గ‌త ఐదేళ్ల‌లో జ‌రిగిన భూబాగోతాలపై దర్యాప్తు 

ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి
 

విజయవాడ :  గత ఐదేళ్లలో చంద్రబాబు ప్ర‌భుత్వ హ‌యాంలో జరిగిన భూబాగోతాలపై దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరనున్నట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. కరకట్టలో తనకు ఇల్లు ఇచ్చినందుకే అక్రమాలకు పాల్పడిన లింగమనేని రమేష్‌ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపాడుకుంటూ వస్తున్నారని ఆరోపించారు. కేవలం తన నియోజకవర్గంలోనే లింగమనేని 40 నుంచి 50 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆర్కే విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ... లింగమనేని 40 ఎకరాల్లో లే ఔట్లు వేసి..విలాసవంతమైన విల్లాలు కట్టారని ఆర్కే పేర్కొన్నారు. 2005-2006 నుంచి విల్లాలు నిర్మించి ఒక్కొక్క విల్లాను రూ. 5 కోట్లకు అమ్ముకుని, లే ఔట్ ఫీజులు చెల్లించలేదని ఆరోపించారు. ఆ కట్టడాలకు సంబంధించిన బిల్డింగ్ పర్మిట్, గ్రామ పంచాయతికి కట్టాల్సిన లే ఔట్ ఫీజు ఇప్పటిదాకా కట్టలేదన్నారు. ‘ గజం భూమి విలువ రూ. 4 వేలుగా రిజిస్ట్రేషన్‌ విలువ చూపించారు. వీటి ద్వారాసుమారుగా 50 నుండి 60 కోట్ల రూపాయలు ఎగవేశారు. వ్యవస్థను పూర్తిగా పక్కదారి పట్టించి వాళ్ళ జేబులు నింపుకున్నారు. చట్టవ్యతిరేకమైన పద్ధతిలో వేరే వాళ్లకు మార్పిడి చేసుకున్నారు. రూ. 250 కోట్లరూపాయల విలువైన ఆస్తులను అప్పనంగా కొట్టేసిన లింగమనేని రమేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు కాపాడుకుంటూ వస్తున్నారు’  అని ఆర్కే ఆరోపించారు.

  అపార్టుమెంట్లు కానీ స్థలాలు కానీ కొనవద్దు
‘నిజానికి మంగళగిరి నియోజకవర్గంలో నిర్దిష్ట సమాచారం లేకుండా అపార్టుమెంట్లు కానీ స్థలాలు కానీ కొనవద్దు. విజయవాడ క్లబ్ కూడా అక్రమ కట్టడమే. అనుమతి లేని ఏ భవన యజమానులకైనా సీఆర్డీఏ నోటీసులు ఇస్తుందని అనుకుంటున్నాం. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది’ అని ఆర్కే పేర్కొన్నారు. సామాన్యులు అప్పులు తెచ్చుకుని ఇక్కడ ఇల్లు కడితే, తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్స్‌ చెక్‌ చేసుకోవాలని సూచించారు.

Back to Top