ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడి కారు ధ్వంసం  

ఏలూరు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కొన‌సాగుతున్న కూటమి నేత‌ల‌ కక్ష సాధింపులు

ఏలూరు జిల్లా: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకు అధిక‌మ‌వుతున్నాయి. తాజాగా వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావును కావాలనే టార్గెట్ చేశారు. అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పల్లె శ్రీనివాసరావు కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు. రాళ్లు, రాడ్లతో వాహనాన్ని పగులగొట్టి బీభత్సం సృష్టించినట్లు సమాచారం. ఘటన సమయంలో శ్రీనివాసరావు ఆస్పత్రిలో ఉండగా, ఆస్పత్రి ముందు నిలిపి ఉంచిన వాహనాన్ని దుండగులు ధ్వంసం చేయడంతో పాటు చోరీకి కూడా పాల్పడ్డారు.

 భయపడే ప్రసక్తే లేదు
ఇది మొదటి ఘటన కాదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు. గతంలో డ్రైనేజీ పనుల పేరుతో పల్లె శ్రీనివాసరావు ఇంటిని అధికారులు కూల్చివేశారని, అప్పట్లో కూడా రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయని ఆరోపించారు. ఈ దాడులపై స్పందించిన పల్లె శ్రీనివాసరావు మాట్లాడుతూ, తాను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ప్రజల సమస్యలపై ప్రశ్నించడం వల్లే తనపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు. కూటమి నేతలు కావాలనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్వరం నొక్కి చెప్పినంత మాత్రాన దాడులు చేయడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి దాడికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై దాడులు పెరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Back to Top