రాష్ట్రాన్ని గబ్బుపట్టించింది చంద్రబాబే

గడిచిన ఐదేళ్ల పాలన బిహార్‌ కంటే అధ్వానంగా సాగింది

ప్రజాధనం లూటీ.. వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు

అన్నింటినీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సరిదిద్దుతున్నారు

పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు

అనుకూల మీడియాతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం: బిహార్‌ కంటే అధ్వానమైన పాలన చంద్రబాబు హయాంలో సాగింది. గడిచిన ఐదేళ్లలో ప్రజాధనాన్ని లూటీ చేశారు. వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నది బహిరంగ రహస్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. నీరు చెట్టు, ఇసుక, మట్టి, రాజధాని ల్యాండ్‌ మాఫియాతో రాష్ట్రాన్ని మొత్తం చంద్రబాబు గబ్బుపట్టించాడని మండిపడ్డారు. అస్తవ్యస్థమైన పాలనను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరిదిద్దుతున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, తెలుగుదేశం అనుకూలంగా మాట్లాడే మీడియా, వారి తాబేదారులు రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ నశించిపోయినట్లుగా మాట్లాడుతున్నారని, తప్పుడు వార్తలు రాసి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్న పత్రికలను కోర్టుల ముందు నిలబెట్టే ప్రయత్నం చట్టం కల్పించిందన్నారు. ఇది.. కొత్తగా తెచ్చింది కాదని సూచించారు. శ్రీకాకుళంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ..
‘పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. గడిచిన ఐదేళ్ల పాలన చూశాం. దేశంలో, రాష్ట్రంలో అనేకమైన చట్టాలను మోసగించి, కోర్టులకు దొరక్కుండా ఎత్తుగడలతో నైతికత లేని ప్రజాధనం అన్ని విధాల దోపిడీ చేశారు. అనుకూలమైన సంస్థలకు, తాబేదారులకు దోచిపెట్టారనేది బహిరంగ రహస్యం. అనుకూల పత్రికలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు అనేకమంది జీవితాలతో ఆడుకున్నారు. రాజకీయంగా పతనం చేసే పనిచేశారు. పార్టీలను సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు విజ్ఞులు కాబట్టి అంతిమంగా ధర్మాన్ని గెలిపించారు. అందుకే వైయస్‌ జగన్‌ నేతృత్వంలో వైయస్‌ఆర్‌ సీపీ పెద్ద ఎత్తున సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, పత్రికా స్వేచ్ఛ హరించుకుపోయిందని, బిహార్‌లా రాష్ట్రం అయ్యిందని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. నీ పాలన ఎలా సాగిందో చూసుకున్నావా బాబూ..? రాష్ట్రంలో ఎంత ధనం దోపిడీ అయ్యిందో.. ఎన్ని వ్యవస్థలను నాశనం చేశారో తెలుసా.. ఇవన్నీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సరిదిద్దుతున్నారు.
జపాన్‌ సంస్థకు చెందిన ఓ వ్యక్తి ఏపీ కంటే బిహార్‌ మెరుగ్గా ఉందని చెప్పాడు. ఏపీలో చంద్రబాబు పద్ధతి ప్రకారం దోపిడీ చేస్తున్నారని, వ్యవస్థలను సర్వనాశనం చేసి స్వార్థపాలన చేస్తున్నారని చెప్పారు. బిహార్‌ కంటే అధ్వానమైన పాలన బాబు హయాంలో సాగింది. డబ్బు దోచుకునేందుకు అవకాశం ఉండే కాంట్రాక్టును గుర్తించి ధరలు పెంచి వందలాది కోట్లకు ఖరారు అయ్యేట్లు ప్రభుత్వం ఊడిగం చేయడం.. వాటాలకు కక్కుర్తిపడడం.. వాస్తవం కాదా చంద్రబాబూ..?
 
రూ.వంద కోట్లు దాటిన ప్రతి కాంట్రాక్టు రివర్స్‌టెండరింగ్‌కు వెళ్లాలని జ్యూడీషియల్‌ సిస్టమ్‌ వద్దకు పంపించిన ప్రభుత్వం సీఎం వైయస్‌ జగన్‌ది. ఇలాంటి పనులు చేయడానికి ధైర్యం కావాలి. అది సీఎం వైయస్‌ జగన్‌కు మాత్రమే సాధ్యమైంది. సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదు. రాష్ట్రాన్ని మొత్తం చంద్రబాబు గబ్బుపట్టించాడు.
పత్రికా స్వేచ్ఛను హరించారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం ఏమైనా చట్టం తెచ్చిందా.. లేక కేసులు వేసిందా..? ఎక్కడ హరించడం జరిగిందో చెప్పాలి. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఎల్లోమీడియాతో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. తప్పుడు వార్తలు రాసిన వారిని కోర్టుల ముందు నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. ఇది ఈ ప్రభుత్వం తెచ్చిన చట్టం కాదు. సీఎం వైయస్‌ జగన్‌కు, వైయస్‌ఆర్‌సీపీకి పత్రికా స్వేచ్ఛమీద పూర్తి విశ్వాసం ఉంది.

గడిచిన ఐదేళ్లు పోలీస్‌ స్టేషన్లు ఏ విధంగా పనిచేశాయో ప్రజలందరికీ తెలుసు. ఇతర పార్టీల వారు ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఏ పార్టీ అని అడిగేవారు.. టీడీపీ కాదంటే.. కేసు కూడా నమోదు చేసేవారు కాదు.. చివరకు చింతమనేని ప్రభాకర్‌ ఒక మహిళా తహసీల్దార్‌ను కొడితే పిలిచిమందలించే పనికూడా చేయలేదు. చంద్రబాబు లాండ్‌ ఆర్డర్‌ గురించి మాట్లాడుతున్నాడు. నెల్లూరులో ఒక ఎమ్మెల్యే ఓ అధికారి పట్ల దుర్భాషలాడారని తెలిస్తే విచారణ చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. అది సీఎం వైయస్‌ జగన్‌ పాలన. మీ పాలనలో ఇలా ప్రవర్తించారా చంద్రబాబూ..?

ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ప్రతి పరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవని నిజాయితీ గల నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడా అవినీతి జరగకూడదని మెరిట్‌ ద్వారానే ఉద్యోగాలు సాధించాలని నిర్ణయం. ఇది సీఎం వైయస్‌ జగన్‌ పాలన తీరు. ఐదేళ్లలో ఒక్క మంచిపనిచేశారా చంద్రబాబూ..? రాజ్యసభకు ఒక్క వెనుకబడిన తరగతి వారిని పంపిచారా..? ఎవరు మూటలు ఇస్తే వారికి చంద్రబాబు సీట్లు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో నిజాయితీగా పాలన సాగుతుంది.. మన రాష్ట్రంలో ఎప్పుడు జరుగుతుందని ప్రజలు బాధపడేవారు.. కానీ, నిజాయితీ పాలనకు వైయస్‌ జగన్‌ ఒక ఆశాకిరణమని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Read Also: టమాట రైతుల సమస్యలపై సీఎం ఆరా

Back to Top