తాడేపల్లి : గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామస్థాయిలో విత్తనాలు అందిస్తున్నామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందుగానే విత్తన సరఫరా ప్రారంభించామని తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే రైతు భరోసా డబ్బు వేశామని తెలిపారు. ఆ డబ్బు రైతుకు చేరగానే విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. నేటి నుంచి వేరుశనగ విత్తన కాయలు 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నామన్నారు. వరి, ఇతర పంటల విత్తనాల సరఫరా కూడా జరుగుతోంది. నాణ్యతను అధిక ప్రాధాన్యం ఇచ్చాం. గతంలోలా భారీ క్యూ లైన్లు లేకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసి రైతుకు అందిస్తున్నాం. దీని వల్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా అరికడుతున్నాం. ఎక్కడైనా అవినీతి జరిగిందని మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. విత్తన పంపిణీ కోసం జిల్లాకో ప్రత్యేక అధికారిని కూడా పంపించామని కన్నబాబు తెలిపారు. 30న ఆర్‌బీకే సెంటర్లు ప్రారంభం రైతు భరోసా కేంద్రాలు ఈ నెల 30న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి కన్నబాబు తెలిపారు. దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అవి రాగానే గ్రామ స్థాయి నుంచి రైతు సేవలు ప్రారంభం అవుతాయి. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆర్బీకేల ప్రారంభం ద్వారా రైతు సేవలో పునరంకితమవుతాం’ అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.