గుంటూరు : కరోనా వైరస్‌ను రాజకీయాలకు వాడుకోవడం నీచమైన చర్య అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని సూచించారు. ఆదివారం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా ఇచ్చిన విందుకు తాను హాజరు కాలేదని స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ముస్తాఫా విందుకు వెళ్లారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అసలు విందే జరగలేదని.. జరగని విందుకు తామేలా వెళ్తామని ప్రశ్నించారు. ఓ వైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. రాజకీయ ప్రత్యర్థులు తమపై ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా క్వారంటైన్‌కు వెళ్లాలని ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని హితవు పలికారు. నిజంగా క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే.. సామాజిక బాధ్యతగా తాము వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.