నీ దూకుడు.. సాటెవ్వ‌రు

రైతులు ఫుల్ ఖుష్.

ఉద్యోగాల విప్ల‌వం

ప్ర‌తిప‌క్షానికి గ‌తిలేక వ‌ర‌ద‌ల్లో ఇసుక కోసం ధ‌ర్నాలు

పాల‌నా ప‌రంగా అనుభ‌వ‌జ్ఞుల‌ను మించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

ఒక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఐదేళ్ల‌లో ఆయ‌న ప‌నిత‌నం చూసి ప్ర‌జ‌లు మంచి మార్కులేసి 151 సీట్ల‌తో భారీ మెజారిటీతో ముఖ్య‌మంత్రిని చేశారు.  `జ‌గ‌నొస్తే వ‌ర్షాలు బాగా ప‌డ‌తాయి. క‌రువు కాట‌కాలు పోవాలంటే ఆయ‌న రావాలి..` ఎందుకో కానీ .. ఏపీలో అదో న‌మ్మ‌కం బాగా నాటుకుపోయింది. గడిచిన ఏడెనిమిదేళ్లుగా వ‌ర్షాలు లేక తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతున్న ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రి అయ్యాడు.. వ‌ర్షాలు కుర‌వ‌క‌పోతే ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటారోన‌ని వైఎస్సార్‌సీపీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌ల్లో ఒక‌టే టెన్ష‌న్. ప్ర‌మాణ స్వీకారం చేసే రోజునే అనుమానాలు పటాపంచ‌ల‌య్యాయి. జోరున కురిసిన కుండ‌పోత వ‌ర్షంతో రైతుల‌కు ఒక అనుమానం దాదాపు క్లియ‌ర్ అయిపోయింది. ఈ ఐదు నెల‌లుగా కురుస్తున్న వ‌ర్షాలు, పొంగుతున్న న‌దులు, నిండుతున్న బ్యారేజీలు రికార్డుల‌ను న‌మోదు చేస్తుంటే రైతులు ఫుల్ ఖుష్. ప్ర‌తిప‌క్షానికి గ‌తిలేక వ‌ర‌ద‌ల్లో ఇసుక కోసం ధ‌ర్నాలు చేయాల్సిన దుస్థితి. 

ముఖ్య‌మంత్రి అయితేనేం.. జ‌గ‌న్‌లో దూకుడు కొంచెం కూడా త‌గ్గ‌లేదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న అయిదేళ్లూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మీద ఎంత దూకుడుగా వెళ్లాడో.. ముఖ్య‌మంత్రిగా ఈ అయిదు నెల‌లూ పాల‌న‌పై ప‌ట్టు సాధించాడు. ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజున `ఆరు నెల‌లు అవ‌కాశ‌మివ్వండి మంచి పేరు తెచ్చుకుంటా`న‌ని చెప్పిన‌ట్టుగా ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు సంపాదించుకున్నాడు. జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి చంద్ర‌బాబుకు కార‌ణం దొర‌క్క‌ వ‌ర్షాల్లో ఇసుక కోసం ధ‌ర్నాలు చేసే ప‌రిస్థితి ఎదురైందంటేనే త‌ప్పులు జ‌ర‌గ‌కుండా ఎంత జాగ్ర‌త్త‌గా ముందుకెళ్తున్నాడో తెలుస్తుంది. ఒక టీవీ డిబేట్‌లో ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ కూడా జ‌గ‌న్ పాల‌న గురించి మాట్లాడుతూ పై స్థాయిలో అవినీతి త‌గ్గిపోయింద‌ని.. ఆ విష‌యంలో జ‌గ‌న్ చాలా క‌ఠినంగా ఉంటున్నాడ‌ని చెప్పిన విష‌యం ఇక్క‌డ గుర్తుతెచ్చుకోవాలి. ఎందుకంటే ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌కు నిజాయ‌తీగా మాట్లాడుతార‌నే మంచిపేరుంది. 

అడుగ‌డుగునా సంచల‌నాలు
ఈ ఐదు నెల‌ల జ‌గ‌న్ పాల‌న అడుగడుగునా సంచల‌నాల మ‌యం. ఏదో ఓట్ల కోసం పాద‌యాత్ర‌లో హామీ ఇచ్చాడ‌ని కాకుండా ఇచ్చిన మాట‌కు క‌ట్టుబడి ఎన్నిక‌ల హామీల‌ను ఒక్కొక్క‌టిగా నెర‌వేరుస్తూ వెళ్తున్నాడు. జ‌గ‌న్ అంద‌రి ముఖ్య‌మంత్రుల్లా కాదు.. ఆయ‌న శైలి ప్ర‌త్యేకం. ఎన్నిక‌ల హామీల అమ‌లును మొద‌టి నెల నుంచే ప్రారంభించాడు. పింఛ‌న్ పెంపుపై సంత‌కం చేశాడు. అమ‌లు చేశాడు. ఉద్యోగాల విప్ల‌వం తెస్తాన‌ని చెప్పిన‌ట్టుగానే వ‌లంటీర్ల‌ను నియ‌మించాడు.. అనుకున్న స‌మ‌యానికి అక్టోబ‌ర్ 2న ల‌క్షా 40 వేల మందితో గ్రామ స‌చివాల‌యాలు ప్రారంభించాడు. ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే రివర్స్ టెండ‌రింగ్ అని కాంట్రాక్ట‌ర్లకు గుబులు పుట్టించాడు. జ‌గ‌న్ గెలుపు, ముఖ్య‌మంత్రిగా ఆయ‌న దూకుడు చంద్ర‌బాబును ఎలాంటి ప‌రిస్థితికి తీసుకొచ్చిందంటే `మోడీతో పెట్టుకుని త‌ప్పుచేశాం..` అనాల్సి వ‌చ్చింది. మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకుని బీజేపీతో క‌ల‌వ‌డానికి వెంప‌ర్లాడుతున్నాడని ప్ర‌చారం బాహాటంగా జ‌రుగుతోంది. దీనిపై సుజ‌నా స్పందిస్తూ తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయాల‌ని చెప్ప‌డం కొస‌మెరుపు. 

అయిదు నెల‌ల పాల‌న‌లోనే 80 శాతం సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు జ‌రిగిపోయిందంటే పాల‌న‌పై జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎంత ప‌ట్టు బిగించాడో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఆరోగ్య‌శ్రీ వ‌ర్తింపు,  మ‌ద్య‌నిషేధం, అమ్మ ఒడి, పింఛ‌న్ల పెంపు, కంటి వెలుగు, రైతు భ‌రోసా, చేనేత కార్మికుల‌కు నేత‌న్న నేస్తం, ఆటో కార్మికుల‌కు ప‌దివేలు, మ‌త్స్య‌కార్మికుల‌కు ప‌ది వేలు, న్యాయ వాదుల‌కు 5 వేల భృతి, నాలుగు ల‌క్ష‌ల ఉద్యో్గాల భ‌ర్తీ, ఏపీపీఎస్సీ ఇంట‌ర్వ్యూల ర‌ద్దు, అగ్రిగోల్డ్ బాధితుల‌కు చెల్లింపులు, హోంగార్డుల‌కు జీతాల పెంపు, అర్చ‌కుల‌కు వంశ‌పారంప‌ర్య హ‌క్కు పున‌రుద్ధ‌ర‌ణ‌... లోటు బ‌డ్జెట్‌లో ఉన్నా ప‌థ‌కాల అమ‌ల్లో రాజీ ప‌డ‌కుండా వెళ్ల‌డం మామూలు విష‌యం కాదు. పోలీసుల‌కు వీక్లీ ఆఫ్ ప్ర‌క‌టించ‌డం చూసి ఇత‌ర రాష్ట్రాలు కూడా అందుకు సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించ‌డం మొద‌లు పెట్టాయి. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం కూడా కీల‌క ముందడుగు. ఒకవైపు తెలంగాణ‌లో ఆర్టీసీ ఉద్యోగులు ప్ర‌భుత్వంలో విలీనం కోసం ధ‌ర్నాలు చేస్తుంటే.. ఆంధ్రాలో మాత్రం చ‌క‌చ‌కా ఏర్పాట్లు జ‌రిగిపోతున్నాయి... పాల‌నా ప‌రంగా అనుభ‌వ‌జ్ఞుల‌ను మించిపోయాడ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ప‌క్క రాష్ట్రాల ప‌త్రిక‌ల్లోనూ ఏపీ ముఖ్య‌మంత్రి సామ‌ర్థ్యంపై పాజిటివ్ క‌థ‌నాలు రావ‌డం అభినంద‌నీయం.

Read Also:నిప్పు..కేసుల తుప్పు  

Back to Top