పేదవాడికి వైద్యం మరింత చేరువ చేయడమే లక్ష్యం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం

దేశ చరిత్రలోనే ఇది చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది

వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా మార్పులు తెచ్చాం

రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

ప్రతి ఇంటికి కార్డులు పంపిణీ చేస్తూ ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన కల్పించాలి

వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన వీడియో మెసేజ్‌ని పంపించి వివరించాలి

3,257 ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ నడిపిస్తున్నాం

ఆరోగ్యశ్రీ సేవలు 2,513 ఆస్పత్రులకు విస్తరించాం

ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద ఇప్పటివరకు ఖర్చు చేసింది రూ.14,439 కోట్లు

గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.5,171 కోట్లు మాత్రమే

గతంలో ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ సేవలు అందుకున్నవారి సంఖ్య 22.32 లక్షలు మాత్రమే

మనందరి ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో ఆ సంఖ్య 53 లక్షల మందికి చేరింది  

ఆరోగ్య ఆసరా ద్వారా దాదాపు 25,27,870 మందికి రూ.1309 కోట్లు అందించాం 

క్యాన్సర్‌ వ్యాధి చికిత్సకు మాత్రమే ఏకంగా రూ.1900 కోట్లు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడ్డాం

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 53,126 మంది (డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌)ని రిక్రూట్‌ చేశాం

క్యాన్స‌ల్ లాంటి వ్యాధికి ప‌రిమితి లేకుండా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం

అక్కచెల్లెమ్మల ఫోన్లలో ఆరోగ్యశ్రీ, దిశ యాప్‌ కచ్చితంగా ఉండాలి

జనవరి 1వ తేదీ నుంచి ఆరోగ్య సురక్ష ఫేజ్‌–2ను ప్రారంభిస్తున్నాం

తాడేపల్లి: ‘‘డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీని ప్రతి పేదవాడికి మరింత చేరువ చేస్తూ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదనే తాపత్రయంతో గతంలో ఎప్పుడూ, ఎవరూ చూడనంతగా మార్పులు తీసుకువచ్చాం. ఉచిత వైద్యం పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం.. దేశ చరిత్రలోనే మనందరి ప్రభుత్వ నిర్ణయం ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డుల పంపిణీ జరుగుతుందని, కార్డుల పంపిణీతో పాటు ఆరోగ్యశ్రీ ఉచిత సేవలను ఎలా వినియోగించుకోవాలనే సందేహాలను ప్రజాప్రతినిధులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. ప్రతి ఇంట్లో ఆరోగ్యశ్రీ యాప్‌తో పాటు దిశ యాప్‌ కూడా ఇన్‌స్టాల్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డుల పంపిణీ, అవగాహన కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెల్త్‌ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 

సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి ప్రసంగం..
వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ దేశ చరిత్రలోనే ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది. వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం, దానిపై పూర్తి అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఇంట్లోనూ అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి.. ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి. ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి.. ఎవరిని అడగాలి.. ఇలాంటి ప్రతి సందేహాన్ని ప్రజల మనసులోంచి తొలగిస్తూ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తూ.. అవగాహన కల్పించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 

ఆరోగ్యశ్రీలో చాలా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరధిని ప్రతి ఒక్కరికీ విస్తరించాలనే తపనతో అడుగులు పడ్డాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారే కాకుండా నెలకు రూ.40 వేల ఆదాయం వస్తున్న కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. దీని వల్ల అక్షరాల 1.48 కోట్ల కుటుంబాలు (4.25 కోట్ల జనాభా) వీరందరూ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు. వీరందరికీ మంచి జరిగించాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. 

మనం అధికారంలోకి రాకముందు కేవలం 1,059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేది. మనం అధికారంలోకి వచ్చిన తరువాత చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు ఆ పేదవాడు ఇబ్బందిపడే పరిస్థితి రాకూడదు.. అటువంటివన్నీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి.. ఏ పేదవాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి ఉండకూడదనే తపన, తాపత్రయంతో ప్రతి అడుగు వేస్తూ ప్రొసీజర్స్‌ను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం.. తరువాత 3,257 ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ నడిపిస్తున్నాం. 

మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేవలం 748 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు 2,513 ఆస్పత్రులకు విస్తరించడం జరిగింది. మన రాష్ట్రంలోనే 2,309 ఆస్పత్రులు, హైదరాబాద్‌లోని 85 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఎంప్యానల్‌ చేశాం. బెంగళూరులో 35 ఆస్పత్రులు, చెన్నైలో 16 ఆస్పత్రులు.. మొత్తంగా 204 ఇతర రాష్ట్రాల్లోని నగరాలను ఎంప్యానల్‌ చేసి, గతంలో మాదిరిగా కాకుండా 716 ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాల్లోని సూపర్‌ స్పెషాలిటీ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. గతంలో కేవలం 748 ఆస్పత్రులకు మాత్రమే, కేవలం హైదరాబాద్‌లో 72 ఆస్పత్రుల్లో మాత్రమే  పరిమితమై ఉండేది. రెండు కలిపినా కూడా కేవలం 820 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని నేడు.. ఏకంగా 2,513 ఆస్పత్రులకు విస్తరింపజేశాం. 

ఒకవైపున చికిత్సల సంఖ్యను పెంచడం, మరోవైపున ఆదాయపు పరిమితిని సైతం పెంచి ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమం చేయడం, 25 లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చాం. 

మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో వేసిన అడుగులు.. 

  • గతంలో 2014 నుంచి 2019 వరకు అప్పటి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీకి ఖర్చు చేసింది రూ.5,171 కోట్లు. అంటే సంవత్సరానికి రూ.1,034 కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి. 
  • ఈరోజు అక్షరాల ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద ఖర్చు చేస్తున్న మొత్తం సంవత్సరానికి రూ.4,100 కోట్లు. 
  • అప్పట్లో ఆరోగ్యశ్రీ, 104, 108 ఇటువంటి సేవలన్నింటికీ కలిసి కూడా ఐదు సంవత్సరాల్లో కేవలం రూ.5,900 కోట్లు మాత్రమే అయితే..
  • మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరోగ్యశ్రీ సేవలను మెరుగు పరుస్తూ ఇప్పటికే రూ.14,439 కోట్లు ఖర్చు చేశాం. ఇది సంవత్సరానికి రూ.4,400 కోట్లు. వైద్యం కోసం పేదవాడు ఇబ్బందిపాలు కాకూడదు, అప్పులపాలు కాకూడదనే తపన, తాపత్రయంతో చేశాం. 
  • గతంలో ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు తక్కువే. గతంలో ఐదు సంవత్సరాలు కలిపి ఆరోగ్యశ్రీ సేవలు అందుకున్నవారి సంఖ్య 22.32 లక్షల మంది మాత్రమే. 
  • మనందరి ప్రభుత్వంలో నాలుగున్నరేళ్ల కాలంలో ఆరోగ్యశ్రీ సేవలు 53 లక్షల మందికి అందుబాటులోకి వచ్చాయి. 

ఆరోగ్య ఆసరా గమనిస్తే.. 
ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి వైద్యం చేయించడమే కాకుండా వైద్యం అయిపోయిన తరువాత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తే.. రెస్ట్‌ తీసుకునే సమయంలో ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రెస్ట్‌ పిరియడ్‌లో నెలకు రూ.5 వేల చొప్పున ఆ పేదవాడి చేతుల్లో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం ఆరోగ్య ఆసరా ద్వారా జరుగుతుంది. ఆరోగ్య ఆసరా ద్వారా దాదాపు 25,27,870 మందికి రూ.1309 కోట్లు అందించడం జరిగింది. 

గతంలో ఎవరికైనా క్యాన్సర్‌ లాంటి భయానక వ్యాధి వస్తే రూ.5 లక్షలు మాత్రమే పరిమితి ఉండేది. కీమోథెరపి లాంటిది స్టార్ట్‌ చేసినా రెండు, మూడు డోసులకే రూ.5 లక్షల పరిమితి అయిపోయింది.. ఒక వైద్యం చేయలేము, ఆరోగ్యశ్రీ పరిమితి అయిపోయిందని వెనక్కు పంపించే పరిస్థితి ఉండేది. మళ్లీ ఆరు నెలల తరువాత ఆ పెషంట్‌కు క్యాన్సర్‌ రీల్యాప్స్‌ అయ్యి రావడం, వైద్యం అందక పేదవాడు చనిపోవడం జరిగేది. 

ఇలాంటి పరిస్థితులను పూర్తిగా మారుస్తూ.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్యాన్సర్‌కు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు.. పూర్తిగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్స్, రెండు చెవులకు కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ చేయడానికి రూ.12 లక్షలు అవుతుందంటే అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. బోన్‌ మ్యార్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్, స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వ్యయం రూ.11 లక్షలు వంటివి ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చాం. గుండె మార్పిడి చికిత్స రూ.11 లక్షలుపైనే, ఇలా ప్రాణాంతకరమైన వ్యాధులు దాదాపుగా 1,82,732 మందికి ఆరోగ్యశ్రీలో పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లు సైతం ఉచితంగా అందిస్తూ తోడుగా నిలబడ్డాం. ఒక్క క్యాన్సర్‌ వ్యాధి చికిత్సకు మాత్రమే ఏకంగా రూ.1900 కోట్లు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడ్డాం. 

గతంలో గమనిస్తే 104, 108 వాహనాలు ఎక్కడున్నాయో, వస్తాయో, రావో తెలియదు. ఫోన్‌ చేసినా లాభం ఏమీ ఉండదు అనే పరిస్థితి ఉండేది. గతంలో 108 కేవలం 336 వాహనాలు మాత్రమే ఉండేవి. మండలానికి ఒక్క వాహనం కూడా లేదు. 104 కేవలం 292 వాహనాలు మాత్రమే. అవి కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి. ఈరోజు ఏకంగా 108 వాహనాలు 768, 104 వాహనాలు 936 వాహనాలు. రెండూ కలిపితే 1704 వాహనాలు ఈరోజు తిరుగుతున్నాయి. దీనికి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ మరో 500 వాహనాలు కలుపుకుంటే ఏకంగా 2204 వాహనాలు కేవలం పేదవాడి కోసం, వారికి ఎక్కడ, ఏ అవసరం వచ్చినా వారికి అండగా నిలబడేందుకు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. 

ఎప్పుడూ కూడా చూడని విధంగా మార్పులు జరుగుతున్నాయి. అధికారంలోకి రాకముందు గవర్నమెంట్‌ రంగంలో ఉన్న మెడికల్‌ కాలేజీలు కేవలం 11 ఉంటే.. ఈరోజు ఏకంగా మరో 17 మెడికల్‌ కాలేజీలు రాష్ట్రంలో నిర్మించబడుతున్నాయి. ఏకంగా 28 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లాగా చేశాం.. ఆ ప్రతి జిల్లా పరిధిలోనూ ఒక మెడికల్‌ కాలేజీ తీసుకువస్తున్నాం. మెడికల్‌ కాలేజీ వల్ల లాభం ఏంటంటే.. అదొక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి.. అక్కడే పీజీ స్టూడెంట్స్‌ వస్తారు.. అక్కడే ప్రొఫెసర్లు ఉంటారు.. అక్కడే మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి.. అదొక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కింద పేదవాడికి చేయగలిగే గొప్ప వ్యవస్థ. అటువంటివన్నీ మనం అధికారంలోకి వచ్చిన తరువాతే అడుగులు పడ్డాయి. 

గతంలో గవర్నమెంట్‌ రంగంలోని ఆస్పత్రులకు వెళ్తే.. డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు.. అలాంటి ఆస్పత్రులకు వెళ్లినా వేస్ట్‌ అనే పరిస్థితిని పూర్తిగా మార్చాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 53126 మంది (డాక్టర్లు, నర్సులు)ని రిక్రూట్‌ చేశాం. ప్రతి గవర్నమెంట్‌ ఆస్పత్రిలోనూ ఎంతమంది డాక్టర్లు ఉండాలో అంతమంది అందుబాటులో ఉండేలా అడుగులు వేశాం. 

స్పెషలిస్ట్‌ డాక్టర్లు జాతీయ స్థాయిలో 61 శాతం కొరత, మిగిలిన రాష్టాల్లో జాతీయ సగటు చూస్తే గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ డాక్టర్లు 61 కొరత ఉంది. మన రాష్ట్రంలో స్పెషలిస్ట్‌ డాక్టర్ల కొరత మాత్రం కేవలం 3.96 శాతం. ఎక్కడ ఖాళీలు ఉన్నా.. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు భర్తీ చేయండి అని రిపీటెడ్‌గా రిక్రూట్‌ చేస్తున్నాం. జాతీయ సగటున చూస్తే 27 శాతం నర్సుల కొరత ఉంది. మన రాష్ట్రంలో నర్సుల కొరత సున్నా.. 100 శాతం రిక్రూట్‌ చేశాం. జాతీయ సగటున ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ కొరత 33 శాతంగా ఉంటే.. మన రాష్ట్రంలో సున్నా.. 100 శాతం రిక్రూట్‌ చేశాం. గతంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే.. మందులే ఉండని పరిస్థితి. అవి కూడా నాసిరకంగా ఉండేది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మందులు వాడితే జబ్బులు నయం అవుతాయనే నమ్మకం ఏ ఒక్కరికీ ఉండని పరిస్థితి. ఈరోజు అలాంటి పరిస్థితులను మారుస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చే ప్రతి మెడిసిన్‌ డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ స్టాండెడ్స్‌ మెడిసిన్‌ అందిస్తున్నాం. గతంలో 292 రకాల మందులు పేరుకు మాత్రమే గానీ, స్టాక్‌ ఉండేవి కాదు.. కానీ ఈరోజు 562 రకాల మందులు గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ చూడని విధంగా ప్రివింటేవ్‌ కేర్‌ విప్లవాత్మక మార్పు కింద తీసుకువచ్చాం. వ్యాధి రాకముందే దాన్ని గుర్తించి.. ప్రాథమిక దశలోనే వైద్యం అందించగలిగితే పేదవాడి ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి ఉండదనే దిశగా ఆలోచన చేసి అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనది. ఏకంగా 10,032 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను ప్రతి గ్రామంలోనూ సచివాలయం పక్కనే అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రతి హెల్త్‌ క్లినిక్‌లోనూ సీహెచ్‌ఓ, ఏఎన్‌ఎం, ముగ్గురు నుంచి నలుగురు ఆశావర్కర్లు, 24 గంటలు సీహెచ్‌ఓలు విలేజ్‌ క్లినిక్స్‌లో అందుబాటులో ఉండేలా అక్కడే ఇళ్లు ఏర్పాటు చేశాం. 

విలేజ్‌ క్లినిక్స్‌లో 105 రకాల మందులు పంపిణీ జరుగుతుంది. 14 రకాల డయాగ్నస్టిక్‌ టెస్టులు కూడా అక్కడే చేస్తున్నారు. ఎప్పుడూ చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టును తీసుకువచ్చాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, రెండు 104 వాహనాలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు (మండలానికి నలుగురు డాక్టర్లు), ఇద్దరు డాక్టర్లు పీహెచ్‌సీల్లో పనిచేస్తుంటే.. మరో ఇద్దరు 104 వాహనాల్లో వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్లి వైద్యం చేసే కార్యక్రమం.. విలేజ్‌ క్లినిక్స్‌తో వారు అనుసంధానమై ఏకంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టు కింద ప్రతి గ్రామానికి నెలకు రెండు సార్లు కచ్చితంగా వెళ్లేలా చేశాం. 

వైద్యరంగంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు విలేజ్‌ క్లినిక్స్‌ దగ్గర్నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రులు అన్నింటిలో కూడా రావాల్సిన చోట కొత్తగా నిర్మించడం, పాతవాటిని బాగుపరిచే కార్యక్రమం, మౌలిక సదుపాయాల్లో జాతీయ ప్రమాణాలు పాటిస్తూ పెంచడం ఇవన్నీ జరుగుతున్నాయి. 

ఇటువంటి గొప్ప మార్పులు పడుతున్న సందర్భంలో పేదవాడు వైద్యం కోసం అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకుండా చూడగలిగే గొప్ప వ్యవస్థను తీసుకురావాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి రూ.25 లక్షల పరిమితిని పెంచాం. ఆ పెంచిన విషయాన్ని, సేవలు అందుబాటులో ఉన్నాయని, వైద్యం కోసం అప్పులపాలు కాకూడదు, ఉచితంగా సేవలు ఎలా పొందాలో తెలిపే విషయాన్ని ప్రతి ఇంట్లోని వారికి వివరంగా చెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 

ఇందుకోసం రేపట్నుంచి నియోజకవర్గంలో ఐదు గ్రామాలను ఎంపిక చేసుకొని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో ప్రారంభిస్తారు. ఒకసారి ప్రారంభమైన తరువాత ప్రతి గడపకూ కొత్త ఆరోగ్యశ్రీ కార్డును తీసుకెళ్లి.. కార్డు వారికి అందించి, ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలమే వివరాలు చెప్పడం, ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్‌లో అయినా ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించడం, ఆరోగ్యశ్రీ యాప్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించడం కోసం ఈ కార్యక్రమం మొదలవుతుంది. 

దీని తర్వాత ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాలు చొప్పున ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అవగాహన కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు రెండు టీమ్‌లుగా విడిపోయి.. ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి.. ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్‌ చేయించి ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలం, ఎలా ఉపయోగపడతాయి.. అప్పులపాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకురాగలుగుతామనే విషయాన్ని సుదీర్ఘంగా వివరిస్తారు. మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిశ యాప్‌ కూడా ప్రతి ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేయిస్తారు. ఈ రెండు యాప్‌లు కచ్చితంగా ప్రతి ఫోన్‌లో ఉండాలి. అక్కచెల్లెమ్మల ఫోన్‌లో కచ్చితంగా యాప్‌లు ఉండేలా చర్యలు తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉచితంగా పొందాలనే వ్యక్తి, కుటుంబం ఎక్కడా ఉండకూడదు. 

మనం పంపిణీ చేస్తున్న ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల్లో మరో కొత్తదనం ఉంది. ఆరోగ్యశ్రీ కార్డులు స్మార్ట్‌ కార్డులు. వాటిలో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. దీని వల్ల పేషంట్‌కు సంబంధించిన హెల్త్‌ రికార్డు అంతా ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లో సర్వర్‌లో నిక్షిప్తమై ఉంటుంది. పేషంట్‌ ఎక్కడకు వెళ్లినా రిపోర్టులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని వివరాలు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది కూడా గొప్ప మార్పు. 

ఆరోగ్యశ్రీ సురక్ష కార్యక్రమంలో ఎవరినైతే హ్యాండ్‌ హŸల్డింగ్‌ చేయాల్సిన అవసరం ఉందో.. ఆ పేషంట్లకు సంబంధించిన వివరాలను కూడా మన డేటాబేస్‌లోకి తీసుకువచ్చి హ్యాండ్‌ హŸల్డింగ్‌ సరిగ్గా జరుగుతుందా లేదా అని ధ్యాస పెట్టాలి. ఆ పేషంట్‌కు ఏయే మందులు కావాలి.. ఆ మందులు అయిపోయాయా.. ఎన్నిరోజులు వస్తాయి.. అయిపోతే ఉచితంగా డోర్‌ డెలివరీ చేయించడం జనవరి 1వ తేదీ నుంచి జరుగుతుంది. దీనికి సంబంధించి పోస్టల్‌ డిపార్టుమెంట్‌తో ప్రభుత్వ అవగాహన ఒప్పందం చేసుకుంది. విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి ఇండెంట్‌ పంపిస్తే.. సెంట్రలైజ్డ్‌ డ్రగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ స్టేట్‌ గవర్నమెంట్‌ నుంచి పోస్టల్‌ డిపార్టుమెంట్‌ ద్వారా చేరుతాయి. విలేజ్‌ క్లినిక్‌లో ఉన్న సీహెచ్‌ఓ, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రతి ఇంటికి వెళ్లి పేషంట్లను విచారించి మందులు ఇస్తారు. డాక్టర్లు టెస్ట్‌ చేసిన తరువాతే మందులు ఇవ్వాలనే దాన్ని కూడా వారు పర్యవేక్షిస్తారు.. విలేజ్‌ క్లినిక్స్‌లోని సిబ్బంది దగ్గరుండి చూసుకుంటారు. ఆ ప్రయాణ ఖర్చు కూడా రూ.300 ఆస్పత్రి ఇస్తుంది. ఇచ్చి మరీ డాక్టర్లు టెస్టులు చేసి మందులు కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో అంతర్భాగం అవుతాయి. 

జనవరి 1వ తేదీ నుంచి ఆరోగ్య సురక్ష ఫేస్‌–2 మొదలవుతుంది. ప్రతి గ్రామంలోనూ ఆరు నెలలకు ఒకసారి మెగా హెల్త్‌ క్యాంప్‌ రిపీట్‌ అవుతుంది. ఆరోగ్య సురక్ష ఫేజ్‌–2 కింద ప్రతి మండలంలోనూ, ప్రతి వారం ఒక గ్రామంలో హెల్త్‌ క్యాంపు జరుగుతుంది. ప్రతి వారం ఒక మండలంలో మంగళవారం, మరో మండలంలో శుక్రవారం జరుగుతుంది. వార్డుల పరిధిలో ప్రతి బుధవారం క్యాంపు జరుగుతుంది. 

ఫేస్‌–1 ద్వారా 50 రోజులు కార్యక్రమం నిర్వహించాం. దీని వల్ల దాదాపుగా 60,27,843 మంది హెల్త్‌ క్యాంపులకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్య సురక్ష వల్ల ప్రతి ఇంటికి వెళ్లి 6,45,06,018 వైద్య పరీక్షలు చేయడం జరిగింది. ప్రివెంటీవ్‌కేర్‌లో కొత్తగా 2.40 లక్షల మందికి బీసీ లక్షణాలు కల్పించాయి. రీకన్ఫర్‌మేటరీ టెస్టులు కూడా చేసి 56,648 మందికి మందులు కూడా ఇవ్వడం జరిగింది. 1,48,904 మందికి  డయాబెటిస్‌ ఉన్నట్లు ధ్రువీకరణ జరిగింది. ఇందులో రీకన్ఫర్‌మేటరీ టెస్టులు కూడా అయిపోయి.. 39,684 మందికి మందులు కూడా స్టార్ట్‌ చేశాం. ఆరోగ్య సురక్ష చాలా ప్రాముఖ్యత కలిగినదని అందరూ గుర్తుపెట్టుకోవాలి. 

ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనే వారి ఫోన్‌లకు 6 నిమిషాల వీడియో కూడా పంపించడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కార్డుదారులందరికీ పూర్తి అవగాహన కల్పించే వీడియో మెసేజ్‌ను చూపించాలి. వీడియో మెసేజ్‌ ద్వారా అన్ని విషయాలు తెలుస్తాయి.. వారికి ఆ వీడియో మెసేజ్‌ పంపిస్తే ఎప్పుడైనా వినాలనుకున్నప్పుడు వింటారు.. వారికి మంచి జరుగుతుంది. 

తాజా వీడియోలు

Back to Top