ప్ర‌జ‌ల గుండెల్లో కొలువైన దైవం

దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జల మ‌నిషి. ఆయనో రైతు.. రుణ మాఫీ, ఉచిత విద్యుత్‌తో చేనుకు చేవ అయ్యారు. ఆయనో ‘నాడి’ తెలిసిన డాక్టర్.. ఆరోగ్యశ్రీ, 108, 104లతో ఎందరి ప్రాణాలో నిలిపారు. ఆయనే గిరిజనోద్ధారకుడు.. పోడు భూములకు అటవీహక్కు పత్రాలు ఇచ్చి ఆదుకున్నారు. ఆయనో ‘సరస్వతి పుత్రుడు’.. పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించే ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ ఇచ్చిన మహానుభావుడు. మహిళలను లక్షాధికారులను చేసేందుకు ‘డ్వాక్రా’ రుణమై..యువతకు ‘ఉపాధి’ బాటై.. ‘జలయజ్ఞం’ చేసిన అపర భగీరథుడై..ఇందిరమ్మ ఇల్లై.. పథకాల ప్రదాతై.. మహానేతై.. పాలనాదక్షతతో గుండె ‘గుండె’లో గూడుకట్టుకున్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయ‌న ద్వారా ల‌బ్దిపొందిన వారి గుండెచ్పుడు ఇది.

వ్యవసాయ కూలీ.. రైతయ్యాడు
రెంజల్ : వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వ్యవసాయ కూలీలను రైతులను చేశాయి. రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దండిగుట్టకు చెందిన రైతు పీర్యా అలాగే రైతయ్యాడు. ‘‘నేను వ్యవసాయ కూలీగా పనిచేసేవాడిని. నాకూ భూమి ఉంటే బాగుండు అనిపించేది. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక కూలీగానే పనిచేసేవాడిని. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక నా కల సాకారమయ్యింది. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా భూమి ఇచ్చారు. దానిని సాగు చేసుకుంటున్నాను. పదేళ్ల క్రితం రైతు కూలీని.. ప్రస్తుతం ఎనిమిది ఎకరాల ఆసామిని అయ్యాను’’ అని పీర్యా వివరించాడు. అంతా రాజన్న భిక్షేనని ఆయన పేర్కొంటారు.

ఉద్యోగం వైఎస్ భిక్షే: అజీమ్, పీఈటీ
మధిర : మాది మధిర మండలం ఖాజీపురం. బీఏ చదివాను. 1991లో ఫిజికల్ ఎడ్యుకేషన్ శిక్షణ పూర్తి చేశాను. ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో 15 ఏళ్లు ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా పనిచేశాను. వచ్చే జీతం సరిపోక మధిరలోని వైరా రోడ్డులో చెప్పుల దుకాణం పెట్టుకున్నా. ఆ వ్యాపారం సరిగా నడవక నష్టాలొచ్చాయి. అప్పటికే నాకు 38 ఏళ్లు నిండాయి. ఉద్యోగం వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి. అప్పట్లో వైఎస్‌ఆర్ ముస్లిం, మైనార్టీల పాలిట దేవుడిలా..  4 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఐదేళ్ల వయసు సడలింపు ఇచ్చారు. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఇప్పటికీ రోజూ పాఠశాలకు వెళ్లే ముందు వైఎస్‌ఆర్ చిత్రపటానికి నమస్కరించి వెళ్తా.

రూ. 20 వేలు రుణమాఫీ అయ్యింది
నవీపేట : నాపేరు డాంకె భూమన్న. నేను నవీపేటలోని ధర్యాపూర్ కాలనీ లో నివసిస్తున్నాను. నాకు ధర్యాపూర్ చెరువు కట్ట కింద రెండెకరాల పంట భూమి ఉంది. పంటల సాగుకోసం నవీపేట సొసైటీలో రూ. 5 వేల రుణం తీసుకున్నాను. పంటలు పండకపోవడంతో అప్పు పెరిగి నాలుగింతలైంది. అప్పు తీర్చాలంటూ సొసైటీ అధికారులు చాలాసార్లు మా ఇంటికి వచ్చి, ఒత్తిడి చేశారు. 2004లో రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేశారు. దీంతో నా అప్పు మాఫీ అయ్యింది. నాలాగే చాలా మంది రైతులు సంబురపడ్డారు. రాజన్న చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం..

నాడు స్వర్ణయుగం..
ఖమ్మం వ్యవసాయం: 2008లో రూ.40 వేలు రుణమాఫీ పొంది వ్యవసాయాన్ని పండగ చేశాడు ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు రైతు మద్ది వీరారెడ్డి. నేడు అదే రైతు బంగారాన్ని తాకట్టు పెట్టి పంటరుణాలు తెచ్చి వ్యవసాయం చేస్తున్నాడు. నాడు రూ.40 వేలు ఏకకాలంలో పంట రుణం మాఫీ అయింది. వెనువెంటనే తిరిగి బ్యాంకులు కూడా పంట రుణాలు ఇచ్చాయి. అప్పుడు అంతా సంతోషంగా గడిచింది. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణం రూ.25 వేలు మాఫీ అయింది. విడతల వారీ రుణమాఫీలో భాగంగా ఆ రుణంలో రూ.12,500 మాత్రమే ఇప్పటి వరకు మాఫీ ఇచ్చారు. బ్యాంకులు సకాలంలో రుణాలు కూడా ఇవ్వకపోవటంతో తనకున్న బంగారాన్ని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో తాకట్టు పెట్టాడు. రూ.36 వేలు పెట్టుబడిగా తెచ్చి 5 ఎకరాల వరి పంటకు పెట్టుబడి పెడుతున్నారు.

Back to Top