పుస్తకాల వెనుక పచ్చ పురుగులు

– విజయవాడలో బుక్‌ ఫెస్టివల్‌ భవనానికి టెండర్‌ 
– రూ. 50 కోట్ల ఆస్తిని చేజిక్కించుకునే కుట్రకు శ్రీకారం
– నవ్యాంధ్ర పుస్తక సంబరాల పేరిట వ్యూహ రచన 
– పేరు ఎన్టీఆర్‌ ట్రస్టుకు.. నిధులు మాత్రం బ్రాహ్మణ, కాపు ఇతర శాఖల నుంచి

కబ్జాల్లో తండ్రిని మించి పోతున్నాడు నారా లోకేష్‌. బాబు కంటే రెండాకులు ఎక్కువే చదివినట్టున్నాడు. కనుచూపు మేరలో కనిపించే దేన్నీ వదలడం లేదు. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్టుంంది టీడీపీ పాలన. అయితే ఆ దోపిడీని కూడా గోడ కట్టినట్టు అందంగా కట్టడమే వారి చాతుర్యం. పక్కా స్క్రీన్‌ప్లేతో ఎడిటింగ్‌ అవసరం లేని సినిమా చూపించేస్తున్నారు జనాలకు. చేసే ప్రతి పనిలోనూ పబ్లిసిటీని వెతుక్కోవడంతోపాటు తన వాటాను దక్కించుకోవడంలోనూ తండ్రీకొడుకులు సిద్ధహస్తులు. వాటా ఏం ఖర్మ లోకేష్‌ వేలు పెడితే గుడిని గుల్లో లింగాన్ని కూడా వదలడు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రజాప్రయోజనాల ముసుగులో వీరు చేసే దోపిడీలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా విజయవాడలో నవ్యాంధ్ర పుస్తక సంబరాల పేరుతో రూ. 50 కోట్ల భారీ దోపిడీకి కథనం సిద్ధమైంది... అదెలాటంటే... 
=========================
అసలే విజయవాడ అందులోనూ వాణిజ్య కేంద్రం.. నగరంలో బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీకి నడిబొడ్డున రూ. 50 కోట్ల విలువైన భవనం ఉంది. అది ఇన్నేళ్లూ కబ్జాదారుల పరం కాకుండా పదిలంగా ఉంది. కానీ చినబాబు అమెరికా ఎంబీఏ తెలివితేటలతో జస్ట్‌ ఇలా చూసేసి అలా స్కెచ్‌ వేశాడు.. ఇప్పుడా ఆస్తిని కబ్జా చేసుకునే దిశలో పావులు కదుపుతున్నాడు. 

వివరాల్లోకి వెళితే... 27 సంవత్సరాలుగా విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో పుస్తకోత్సవాలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ‘నవ్యాంధ్ర పుస్తక సంబరాలు’ పేరిట నిర్వహిస్తున్నారు. సొసైటీలో ఓ వర్గానికి చెందిన సభ్యులతో చినబాబు మంతనాలు చేసి ఓ ప్లాన్‌ చెప్పాడు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో బుక్‌ ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయండి. మీకు ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున నిధులిస్తానని చెప్పాడు. 25 లక్షలు ముందస్తుగా ప్రకటించాడు. అనంతపురం, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు కేంద్రాల్లో అలాగే నిర్వహించారు.  ప్రకటించిన ఖర్చు 25 లక్షలు దాటిపోవడంతో ఇక శ్రీకాకుళం ఎగ్జిబిషన్‌ వాయిదా పడింది. తదుపరి నిధుల సంగతి తేలలేదు. నిజానికి ఈ 25 లక్షలు ఎవరివ్వాలి..? ఎన్టీఆర్‌ ట్రస్టు ఇవ్వాలి. అయితే సాంఘిక సంక్షేమశాఖ, సర్వశిక్షాభియాన్, కాపు కార్పొరేషన్, గిరిజన కార్పొరేషన్ల నుంచి కాసిన్ని డబ్బులు జమచేసి, ఆ చెక్కులిచ్చారు. అంటే పుణ్యం ఎన్టీఆర్‌ ట్రస్టుకు సొమ్ములేమో ప్రజలవి అన్నమాట. 

విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌తో మొదలై...
విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ అప్పుడెప్పుడో 1989లో ఏర్పాటు చేశారు. ఎవరో నలుగురైదుగురు పెద్ద మనుషులు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన పబ్లిషర్స్‌ ఇందులో సభ్యులు. దీనికి రీసెర్చ్‌ లైబ్రరీ పేరిట అప్పటి మున్సిపాలిటీ 300 గజాలకు పైగా స్థలం కేటాయించింది. ఇది జరిగి 20 సంవత్సరాలు దాటిపోయింది. అందులో ఈ సొసైటీ నాలుగంతస్తుల భవనం కట్టుకుంది. ఇప్పుడది స్కామ్‌కు కేంద్ర స్థానం. దీని విలువ మార్కెట్‌లో 50 కోట్లు ఉంటుందని అంచనా. విజయవాడ పుస్తక మహోత్సవం అనే పేరు కాస్తా ఇప్పుడు తెలుగుదేశం ఆధీనంలోకి వెళ్లిపోయి నవ్యాంధ్ర పుస్తక సంబరాలైంది. మొత్తం తెలుగుదేశం కార్యకర్తలదే పెత్తనం అయిపోవడంతో ఇన్నాళ్లు కేవలం పుస్తకాలపై మక్కువతో ఈ సొసైటీని తమ సొంతమని భావిస్తున్న పబ్లిషర్స్‌కు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. గత ఏడాది బుక్‌ ఫెస్టివల్‌కు స్థలం కేటాయించడానికి నానా తాకట్లు పెట్టిన ప్రభుత్వం కేవలం సగం గ్రౌండ్స్‌ కష్టమ్మీద కేటాయించింది. ఈసారి నవ్యాంధ్ర పుస్తక సంబరాలు అని పేరు మార్చేసి, తెలుగు తమ్ముళ్ల పెత్తనం కింద, ఎన్టీఆర్‌ ట్రస్టు నిర్వహిస్తున్నదీ అనగానే మొత్తం గ్రౌండ్‌ అప్పగించేసింది. ఇక జరగబోయేది ఊహించడం పెద్ద కష్టం కాదు.

ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల నిధులతో సొసైటీ కార్యకలాపాలకు సాయం చేస్తూ, అదేదో ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా చేస్తున్నట్టు కలర్‌ ఇస్తున్న చినబాబు ఈసారి ఆ రూ. 50 కోట్ల భవనంపై కన్నేశారని ప్రచారం మొదలైంది. ఇప్పటికే బుక్‌ ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్స్‌ హైజాక్‌ చేసిన ఎన్టీఆర్‌ ట్రస్టు ఇక భవనాన్ని, సొసైటీని కబ్జా చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుని పూర్తిగా తెలుగుదేశం సొంత వ్యవహారంగా మార్చే ప్రయత్నాల్లో పడ్డారు. అంటే ఇన్నాళ్లు పుస్తక సంబంధ వ్యవహారంగా ఉన్న ఈ సొసైటీ కార్యకలాపాలు ఇక ఒక రాజకీయపార్టీకి అనుబంధం కానున్నాయన్నమాట. మెల్లిగా ఆ భవనం కూడా ఆక్రమిస్తే కాదన్నవాళ్లను సొసైటీ నుంచి తరిమేస్తే ఇక ఆ భవనానికి పచ్చరంగు వేసేసినట్టే. సొసైటీలోని మెజారిటీ సభ్యులు ఓ వర్గానికి చెందినవారు కావడం, చినబాబు కోపానికి భయపడి ఎవరూ కిమ్మనడం లేదు..

తాజా వీడియోలు

Back to Top