబాబు నైజం అని మరోసారి రుజువైంది. బాబు నీచ రాజకీయాలను ఖండించాల్సిన, కట్టడి చేయాల్సిన అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరిపైన ఉంది. 

చంద్రబాబు నాయుడు రాజకీయాలను మొదలుపెట్టిన దగ్గర నుంచి అసత్యాలు మాట్లాడటం ఆడిన మాటకు విలువ ఇవ్వకపోవడం, ఇవాళ ఒక ప్రకటన చేస్తే మర్నాడు దానికి భిన్నంగా ప్రవర్తించడం... తన జీవితమే తార్కాణంగా కనిపిస్తుంది. రాజకీయాల కోసం రాజకీయాలను, ప్రభుత్వ, శాసన, న్యాయ వ్యవస్థలను తన అవసరాల కోసం కనిపించిన ప్రతి వ్యవస్థను దిగజార్చి, ఏమార్చి తన రాజకీయ స్వార్థం కోసం అడ్డగోలుగా దశాబ్ధాలుగా వాడుకుంటున్నారు. చంద్రబాబు దిగజారడానికి పాతాళమే హద్దు అనుకున్న ప్రతిసారి ... వ్యవస్థలను మరింతగా కుంగదీస్తూ, తాను దిగజారుతూ పక్కవాళ్లను కూడా చేయిపట్టి లాగే ప్రయత్నం చేయడం ఆయనకు నిత్యకృత్యమైంది.

తన రాజకీయాల కోసం చంద్రబాబు వ్యవస్థలను ఎంతగా  దిగజార్చారంటే... చివరకు అశ్లీలాన్ని, ఫేక్ వీడియోలను కూడా తన రాజకీయాల కోసం వాడుకోవడం చేస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకుడు అంటే విలువలకు అర్థం చెప్పాలి. విలువలకు నిలువుటద్దంగా ఉండాలి. అలాంటిది చంద్రబాబు నాయుడు అసత్య, అశ్లీల చిత్రాలను సృష్టించడం... ఆ సృష్టించిన అశ్లీల చిత్రాలను తన వందిమాగధులకు చెందిన వార్తా చానల్స్‌ ద్వారా  దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అమెరికా సంస్థలను కూడా దిగజారుడు రాజకీయాల కోసం అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వాడుకుంటున్నారు.

నిస్సిగ్గుగా, బరితెగించి అబద్ధాలు చెప్పిస్తారా..?
నాలుగైదు రోజుల క్రితం నిఖార్సు అయిన ఇద్దరు సత్యవంతులను టీడీపీ కార్యాలయంలో కూర్చోబెట్టి.. మాధవ్ వీడియోపై ఇదిగో అమెరికా రిపోర్టు, ఒరిజినల్ రిపోర్టు అంటూ ఇష్టారాజ్యంగా మొరిగిచ్చారు. అదేదో, అమెరికా ప్రభుత్వమో, ఎఫ్‌బీఐనో ఇచ్చినట్లు ఇదిగో సర్టిఫికెట్‌ తెచ్చాం... ఇదిగో గోరంట్ల మాధవ్‌ వీడియో ఒరిజినల్‌. దమ్ముంటే చర్యలు తీసుకోవాలని మాట్లాడారు.  సిగ్గుందా అని  టీడీపీ మహిళా ప్రతినిధి పెద్ద నోరు వేసుకుని ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడింది. ఇంకోకాయన పెద్ద పెద్ద రంకెలు వేస్తూ మిస్టర్‌ చీఫ్‌ మినిస్టర్‌ వినిపిస్తుందా అంటూ  ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. నేను ఆయన గురించి మాట్లాడి దిగజారలేను. నిస్సిగ్గుగా, బరితెగించి తప్పుడు కాగితాలు తీసుకువస్తే ఎవరు నమ్ముతారు. అమాయకంగా ఓ వర్గం మీడియా, మీ తొత్తులుగా ఉన్న ఎల్లో మీడియా ద్వారా సభ్యసమాజంపై అశ్లీల వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారు. పైపెచ్చు తప్పుడు నివేదికను తెచ్చి.. అది అమెరికాకు చెందిన నిఖార్సైంది అంటూ ప్రజలకు తెలియచేస్తున్నామని  మాట్లాడటానికి సిగ్గుండాలి.

అది ట్యాంపర్డ్ రిపోర్ట్ అని అమెరికా సంస్థే చెప్పింది. 
ఎక్లిప్స్ సంస్థకి చెందిన చీఫ్ జిమ్ స్టాఫర్డ్ పేరుతో తిరుగుతున్న నివేదిక తనది కాదని స్టాఫర్డ్ ఈ మెయిల్ ద్వారా సీఐడీ అధికారులకు స్పష్టం చేశారు. ఎక్లిప్స్ ఫోరెన్సిక్‌ డాట్‌ కామ్‌ నుంచి ఒక మెయిల్‌ వచ్చింది. ఏపీ సీఐడీ పోలీస్‌ వ్యవస్థ వారిని సంప్రదింస్తే.. ఆ నివేదికతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అసలు ఆయన ఏం రాశాడు. ఏం మాట్లాడాడు? మీ బతుకులు ఏమయ్యాయి ఇవాళ? అసత్యాలతో ఒకపూట ఏమార్చగలరేమో. నిజం నిలకడ మీద తేలుతుందనే విషయం చంద్రబాబుకు ఆయన పార్టీ వాళ్లకు తెలియకపోవడం బాధాకరం. రాజకీయాల కోసం ఇంత నిస్సిగ్గుగా బరితెగించి బజారుకు ఎక్కాల్సిన అవసరం ఉందా? 

టీడీపీకి చెందిన నిఖార్సైన ఒకావిడ మాట్లాడుతూ.. ఈ సర్టిఫికెట్‌ కూడా కమ్మోళ్లు ఇచ్చారా అంటూ ఎకసెక్కాలు ఆడింది. మరి, ఈ సర్టిఫికెట్‌ ఇచ్చింది కమ్మోళ్లే కదా. పోతిన ప్రసాద్‌ కమ్మోడే కదా? పోతిన ప్రసాద్‌ ఎవరు?, ఆయన ఎవరికి సోదరుడు, ఆయనకు ఏంపని?. మీకంత దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడే ఎక్లిప్స్ సంస్థకి లేఖ రాయవచ్చు కదా? పార్టీ అధ్యక్షుడిగా అఫీషియల్‌గా ఆ పనిచేయవచ్చుగా. తెలుగు దొంగలతో ఈ పనులు చేయించడం ఎందుకు?

‘పోతిన ప్రసాద్‌ అనే వ్యక్తి సో అండ్‌ సో ఐడీతో తనకు ఒక వీడియో పంపించాడని, వీడియోలో ఉన్నది మరో ఫోన్‌కాల్‌తో రికార్డు చేసిన వీడియో. రికార్డు చేసిన వీడియో ఒరిజినల్‌లా?కాదా అని అడిగితే ఒరిజినల్‌ అనే చెప్పాను. పోతిన ప్రసాద్‌ అనే వ్యక్తి పదజాలం మార్చి, ఆ రిపోర్టును మార్చి ఇవ్వాలని అడిగాడు. నేను ఆలోచించుకునేలోపే బయటకు వైరల్‌ చేశారు. నేను ఇచ్చినట్టు ప్రచారం అవుతున్న సర్టిఫికెట్‌ ఒరిజినల్‌ కాదు. అది ఎడిట్‌ చేసిన దొంగ సర్టిఫికెట్‌ అని’ ప్రొఫెసర్‌ జిమ్ స్టాఫర్డ్ స్పష్టంగా మెయిల్‌ చేశారు. దీనిమీద టీడీపీ స్పందన ఏంటి? 

బాబుకు దేవుడు సిగ్గు పెట్టలేదు 
చంద్రబాబు నాయుడుకు దేవుడు సిగ్గు పెట్టలేదు అనుకుంటా. సాధారణంగా వ్యక్తులకు కొన్ని లక్షణాలు పెడతాడు. అయితే దేవుడు బాబుకు సిగ్గు పెట్టడం మర్చిపోయినట్లు ఉన్నాడు. సిగ్గు,శరం ఏమాత్రం లేకుండా రాజకీయాల కోసం ఏదిబడితే అది మాట్లాడించడం, ఏది పడితే అది ప్రచారం చేయడం అలవాటు అయిపోయింది. చంద్రబాబుకు సిగ్గు ఉంటే ఇన్ని తప్పుడు పనులు చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరీ పోతిన ప్రసాద్‌? దీనిపై సమాధానం చెప్పండి?.

చంద్రబాబుకు ఇంత అవసరం ఏంటి? వెనుకబడిన వర్గానికి చెందిన ఒక ఎంపీ పేరు మీద ఒక అశ్లీల వీడియోను సృష్టించడం, దాన్ని ప్రచారం చేయాలనే ఉబలాటం ఎందుకు? చివరకు, ఆ వీడియోను మీ కుటుంబ సభ్యులు కూడా చూసి.. ఈ వీడియో ఏంటని ఒకరిని ఒకరు అడుక్కోవడం ఏంటి? ఆ వీడియో నేనే తయారు చేశాను, ఎవరూ చూడొద్దని చంద్రబాబే చెప్పొచ్చు కదా?. తాను తయారు చేసిన దాన్ని ప్రచారం చేసి, దొంగ సర్టిఫికెట్లు సృష్టించడం. ఎంపీ మాధవ్‌ అంగాంగాల గురించి సమాజానికి ఏంటి సంబంధం. ఇన్నిసార్లు ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన పై మీకెందుకంత కక్ష.

ఇది చంద్రబాబు చేసిన నేరం కాదా..?
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, లోకేష్‌, పట్టాభి, అనిత... వీరంతా కుట్రపూరితంగా అమెరికా సంస్థను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేయాలని,  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద బురద చల్లాలనుకోవడం వాస్తవం అవునా? కాదా?. రిపోర్టును పోతిన ప్రసాద్‌ ట్యాంపర్‌ చేశారని జిమ్ స్టాఫర్డ్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. నివేదికను  ట్యాంపర్‌ చేయించడం చంద్రబాబు చేసిన నేరం కాదా?. ఈ నేరాలకు చంద్రబాబు ముఠా నాయకుడిగా వ్యవహరించారు. 

ఒరిజినల్‌ వీడియో లేనప్పుడు ఎన్ని జిమ్మిక్కులు చేసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని, ఎంపీ మాధవ్‌ను బద్నాం చేయాలనుకుంటే మీ కుట్రలు ఫలిస్తాయని అమాయకంగా ఎలా ఊహించుకుంటున్నారు. వీడియో మొత్తం కూడా చంద్రబాబు, లోకేష్‌ సృష్టించింది అవునా కాదా?. ఆ ఫేక్ వీడియోను తమ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది తెలుగుదేశం పార్టీ అవునా? కాదా?. వీడియోను తయారు చేసినందుకు టీడీపీని, పోస్ట్‌ చేయించినందుకు చంద్రబాబు నాయుడును,లోకేష్ ను, నిజ నిర్థారణ చేయకుండా అశ్లీల వీడియోను సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేసిందుకు, పదేపదే ఈ అశ్లీలాన్నితెలుగు ప్రజలు చూడలేక చచ్చేంతవరకూ ప్రసారం చేసిన టీడీపీ అనుకూల టీవీ చానళ్లను, ఆ చానళ్ల యాజమాన్యాలను, దొంగ వీడియాలు చూపించి ఫేక్‌ రిపోర్టులు చూపిస్తూ ప్రెస్‌మీట్‌ పెట్టిన టీడీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరుతుంది.

అలాగే ఆ రిపోర్టు తాము ఇవ్వలేదని, అది అబద్ధమని అమెరికా సంస్థనే చెబుతున్నప్పుడు టీడీపీ, ఎల్లో మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం. సభ్య సమాజం సిగ్గుపడేలాగా, సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం, సాటి వ్యక్తులకు నష్టం అని భావిస్తూ.. వీరందరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ చేసిన ఈ తప్పుడు చర్యలు మీద, ఈ దుర్మార్గపు ప్రచారాల మీద రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్‌ సీపీ ఫిర్యాదులు చేస్తుంది.

దిగజారి నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు దుర్మార్గపు చర్యలను సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు హేయమైన, నీచ ప్రవర్తనను అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top