పశ్చిమలో పచ్చ భూతం

– ఆక్వా ఫుడ్‌ పార్కు పేరుతో రైతులకు వేధింపులు
– ఏపీ సీఎం అండతో రెచ్చిపోతున్న పోలీసులు
– నిర్మాణం వద్దన్నందుకు లాఠీచార్జ్‌లు, కేసులు
– గొంతేరును కలుషితం చేస్తున్న ఆక్వా పార్కు
– ఐదు మండలాల్లో ప్రశ్నార్థకంగా మారిన బతుకులు
– తుంద్రురులో 144 సెక్షన్‌... కర్ఫ్యూ
–బాధితులకు అండగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ
–ఈ నెల 19న మెగా ఆక్వాఫుడ్‌ గ్రామాల్లో వైయస్‌ జగన్‌ పర్యటన


పశ్చిమ గోదావరి: నిత్యం బూట్ల చప్పుళ్లు.. పోలీసుల కవాతు మోతలు..  రక్షణ శిబిరాలు.. పికెట్‌లతో అదొక సరిహద్దు గ్రామాన్ని తలపిస్తుంది. పిల్లలు బడికి వెళ్లాలన్నా స్కూల్‌ బస్సుల్లో తనిఖీలు... ఉదయాన్నే ఆరుబయటకు వెళ్లాల్సి వస్తే ఆధార్‌ కార్డు చూపించాలి. పనిమీద పక్క ఊరు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలి. పక్కూరి నుంచి ఎవరైనా ఇష్టమొచ్చినట్టు వచ్చిపోవడం కుదరదు. అదో నిషిద్ధ ప్రాంతంలా కనిపిస్తుంది. మన పొలాలకు మందులు చల్లుకోవాలన్నా దొంగల్లా రాత్రుళ్లు టార్చిలెట్లు, సెల్‌ఫోన్‌ వెలుతురులో  బిక్కుబిక్కుమంటూ పని పూర్తిచేసుకోవాలి. నోరెత్తితే కేసు పెడతారు.. ప్రశ్నిస్తే జైల్లో ఉండాలి.. ఆ ఊర్లో మగాళ్లు జైల్లో మగ్గుతుంటే... వారి కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ ఆడవారు తిండీ తిప్పలు మాని కన్నబిడ్డలతో పడరాని పాట్లు పడుతున్నారు. పాలకులే పోలీసుల చేత లాఠీ చార్జ్‌లు చేయిస్తుంటే అవమానాలను, అణచివేతను భరించలేక ఒక్కొక్కరు కలిసి సమూహంగా మారి బలం కూడదీసుకుని ఉద్యమ జ్వాలతో కదం తొక్కారు. మా స్వేచ్ఛ, హక్కులను హరించే కుట్రలకు ఇక్కడ స్థానం లేదంటూ నినదించారు. ఆ గ్రామ ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో ఐదు మండలాలకు చెందిన..  33 గ్రామాల ప్రజలు వీరితో కలిసి అడుగులు వేశారు. తమ బతుకులను ప్రశ్నార్థకం చేసే పరిశ్రమలకు ఇక్కడ స్థానం లేదని తిరగబడ్డారు. విప్లవ స్ఫూర్తిని రగిలించిన ఆ గ్రామమే పశ్చిమ గోదావరి జిల్లాలోని తుంద్రురు. 

అసలు ఏమి జరిగిందంటే..
2010లో రంగనాథరాజు, ఆనందరాజు అనే ఇద్దరు వ్యక్తులు తుంద్రురు గ్రామంలో 50 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అక్కడ ఆక్వా ఫుడ్‌ పార్కును కట్టబోతున్నట్టు ఎవరికీ చెప్పలేదు. అయితే పనులు మొదలయ్యే కొద్దీ వివరాలు బయటకు పొక్కాయి. ఆ కొనుగోలు చేసిన పొలంలో దాదాపు రూ. 360 కోట్లు వెచ్చించి ఆక్వా ఫుడ్‌ పార్కును నిర్మించబోతున్నట్లు స్థానికులకు తెలిసింది. మొదటి విడతలో రూ 120 కోట్లు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం నుంచి రూ. 75 కోట్ల సబ్సిడీ ఇస్తుందన్న వార్త వ్యాపించింది. ఆక్వా పార్కు నిర్మాణం జరిగితే తలెత్తే దుష్పరిణామాలు ఐదు మండలాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయని అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. రోజుకు 4 వేల టన్నుల చేపలు, రొయ్యలు, పీతల్ని శుద్ధి చేసే సామర్థ్యం ఈ ఫ్యాక్టరీకి ఉంది. ఇందుకోసం టన్నులకొద్దీ అమ్మోనియాతోపాటు ఇతర రసాయనాలతో కూడిన వ్యర్థాలను గొంతేరు కాలువలోకి వదలుతారని అర్థమైంది. దీంతో తుంద్రురు గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ఏటా మూడు పంటలు పండే భూములు కాలుష్యం కారణంగా బీడుబారే ప్రమాదముందని ప్రజలు, నిపుణుల వాదన. మరోవైపు నరసాపురం, భీమవరం, మొగల్తూరు మండలాల్లోని ఉప్పుటేరుల్లో చేపలు వేటాడి జీవనం సాగించే మత్స్యకార కుటుంబాలను ఈ ప్రాజెక్టు ప్రశ్నార్థకం చేస్తుంది. ఆ మూడు మండలాల్లో సుమారు 20 వేల మంది మత్స్య కారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు.  ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఐదు మండలాల పరిధిలోని 30 వేల ఎకరాల ఆయకట్టును కాలుష్యం ముంచెత్తుతుంది. పరిశ్రమను ఎవరికీ ఇబ్బంది లేని సముద్ర తీర ప్రాంతంలో నిర్మించుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నిర్మించడానికి అనుమతించబోమని తెగేసి చెబుతున్నారు. స్థానికులంతా ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడంతో దాదాపు ఎనిమిది నెలలపాటు పనులు ముందుకు సాగలేదు. 

ముఖ్యమంత్రి ప్రకటనతో మొదలైన పనులు
ఆక్వా ఫుడ్‌ పార్కుకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు ఉద్యమించారు. దీక్షలు, ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తిని ప్రాజెక్టు నిర్మాణాన్ని తాత్కాలికంగానే అడ్డుకోగలిగారు. ఈ ఏడాది జూన్‌ 20న  ముఖ్యమంత్రి చంద్రబాబు నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఆక్వా ఫుడ్‌ పార్కు కొనసాగుతుందని చంద్రబాబు ప్రకటించడంతో రైతుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చేసేదిలేక మళ్లీ ఉద్యమ బాట పట్టారు.  యాజమాన్యం ముఖ్యమంత్రి అండతో పోలీసుల సహాయంతో పనులు మొదలుపెట్టింది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే సిమెంట్, ఇసుక, ఇనుము తదితర సామగ్రిని కూడా పోలీసుల బందోబస్తుతోనే తరలించాల్సి వచ్చిందంటేనే తెలుస్తుంది ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారోనని. 

రైతులపై లాఠీచార్జ్‌.. హత్యాయత్నం కేసులు
అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గకపోవడంతో తుంద్రురు గ్రామంలోనే దాదాపు 700 మంది పోలీసులతో పికెట్‌లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న 200 మందిపై 120 సెక్షన్‌ కింద కేసులు పెట్టారు. మరో 30 మందిపై 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసులు బనాయించి జైళ్లలో నిర్భందించారు. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు తోటల్లోకి వెళ్లే వారిని కూడా ఆధార్‌ కార్డులు చూపించాలని వేధించడం ప్రారంభించారు. పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లాలన్నా.. తీసుకొచ్చుకోవాలన్నా ఆంక్షలే. రైతులు తమ పొలాల్లో మందులు చల్లుకోవాలంటే అర్ధరాత్రి దొంగల్లా టార్చిలైట్లు.. సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో పని పూర్తిచేయాల్సిన పరిస్థితి దాపురించింది. అక్కడ 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చారు. మనిషికో పోలీసును కేటాయించారు. నోరెత్తి ప్రశ్నించిన వారిపై లాఠీలు జులిపిస్తారు. అక్రమంగా హత్యాయత్నం కేసులు బనాయించి జైళ్లలో బందిస్తున్నారు. ఆ గ్రామం సైనిక పాలనలో ముగ్గుతున్న కశ్మీర్‌ ప్రాంతాన్ని తలపిస్తుంది. ఆడవారు తమ భర్త జైల్లో ఉంటే  పిల్లలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే పరిస్థితి నెలకొంది. 

అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో..
తొలుత గోదావరి ఆక్వా ఫుడ్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికులకు మద్ధతు తెలిపిన నరసాపురం, భీమవరం నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, పులిపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ఆందోళన ఉధృతం అయ్యే కొద్దీ వెనక్కి తగ్గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలతోనే పరిశ్రమ నిర్మాణం జరుగుతుందని తెలుసుకుని ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేయడం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మొదలుపెట్టారు. మంచి ప్రాజెక్టు నిర్మించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని ఊదరగొట్టడం ప్రారంభించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆశలు కల్పించారు. 

విషం తాగి చావాలా? ఊళ్లొదిలి వెళ్లిపోవాలా?
 గోదావరి మెగా ఆక్వా పుడ్‌ పార్కుకి రైతుల బతుకులు నాశనమే. గోదావరి జిల్లాల్లో నీళ్లే మా బతుకులకు శాపమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అన్నం పెట్టే రైతులను వ్యవసాయానికి దూరం చేసే కుట్ర జరుగుతోంది. జీవ జలాల్ని చూసి మురిసిపోయే గోదావరి జిల్లాలను విషంతో నింపే కార్యక్రమం జరుగుతోంది. గోదావరి మెగా ఆక్వా పుడ్‌ పార్కు నిర్మాణంతో గొంతేరు జీవనది పూర్తిగా విషతుల్యంగా మారబోతోందని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాగునీరు, సాగునీరుతో సమస్త జీవనం మొత్తం గొంతేరు జీవనది మీదే ఆధారపడి ఉన్న నరసాపురం, భీమవరం, వీరవాసరం, మొగల్తూరు, పాలకొల్లు మండలాల్లో తీవ్రమైన జల కాలుష్యం ప్రాణకోటికి ముప్పు తెచ్చే విధంగా జనం రగిలిపోతున్నారు. సముద్రతీర ప్రాంతాల్లో రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. పచ్చటి పొలాలు,.. జీవ జలాలు.. ప్రకతి రమణీయత ఉన్న గోదావరి డెల్టాని పర్యాటక రంగంగా అభివద్ధి చేయడంతో పాటు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. ప్రభుత్వాలు మాత్రం అందమైన పచ్చటి ప్రదేశాలను.. అన్నం పెట్టే రైతులను నాశనం చేసేందుకు ఎందుకు కుట్ర పన్నుతున్నారని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. 

గత అనుభవాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు
ఐదు మండలాల ప్రజలు, రైతులు గోదావరి ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకించడం వెనుక బలమైన కారణం ఉంది. గత అనుభవాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాల దృష్ట్యా ఇక్కడ ఆక్వా పార్కు నిర్మాణం చేపడితే తమ బతుకులు నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాలకోడేరు మండలం బేండ్రలో నిర్మించిన డెల్లా పేపర్‌ మిల్లును దీనికి ఉదాహరణగా పేర్కొంటున్నారు. డెల్టా పేపర్‌ మిల్లు ప్రభావంతో యనమద్రురు డ్రెయిన్‌ విషతుల్యమైంది. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తితే తట్టుకునే శక్తి తమకు లేదని వాపోతున్నారు.  తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఇలాంటి పరిశ్రమలను ఈ ప్రాంతంలో మాత్రం వద్దంటున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. 

వైయస్‌ఆర్‌సీపీ అండ
పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాల్లో మెగా ఆక్వాఫుడ్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకించడంతో పలుమార్లు ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా ఆక్వాఫుడ్‌ ప్రాజెక్ట్‌ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్‌ విధించింది. కాగా, బాధిత గ్రామాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బృందం ఇప్పటికే పర్యటించింది. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన బృందం ఇక్కడి పరిస్థితులను పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి నివేదిక అందజేసింది. ఈ పరిస్థితులపై వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కలత చెందారు. మెగా ఆక్వాఫుడ్‌ గ్రామాల్లో పర్యటించాలని, బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. బాధిత గ్రామాల్లో తానే స్వయంగా పర్యటించి ఇక్కడి సమస్యలు తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 19న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో వైయస్‌ జగన్‌ పర్యటన ఖరారు అయ్యింది. దీంతో బాధిత గ్రామాల ప్రజలు, రైతులు తమ బాధలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
 

Back to Top