తొలి 'సార్వత్రికం'లోనే అనితర గౌరవం

హైదరాబాద్:

మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల శాతంలో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో సొంత రాష్ట్రంలో ఎక్కువ ఓట్ల శాతం సాధించిన పార్టీగా వైయస్ఆర్‌సీపీ రికార్డు సృష్టించింది. పొత్తులేవీ లేకుండా ఒంటరిగా పోటీ చేసిన రాజకీయ పార్టీల్లో అత్యధిక శాతం ఓట్లను వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సాధించింది.

‌లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న అన్నాడీఎంకే, తృణమూ‌ల్ కాంగ్రెస్, బిజూ జనతాద‌ళ్ వంటి పార్టీలు ‌తమ సొంత రాష్ట్రంలో తెచ్చుకున్న ఓట్ల శాతం కంటే వైయస్ఆర్ కాంగ్రె‌స్ సీమాంధ్ర ప్రాంతంలో సాధించిన ఓట్ల శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ ఎన్నికల్లో లో‌క్‌సభలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్‌కు స్థానం దక్కింది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ప్రాంతీయ పార్టీల్లో ఏఐడీఎంకే 37 స్థానా‌లతో మూడవ స్థానం, 34 సీట్లతో తృణమూల్ కాంగ్రె‌స్ నాలుగ‌వ స్థానంలో నిలిచాయి. ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌కు 20, మహారాష్ట్రకు చెందిన శివసేనకు 18, టీడీపీ 16, టీఆర్‌ఎస్ 11 సీట్లతో తరువాత స్థానాలను దక్కించుకున్నాయి.‌ తొమ్మిది సీట్లతో జాతీయ పార్టీ సీపీఎం, వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ.. రెండూ సమానంగా నిలిచాయి.

‌ఓట్ల శాతం విషయానికి వస్తే.. ప్రాంతీయ పార్టీల్లో అన్నాడీఎంకే తమిళనాడులో సాధించిన ఓట్ల కన్నా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సీమాంధ్రలో 0.1 శాతం అదనంగా ఓట్లు తెచ్చుకోగలిగింది. అన్నాడీఎంకేకు తమిళనాడులో 44. 3% ఓట్లు రాగా, బిజూ జనతాద‌ళ్‌కు ఒడిశా రాష్ట్రంలో 44.1% ఓట్లు, తృణమూల్‌కు పశ్చిమబెంగాల్‌లో 39.3% ఓట్లు వచ్చాయి. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో 44.4% ఓ‌ట్లు సాధించి రికార్డు సృష్టించింది. తెలంగాణలో విజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్టీ సైతం తెలంగాణ ప్రాంతంలో పోలైన మొత్తం ఓట్లలో కేవలం 34.75% ఓట్లనే సాధించగలిగింది.

‌చివరికి సీమాంధ్రలో అధిక స్థానాలు గెలుచుకున్న టీడీపీకి కూడా.. అక్కడ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి వచ్చిన ఓట్ల‌ కన్నా దాదాపు 4% తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ- టీడీపీ కూటమిగా పోటీ చేయడం ద్వారా ఆ రెండు పార్టీలు కలిసి వైయస్ఆర్‌సీపీ కన్నా 2% అదనంగా ఓట్లను తెచ్చుకోగలిగాయి. ఉత్తరప్రదేశ్‌లో బలీయంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బీఎస్పీ, ఎస్పీలు ఈ ఎన్నికల్లో వరుసగా 19.6%, 22.3% ఓట్లు మాత్రమే సాధించగలగడం గమనార్హం.

Back to Top