- హంద్రీనీవా పేరుతో టీడీపీ ఎమ్మెల్యేల హల్‌చల్- రోజుకో ఎమ్మెల్యే చుట్టూ హైడ్రామా- వైయస్ఆర్ పూర్తి చేసిన పనులను..తానే చేసినట్టుగా చెప్పుకుంటున్న బాబు-టీడీపీని ఛీ కొడుతున్న ప్రజలు
కరువు సీమ రాయలసీమ పేరు చెప్పి చంద్రబాబు మొదలుకుని టీడీపీ ఎమ్మెల్యేలు రోజుకో చర్చకు తెరతీస్తున్నారు. రాయలసీమ కరువును అడ్డం పెట్టుకుని వారు రాజకీయంగా డ్రామాలు ఆడుతున్నారని స్థానిక నాయకులు, ప్రజలు అల్లాడిపోతున్నారు. మా పేరు చెప్పుకుని వారి ఖజానా నింపుకోవడమే తప్పించి మాకు ఒరగబెట్టిందేమీ లేదని వాపోతున్నారు. ముఖ్యంగా రాయలసీమలో బాగా వెనుకబడిన జిల్లాగా పేరున్న జిల్లా అనంతపురం. టీడీపీ ఎమ్మెల్యేలు కరువును అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు.
హంద్రీనీవా కాలువల్లో మొన్నామధ్య వారం పదిరోజుల పాటు నీళ్లు పారాయి. ఆ సమయంలో.. పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నానా యాగీ చేశారు. ముందుగా పరిటాల సునీత కాలువల వద్దకు వెళ్లి.. వేరేచోటికి వెళ్తున్న నీటికి ఇసుక మూటలు అడ్డేయించారు. వాటిని తమ నియోజకవర్గం పరిధిలోని చెరువుల వైపు తిప్పారు. తద్వారా సునీత హీరో అయిపోయారు. ఇక మరుసటి రోజున ధర్మవరం ఎమ్మెల్యే సూరి వెళ్లాడు. ఈయనా తన శక్తి కొద్దీ, తన అనుచరులను నిలబెట్టి కాలువలకు అడ్డంగా ఇసుక మూటలు వేయించాడు. నీటిని తన నియోజకవర్గం వైపు వెళ్లే కాలువల వైపు తిప్పించాడు.
మొన్న ఏమో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చాగళ్లు రిజర్వాయర్ నుంచి నీళ్లను విడుదల చేయకపోతే రాజీనామా అన్నాడు. ఇన్నేళ్లు తను ఏమీ చేయలేకపోయాను అని ఒప్పుకున్నాడు. పాతికేళ్ల నుంచి పదవులను అనుభవిస్తున్నా తాడిపత్రికి ఏమీ చేయలేదు, ఎంపీ అయ్యాకా అనంతకూ ఏమీ చేయలేదు అని జేసీ ఒప్పేసుకున్నాడు. అందుకు ప్రాయశ్చితంగా ఎంపీ పదవికి రాజీనామా అన్నాడు.అలా రెండ్రోజులు హడావుడి చేసి తర్వాత అడ్రస్ లేకుండాపోయాడు. చాగళ్లు రిజర్వాయర్ నుంచి నీళ్లు వదులుతున్నట్టుగా ప్రకటన చేశారు.. అయితే అది శాశ్వతంగా కాదు. జేసీ క్రియేట్ చేసిన హైడ్రామాకు ఒక ఎండింగ్ అన్నమాట.
మరి జేసీ బెదిరింపు నేపథ్యంలో చాగళ్లు నుంచి నీళ్లు విడుదల కావడంతో.. మరోవైపు శింగనమల ఎమ్మెల్యే యామినీ బాలా, ఆమె తల్లి శమంతకమణిలు రోడ్డు ఎక్కారు. వీళ్లు కూడా తెలుగుదేశం వాళ్లే. జేసీ అన్యాయం చేస్తున్నాడని, శింగనమలకు చెందాల్సిన నీళ్లను తాడిపత్రికి తరలించుకుపోతున్నాడని వీరు నాటకానికి పని చెప్పారు. వెళ్లి అనంతపురం కలెక్టర్‌ను కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. తమకు కలెక్టర్ హామీ ఇచ్చాడని, శింగనమలకు న్యాయంగా, చట్టపూర్వకంగా చెందాల్సిన నీటిని అందిస్తామని హామీ ఇచ్చాడని ఈ తల్లీ కూతుళ్లు చెప్పారు.
ఇలా తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ హీరోయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవరికి వారు తమ తమ నియోజకవర్గాలను ఉద్ధరించేస్తున్నామని అంటున్నారు. హంద్రీనీవాకు ఏడాదిలో పదిరోజులు నీళ్లు వస్తేనే.. తెలుగుదేశం వాళ్లు ఇంతంత ఓవరాక్షన్ చేస్తున్నారు, గతంలో నీటిలభ్యత బాగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు.. హంద్రీనీవాను పట్టించుకుని ఉంటే ఒట్టు. ఎన్టీఆర్ హయాంలో శంకుస్థాపనల బండలు వేయగా.. బాబు హాయంలో హంద్రీనీవా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చివరకు వైయస్ పుణ్యమా అని ఎనభైశాతం పని పూర్తి అయ్యింది. ఆ తర్వాత మిగిలిన కొద్ది పాటి పనులను పూర్తి చేసి రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. దాదాపుగా వైయస్ఆర్ పూర్తి చేసిన ప్రాజెక్ట్ ను బాబు తన ఖాతాలో వేసుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. కానీ, ఆయన్ను జనం నమ్మే పరిస్థితుల్లో లేరన్నది వాస్తవం. సీమకు నీళ్ల పేరుతో అధికార టీడీపీ డ్రామాలాడుతుందేతప్పు రైతులకు నీరు ఇచ్చి ఆదుకోవాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం లేదన్నది సుస్పష్టం.