వేగవంతంగా గాలేరు–నగరి కాలువ విస్తరణ పనులు 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హయాంలో శ్రీకారం 

వైయ‌స్‌ జగన్‌ పాలనలో మరింత పురోగతి 

 వైయ‌స్ఆర్ జిల్లా: క‌రువు కాటకాలకు నిలయమైన రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాడు కంకణబద్ధులయ్యారు. కృష్ణా జలాలు సముద్రం పాలు కాకుండా నిలువరించి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కరువు సీమకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో గాలేరు– నగరి కాలువ నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచారు. తద్వారా గాలేరు–నగరి వరద కాలువలో ఏకంగా 20వేల క్యూసెక్కుల నీరు ప్రవహించే విధంగా కాలువ నిర్మాణం పనులు చేపట్టారు. నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తిచేసిన గాలేరు–నగరి వరద కాలువ పనుల వల్ల నేడు గండికోట ప్రాజెక్టులో పుష్కలంగా నీరు నిల్వ ఉంది. 

ప్రస్తుతం మరో 16 మీటర్ల వెడల్పు..  
వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రస్తుతం గాలేరు–నగరి వరద కాలువ విస్తరణపై దృష్టి సారించారు. 36 మీటర్ల వెడల్పుతో ఏకంగా 20వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించే విధంగా ఉన్న ఈ కాలువలో అదనంగా మరో 10 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించేలా చర్యలు చేపట్టారు. దీంతో కాలువను మరో 16 మీటర్లు వెడల్పు చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా అవుకు సమీపం నుంచి గండికోట టన్నెల్‌ సొరంగం వరకు 52 కిలోమీటర్ల మేర పనులను వేగవంతం చేశారు. అలాగే కాలువపై ఉన్న 52 వంతెనలను కూడా వెడల్పు చేసే పనులను ముమ్మరం చేశారు. 

రూ.1940 కోట్లతో పనులు..  
గాలేరు– నగరి వరద కాలువ,, సొరంగం వెడల్పుతోపాటు గండికోట ప్రాజెక్టు నుంచి పులివెందుల వరకు పైప్‌లైన్‌ పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1940 కోట్లు కేటాయించింది. ఎంఆర్‌కేఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఈ పనులు ప్రారంభించింది. ఇప్పటికే కాలువకు పడమరవైపు ఉన్న మట్టిని తొలగించే కార్యక్రమం కొనసాగుతోంది.   

Back to Top