తలవంచని ధీరుడు

 

తొమ్మిదేళ్లుగా రాజీలేని పోరాటం

తండ్రి మరణించినా మొక్కవోని ధీశాలి వైఎస్‌ జగన్‌

కుట్రలను ఛేదించుకుంటూ ముందుకే సాగుతున్న వైనం

16 నెలలపాటు జైల్లో ఉన్నా చెక్కుచెదరని సంకల్పం

అణగదొక్కే కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో బలోపేతం

హత్యా యత్నాన్ని సైతం లెక్కచేయని ధైర్యశాలి

ఎక్కడా నిబ్బరం కోల్పోని కష్టజీవి

ఎవరికీ తలవంచని ధైర్యం..కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం.. మేరువు లాంటి తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం వైఎస్‌ జగన్‌ సొంతం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. 

తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన క్షణం నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గత తొమ్మిదేళ్లుగా జరిగిన కుట్రలు అన్నీఇన్నీ కావు. రాజీలేని పోరాటం చేస్తున్నందుకు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఎన్నెన్నో. మహానేత అయిన తండ్రి మరణం జగన్‌కు రాజకీయంగా తొలి దెబ్బ అయితే.. భౌతికంగా తననే అంతం చేయాలని తాజాగా జరిగిన కుట్ర మలి దెబ్బ. ఈ రెండింటికీ మధ్య ఆయన కుట్రదారుల నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. నిరంకుశ కాంగ్రెస్‌ నేతలతో రాజీపడనందుకే జగన్‌ ఆర్థిక మూలాలనే దారుణంగా దెబ్బతీయాలనే కుట్ర జరిగింది. ఇదే క్రమంలో ఆయనపై అనేకానేక నిరాధారమైన ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించి పదహారు నెలలపాటు జైలుపాల్జేశారు.

ఈ తొమ్మిదేళ్లలో వ్యతిరేక శక్తులు జగన్‌ను అణగదొక్కాలని చూసేకొద్దీ ఆయన రెట్టించిన ఉత్సాహంతో బలపడుతూ వచ్చారు. తండ్రి ఆశయాలను సాధించాలనే బృహత్తర ఆశయంతో, ఆయన చూపిన ప్రజా సంక్షేమ వెలుగులో ప్రజలకు మరింత చేరువై వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగిన జగన్‌ జైల్లో ఉన్న 16 నెలల కాలం మినహా మిగతా సమయమంతా జనం మధ్యనే ఉంటూ వచ్చారు. తనను అణగదొక్కాలని, రాజకీయ ముఖ చిత్రంలోనే లేకుండా చేయాలని వ్యతిరేక శక్తులు అనేకానేక కుట్రలు పన్నినా ఇనుమడించిన ఉత్సాహం, పట్టుదలతోనే ఆయన ప్రజాక్షేత్రంలో ఎదురొడ్డి పోరాడుతున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఇంత సుదీర్ఘకాలం పాటు పోరాట మార్గంలో సాగిన రాజకీయవేత్త మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. 2009లోనే ఎంపీగా గెలిచినప్పటికీ తండ్రి మరణం తరువాతే వైఎస్‌ జగన్‌ రాజకీయంగా క్రియాశీలకమయ్యారు.  

నల్లకాలువ వద్ద ఇచ్చిన మాట కోసం..

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్‌ 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం జగన్‌ను బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తనలాగే కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు జగన్‌ తదుపరి కర్తవ్యంపై దృష్టి పెట్టారు. మూడు వారాలైనా తిరక్కముందే ఆయన అదే నెల 25న వైఎస్‌ మరణించిన పావురాలగుట్టను సందర్శించి నివాళులర్పించిన తరువాత నల్లకాలువ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని భరోసా ఇచ్చారు. ఇలా ఇచ్చిన మాటే ఆయన కష్టాలకు తొలిమెట్టయింది.

అప్పటికి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న జగన్‌.. 2010, ఏప్రిల్‌ 9 నుంచి తొలి విడత ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. జనం నుంచి తిరుగులేని స్పందన రావడం కాంగ్రెస్‌ పెద్దలకు కంటగింపుగా మారింది. రోజురోజుకూ జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేకపోయిన వారు దీనిని ఆపాలని తాఖీదు జారీచేశారు. ఫలితంగా కొంతకాలం యాత్ర ఆగినా వారి అనుమతితోనే పునఃప్రారంభించేందుకు జగన్‌ చేసిన విజ్ఞప్తులు, ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్రతో ముందుకే వెళ్లాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌లో ఉంటే ఏమీ చేయలేమని గ్రహించిన జగన్, ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ.. 2010 నవంబరు 29న కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. అనంతరం 2011 మార్చి 12న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. ఆ తరువాత ఈ రెండు స్థానాలకూ జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా జగన్‌ కనీవినీ ఎరుగని రీతిలో 5.45లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీతో, విజయమ్మ పులివెందుల నుంచి 75వేల ఓట్ల భారీ ఆధిక్యతతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఖాళీ అవుతోందని గ్రహించి, సరిగ్గా అప్పటి నుంచే ఢిల్లీలో సోనియా, రాహుల్, రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కుమ్మక్కై జగన్‌పై కుట్రలకు తెరలేపారు. ఆ తర్వాత జగన్‌పై కేసులు వేయడం.. సీబీఐ దాడులు.. జైలులో పెట్టడం వెంటవెంటనే జరిగిపోయాయి. జైల్లో పెట్టి మానసికంగా జగన్‌ స్థైర్యాన్ని దెబ్బతీసి తమ దారికి తెచ్చుకోవచ్చన్న వారి ఆశలు అడియాసలయ్యాయి. జగన్‌ ఆర్థిక మూలాలను దెబ్బతీసి అణగదొక్కవచ్చనుకున్న ప్రయత్నాలూ ఫలించలేదు. మరోవైపు.. రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన మీడియా జగన్‌ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. ఓ ఆర్థిక ఉగ్రవాది అంటూ ఇష్టారాజ్యంగా చిత్రీకరించింది. ఈలోపు చంద్రబాబు మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్‌ జైలులోనూ.. విజయమ్మ గుంటూరులోనూ నిరవధిక నిరాహారదీక్ష చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు, టీడీపీ కూటమికి మధ్యే ప్రధానంగా పోటీ జరిగింది.  

కష్టాల్లో కూడా వీడని విలువలు
ఈ ఎన్నికల్లో రైతు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీ ఇచ్చారు. దాంతో మనం కూడా రుణ మాఫీపై హామీ ఇద్దామని పార్టీలో ఎంతగా ఒత్తిడి వచ్చినప్పటికీ జగన్‌ లొంగలేదు. సాధ్యం కాని హామీలు నేనివ్వలేనని నిజాయితీగా తేల్చి చెప్పారు. అలాగే.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టగలిగే సామర్ధ్యం ఉన్నప్పటికీ వక్రమార్గాల్లో వెళ్లకుండా విలువలు పాటించారు.  ఎవరైనా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలంటే అధికార పదవికి రాజీనామా చేసి రావల్సిందేనన్న షరతును విధించి రాజకీయాల్లో ఉత్తమ సంప్రదాయాలను నెలకొల్పారు. నిన్న మొన్నటి వరకూ వైఎస్‌ జగన్‌కు చాలా సన్నిహితంగా మెలిగి, ఇటీవలే దివంగతులైన డీఏ సోమయాజులు అన్నట్టు.. ‘జగన్‌ మాదిరిగా ఇన్ని కష్టాలుపడిన నేతను, ఇన్ని కుట్రలకు గురైన నేతను నా జీవితంలో చూడలేదు’ అన్నది అక్షర సత్యం. 

సడలని ధైర్యంతో..
2014ఎన్నికల్లో చంద్రబాబు.. నరేంద్రమోదీ, పవన్‌కల్యాణ్‌ సహకారంతో కేవలం 1.6 శాతం ఓట్లతో గట్టెక్కారు. ఎన్నికల అనంతరం హుందాగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సమస్యలను తిరుగులేని రీతిలో స్పందిస్తుండడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని నిర్వీర్యం చేసేందుకు వందల కోట్ల రూపాయలతో ఆ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. అయినా, జగన్‌ స్థైర్యం కోల్పోలేదు. చంద్రబాబు ఇచ్చిన 600 అబద్ధపు హామీలు నెరవేరక కష్టాల్లో కునారిల్లుతున్న ప్రజలను కలుసుకుని వారికి భరోసా ఇచ్చేందుకు నవరత్నాలు కార్యక్రమం అమలు ఆలంబనగా 2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. చట్టం పేరు చెప్పి దీనికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరిగినా వెరవకుండా ముందుకే సాగారు. ఆయనపై చేసిన కుట్రలు సాగలేదన్న దుగ్ధతో ఇక భౌతికంగానే అంతం చేయాలన్న దుస్సాహసానికి ఇటీవల తెగబడిన విషయం తెలిసిందే. 

అసాధారణ పరిణతి చూపిన నేత
ఎప్పటిలాగే.. పాదయాత్ర నుంచి హైదరాబాద్‌లో కోర్టుకు హాజరయ్యేందుకు విజయనగరం జిల్లా నుంచి బయల్దేరిన జగన్‌పై గతనెల 25న విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. ఈ హఠాత్‌ పరిణామం నుంచి వెంటనే తేరుకుని జగన్‌ వ్యవహరించిన తీరు పరిశీలకుల ప్రశంసలను చూరగొన్నది. ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా తనపై జరిగిన దాడిని పెద్దదిగా చేయకుండా గాయం రక్తం ఓడుతున్నా.. ప్రథమ చికిత్స చేయించుకుని  హైదరాబాద్‌కు బయలుదేరడం సరైన నిర్ణయంగానే వారు వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా ఈ సంఘటనను ఆయన రాజకీయంగా వాడుకోవాలని చూసి ఉంటే ఏమీ జరగనట్లుగా ఉండే వారే కాదని వారు భావిస్తున్నారు. ఇంత కష్టంలోనూ పాదయాత్రను పునఃప్రారంభించాలని వైఎస్‌ జగన్‌ పట్టుదలతో ఉండటం ఆయన ధృఢ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది.

Back to Top