వైయస్ఆర్ – ఒక రాజకీయ సంచలనం

కరువు కోరల్లో రాష్ట్రం విలవిల లాడుతున్న వేళ…. పల్లెలన్నీ జీవచ్ఛవాలై ప్రజలు వలస బాట పడుతున్న వేళ…. ప్రజలంటూ ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించిన వేళ…. ఒక నాయకుడు వచ్చాడు. ప్రజల కోసం ఒక ప్రస్థానానికి నాంది పలికాడు. పేదవాడి కష్టమేంటో ఆ పేదింటి గడప తొక్కితే గానీ తెలియదని, ఆ గుండెకు చేరువగా వెళితేగానీ వారి కష్టాన్ని తొలగించడం వీలు కాదని భావించి మహాప్రస్థానం ఆరంభించాడు. ఆయనే డా.వైయస్. రాజశేఖర్ రెడ్డి. ప్రజలు ఆయన్ను ముద్దుగా వైయస్సార్ అంటారు. 

టిడిపి అరాచక పాలన
అధికార పార్టీ టిడిపి పాలనలో అప్పటి సమైఖ్యఆంధ్ర రాష్ట్రం దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయం దండగని, హైదరాబాద్ నగరానికి ఐటి కంపెనీలను తెచ్చి హైటెక్ సిటీలో దింపడమే అభివృద్ధి అనే భ్రమలో బతుకుతోంది. కోట్ల రూపాయిల నిధులు, ప్రజాధనం అంతా హైటెక్కు హంగులకు, విదేశీ ప్రముఖుల ఆడంబరాలకు ఖర్చు చేస్తూ, పల్లెని, పేదలని నిర్లక్ష్యం చేసాడు చంద్రబాబు. విదేశాలనుండి తెచ్చిన కోట్లాది రూపాయల అప్పును పేద ప్రజలకోసం కాకుండా, మహానగరంలో పార్కులు, పెద్దపెద్ద కట్టడాల కోసం వినియోగించేవాడు. కరువు కోరల్లో చిక్కిన పల్లెలను కన్నెత్తి చూసిన పాపాన పోలేదు ఆ నాటి చంద్రబాబు ప్రభుత్వం.  

ఆశాకిరణంలా వైయస్సార్
ఏళ్ల తరబడి కరువుతో పంటలు పండక, మరో ఉపాధి లేక, చదువుకున్న యువతకు సరైన ఉద్యోగాలు లేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. వారి కోసం ఓ ప్రతిపక్ష నేతగా కాక, ఓ మనిషిగా, మంచి నాయకుడిగా వారి కష్టాలు తీర్చాలనుకున్నారు వైయస్ఆర్. ఆ పని చేయాలంటే ముందు వారి సమస్యలను సహృదయంతో వినాలి. వారి బాధను కళ్లతో చూడాలి. అందుకోసం ఇంటింటినీ పలకరించాలి. కారుల్లో, విమానాల్లో ప్రయాణిస్తూ ఖద్దరు చొక్కా నలక్కుండా చుట్టూ ఉన్న ప్రజానీకానికి చేతులూపుతూ వెళ్లిపోవడం కాదు. ఆత్మీయంగా ఒక్కొక్కరినీ పరామర్శించాలి. అందుకు కాలినడకే అసలైన సాధనం అనుకున్నారు వైఎస్. ప్రజలతో మమేకం కావడానికి గాంధీ అనుసరించిన పాదయాత్రనే తన మార్గంగా ఎన్నుకున్నారు. ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను ఆరంభించారు. ఆ అడుగు వేసినప్పుడు వైయస్ఆర్ కి కానీ, ఆయన్ను కదిలించిన ప్రజలకు కానీ తెలియదు అదో మహోన్నత శకానికి నాందీ ప్రస్థానం అవుతుందని…. రాష్ట్రచరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం మొదలౌతుందని. 

ప్రజా ప్రస్థానం
2003 సంవత్సరం మండు వేసవిలో చేవెళ్లలో మొదలైంది వైయస్సార్ ప్రజా ప్రస్థానం. ఉమ్మడి రాష్ట్రంలో 56నియోజక వర్గాలు, 11జిల్లాలు, 68రోజులు, 1470 కిలోమీటర్లు. కాలి నడకనే ఊరూరూ తిరిగారు వైయస్ఆర్. ప్రతి పల్లెనూ కన్నతల్లిలా పలకరించారు. కష్టమేంటని ఆరా తీసారు. గుడెసెలోని గుండె చప్పుడును విన్నారు. వారి కన్నీళ్లను తుడిచి, కష్టాన్ని దూరం చేస్తానని మాట ఇచ్చారు. ఒక్కచోట కాదు, ఒక్కరికో ఇద్దరికో కాదు, ఒక ఊరో జిల్లానో కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రాన్నీ ఆనాడాయన దత్తత తీసుకున్నారు. ఆ మహా పాదయాత్రలో ఆయనకు అడుగడుగునా హారతులు పట్టారు మహిళలు. ఆయన అడుగులో అడుగేసి నడిచారు ప్రజలు. 

అవరోధాలను అధిగమిస్తూ
పాదయాత్ర చేస్తే ఏం వస్తుందని పెదవి విరిచారు కొందరు. రోజు రోజుకూ పెరిగే ఆదరణను చూడలేక అడ్డంకులు సృష్టించింది ప్రభుత్వం. సొంత పార్టీ నేతలే ఇది పూర్తయ్యే వ్యవహారం కాదంటూ నిరుత్సాహపరిచారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా లెక్కచేయలేదు వైయస్సార్. ఆనాటి టిడిపి సర్కార్ పరిపాలనలో లెక్కలు సరిచేయడమే ముఖ్యం అనుకున్నారు. ముందుకు సాగిపోయారు. ఆరోగ్యం సహకరించకపోయినా, డాక్టర్లు వారించినా, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని తిరిగి పాదయాత్ర చేయండని సూచించినా వైయస్ వెనకడుగు వేయలేదు. పాదయాత్ర రాజమండ్రి దాటేసరికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు రాజశేఖర రెడ్డి. ఆ జననేత కోసం కోట్లాదిమంది ప్రజలు ఆనాడు దేవుని వేడుకున్నారు. కులం, మతం, ప్రాంతం అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరూ వైయస్సార్ కోలుకోవాలని ప్రార్థనలు చేసారు. చర్చి, మసీదు, దేవాలయాల్లో ఆయన పేరున పూజలు చేసారు. వారి ఆకాంక్షే భగవంతుని ఆశీస్సుగా మారి వైయస్ కోలుకున్నారు. రెట్టింపు ఉత్సాహంతో తిరిగి తన ప్రస్థానాన్ని కొనసాగించారు.

రాజకీయాల్లో పెను సంచలనానికి నాంది
తెలుగు తల్లి తనువు, మనసు పులకించిన క్షణం. తెలుగు ప్రజలందరి ఆశ నిజమైన తరుణం. రాజకీయాల్లో ఒక పెను సంచలనం. 2004 ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో వైయస్సార్ విజయం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే సంక్షేమ పాలనకు శ్రీకారమైన ఉచిత విద్యుత్ ఫైలు మీద తొలి సంతకం పెట్టారు వైయస్సార్. అది మొదలు ఎన్నో పథకాలతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. నేటికీ ఆయన పేరు తలుచుకోని గుండె ఉండదు. ఆ పాలనను కోరుకోని గడప ఉండదు. ఆ నమ్మకమే ఆయన నిర్మించుకున్న కంచుకోట. దాన్ని కాపాడే సైనికుడు, వైయస్ ఆశయాల సాధకుడు, రాబోయే మరో ప్రస్థానానికి నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. 

Back to Top