సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ

2021 గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌ వెల్లడి 

మానవ వనరుల అభివృద్ధిలో మెరుగు 

నైపుణ్యాల కల్పన, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ ముందంజ 

భద్రతపరంగా దోషులకు సత్వర శిక్షలు 

ప్రజారోగ్యం దిశగా మెరుగైన మౌలిక వసతులు 

సంక్షేమం, అభివృద్ధిలోనూ గణనీయ ప్రగతి

ఆర్థిక స్వావలంబనలో పురోగమించిన మహిళ

 అమరావతి: ప్రధాన రంగాలన్నింటిలో మన రాష్ట్రం గతంలో కంటే మెరుగైన పురోగతి సాధించింది. ఆర్థిక ఇబ్బందులు, కరోనా కష్టాలు ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ అధిగమించి సర్వతోముఖాభివృద్ధి దిశగా వేగంగా అడుగులు ముందుకు వేసింది. కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌–2021 ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌ నివేదికలో రాష్ట్రాన్ని ‘ఏ’ గ్రూపులో చేర్చారు. ఈ నివేదికలో 2019–20, 2020–21 సంవత్సరాలకు సంబంధించిన గణాంకాలను బేరీజు వేశారు.

మానవాభివృద్ధి సూచికల్లో రాష్ట్రం గతంలో కన్నా ఎక్కువ పాయింట్లు సాధించింది. విద్యారంగం పరంగా.. నాణ్యమైన విద్య, లింగ సమానత్వ సూచిక, ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ (ఎస్సీ, ఎస్టీల చేరికలు), రిటెన్షన్‌ రేట్‌ ఎట్‌ ఎలిమెంటరీ లెవెల్‌ (ప్రాథమిక విద్య స్థాయిలో డ్రాపవుట్లు అరికట్టడం), స్కిల్‌ ట్రెయినింగ్‌ (నైపుణ్య శిక్షణ), ప్లేస్‌మెంట్‌ రేషియో (ఉద్యోగ, ఉపాధి కల్పన) అంశాలలో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. నాణ్యమైన విద్య పరంగా 2019లో గరిష్ట స్కోరు 39 శాతం ఉండగా 2021లో 63 శాతానికి పెరిగింది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..

మెరుగైన భద్రత 
♦ప్రజల భద్రతకు భరోసానిస్తూ మెరుగైన పోలీసు వ్యవస్థతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మెరుగైన పనితీరు కనబరుస్తోంది. 2019–20లో 26.10 శాతం నేరాల్లో దోషులను గుర్తించి శిక్షలు విధించగా, 2020–21లో అది 38.40 శాతానికి పెరిగింది.

♦2019–20లో పోలీసు శాఖలో మహిళా పోలీసులు 4.17 శాతం ఉండగా.. 2020–21లో 5.85 శాతానికి పెరిగారు.

♦పీహెచ్‌సీల్లో వైద్యుల అందుబాటు 2019–20తో పోలిస్తే 2020–21లో 6.4 శాతం వృద్ధి చెందింది. 1,145 పీహెచ్‌సీలలో ఇద్దరు వైద్యుల విధానం, 650 మంది మెడికల్‌ ఆఫీసర్‌ల నియామకం, సుమారు 3 వేల మంది సిబ్బంది నియామకం, ఏపీవీవీపీ, డీఎంఈ పరిధిలో 11 వేలకు పైగా పోస్టుల భర్తీ, మరో 4,142 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండటం, కొత్తగా 3,483 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఇందుకు దోహదపడింది.

♦మాతృ మరణాలు 74 నుంచి 65కు, శిశు మరణాలు 32 నుంచి 29కి తగ్గాయి.

♦ప్రజల ఆరోగ్యం, విద్య, ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, ఆహారం, నివాసం తదితర విషయాల్లో ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఈ విషయంలో 0.546 స్కోర్‌తో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పౌరులు ప్రత్యక్ష లబ్ధిదారులుగా నిలవడం అభివృద్ధి నమూనాకు కీలకం.

♦2019–20లో 42.05 శాతంగా ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబన 2020–21లో 58.2 శాతానికి పెరిగింది. ఆడబిడ్డల జననాల పెరుగుదల ఆశాజనకంగా ఉంది. 2019–20లో 26.96 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు 2020–21లో 12.62 శాతానికి తగ్గాయి.    

 అదుపులోనే అప్పులు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే..
దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే అప్పులు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఊదరగొడుతున్న ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తేటతెల్లమైంది. కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయాయి. మరో పక్క కోవిడ్‌ నియంత్రణ, నివారణ వ్యయం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అదనపు అప్పులకు అనుమతిచ్చింది. అయినప్పటికీ గత ఆర్థిక ఏడాది అంటే 2020–21లో ఆంధ్రప్రదేశ్‌ మిగతా రాష్ట్రాల కన్నా పరిమితికి లోబడే అప్పులు చేసింది. ఈ విషయం కంప్ట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ప్రాథమిక అకౌంట్ల పరిశీలనలో వెల్లడైంది. తమిళనాడు గత ఆర్థిక ఏడాది బడ్జెట్‌ అంచనాలకు మించి ఏకంగా 55.54 శాతం మేర అప్పు చేసింది. బిహార్‌ 47.69 శాతం, కర్ణాటక 40.12 శాతం, తెలంగాణ 37.50 శాతం, పంజాబ్‌ 24.22 శాతం బడ్జెట్‌ అంచనాకు మించి అప్పు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ అంచనాకు మించి కేవలం 14.23 శాతమే అప్పు చేసింది.  

ఆదాయం తగ్గినప్పటికీ.. 
ఏపీ ప్రభుత్వం కోవిడ్‌ సంక్షోభంలోనూ సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిలుపుదల చేయకుండా కొనసాగించింది. కోవిడ్‌ సంక్షోభం, లాక్‌డౌన్ల నేపథ్యంలో 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో ఏకంగా రూ.14 వేల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. మరో వైపు కోవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలకు ఏకంగా రూ.8 వేల కోట్లు వ్యయం చేసింది. మొత్తం మీద రూ.30 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతించిన మేరకు పరిమితికి లోబడే అప్పులు చేసింది. అయినప్పటికీ ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2020–21 ఆర్థిక ఏడాదిలో కాగ్‌ ప్రాథమిక అకౌంట్ల మేరకు వివిధ రాష్ట్రాల బడ్జెట్‌ అంచనాలు, వాస్తవంగా చేసిన అప్పుల వివరాలు ఇలా    ఉన్నాయి.

మిగతా రాష్ట్రాల కంటే తక్కువే 
విభజన సమయం నుంచి ఏపీకి తప్పనిసరి రెవెన్యూ వ్యయం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కోవిడ్‌ సమయంలో మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అదనపు రుణాలకు అనుమతించింది. అయితే ఇటీవల కొంత మంది ఏపీ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తోందని తరుచూ ప్రస్తావిస్తున్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ఆర్థికంగా బలహీనంగా ఉంది. కోవిడ్‌ సంక్షోభంతో పాటు మరో పక్క రెవెన్యూ రాబడికి మించి తప్పసరి వ్యయాలు చేయాల్సి వస్తోంది. ఆస్తుల కల్పనకు సంబంధించి ఇరిగేషన్, విద్యుత్‌ వంటి ప్రాజెక్టులపై వ్యయం చేస్తున్నప్పటికీ వాటి ద్వారా వచ్చే రాబడి వాటి నిర్వహణకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి తప్పనిసరి ఖర్చులు చేయాల్సి వస్తోంది. అయినప్పటికీ మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ప్రభుత్వం 2020–21లో చేసిన అప్పులు అదుపులోనే ఉన్నాయి.  
– ఎం.ప్రసాదరావు, రిటైర్డ్‌ ఎకనమిక్‌ ప్రొఫెసర్, ఆంధ్రా విశ్వ విద్యాలయం 

తాజా వీడియోలు

Back to Top