ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఏ సర్వే చెప్పింది, బాబు గారూ?

అసెంబ్లీ ఎన్నికలకు 17 నెలల ముందు ఎందుకీ ‘ముందస్తు’ జోస్యాలు, అన్నయ్యా! 

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి వచ్చే ఏడాది మే లేదా అక్టోబర్‌ మాసాల్లో ‘ముందస్తు’ అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చని ‘ఎన్నికల జ్యోతిష్కుడు’ ఎన్‌.చంద్రబాబు నాయుడు అమరావతిలో నిన్న జోస్యం చెప్పేశారు. 16 నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనుండగా తెలుగుదేశం పార్టీని ఇంత వరకు ‘యుద్ధసన్నదత’ వైపు నడిపిచలేకపోతున్న తండ్రీకొడుకులు తాము కోరుకున్న ఊహాలోకంలో విహరిస్తున్నారు. రాష్ట్ర సర్కారుపై జనంలో పెరుగుతున్న ‘వ్యతిరేకత’ తెలుగు రాజకీయ ‘కురువృద్ధుడు’ చంద్రసేనుడి బుర్రలో పుట్టినదేగాని, ఏ సర్వేలోనూ తేలిన విషయం కాదు. పోనీ ముందుస్తు ఎన్నికలు జరపాలనే ఆలోచన తమకు ఉందని పాలకపక్షమైన వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలెవరూ నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి గారికి ఫోన్‌ చేసి చెప్పలేదు. మరి ఈ పెద్దాయనకు కలొచ్చిందేమో! ఏ పాలకపక్షమైనా అత్యంత అనుకూల రాజకీయ, సామాజిక, ఆర్థిక వాతారణం సృష్టించుకుని షెడ్యూలు ప్రకారం ఎన్నికలకు వెళుతుంది. అంతేగాని, ప్రతిపక్ష నేత పగలనకా రేత్రనకా కలవరిస్తున్నారు కదా అని అసెంబ్లీని రద్దుచేయించి మధ్యంతర ఎన్నికలు జరిపించదు. ఈ మాత్రం ‘పొలిటికల్‌ కామన్‌ సెన్స్‌’ తెలుగు ప్రజానీకానికి ఉంది. ఈ లెక్కన టీడీపీ అధినేతకు ఈ ఎన్నికల కలవరింతలు ఎందుకో? అదీగాక, గత మూడున్నరేళ్లుగా జనాదరణ, ప్రజా సంక్షేమం, అభ్యుదయం పెంచుకుంటూ పోతున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్యంతర ఎన్నికలను జనం ముందుకు ఎందుకు తెస్తుంది? ‘ముందస్తు’, మధ్యంతర ఎన్నికలు వచ్చి పడుతున్నాయ్, తమ్ముళ్లూ, అని హెచ్చరిస్తే తప్ప తన పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు కదలని స్థితిలో సాగిలబడి ఉన్నట్టు చంద్రబాబు గుర్తించినట్టున్నారు. అందుకే, ఈ ఎన్నికల సంధి ప్రేలాపనలు–అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చేవి తన చివరి అసెంబ్లీ ఎన్నికలని గుర్తించిన మాజీ హైటెక్‌ సీఎం గారు వాటి రాక కోసం మరీ తొందరపడితే ప్రయోజనం ఉండదు. ఆయన తన కార్యకర్తలను, చోటామోటా నేతలను మొద్దు నిద్ర నుంచి మేల్కొలిపి, తన కాలూ చేయీ కూడదీసుకునే పనిలో ఇకనైనా పడితే మంచిది. అంతేగాని, ‘వస్తున్నాయ్, వస్తున్నాయ్‌ ‘జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్‌’ అంటూ గావుకేకలు పెడితే ఎవరికీ లాభం ఉండదు. ప్రగతి, సంక్షేమం, సుస్థిరత, శాంతి అనే నాలుగు చక్రాలపై ముందుకు సాగుతున్న ఏపీ పాలకపక్షంతో నేరుగా తలపడలేక చంద్రన్నయ్య తన కలల కార్యక్షేత్రం అమరావతిలో ఇలా అప్పుడప్పుడూ రాజకీయ జోస్యాలు చెబుతుంటారు.

Back to Top