ఉర్రూతలూగించే 'జగన్నా'థ రథచక్రాల్‌..

హైదరాబాద్‌, 17 అక్టోబర్‌ 2012: 'వస్తున్నయ్‌.. వస్తున్నయ్‌.. వస్తున్నయ్ అవిగో... జగన్నాథ రథచక్రాలొస్తున్నయ్‌ ఇవిగో.. దూసుకుంటు.. తోసుకుంటు.. ప్రజల బాధ మోసుకుంటు.. ప్రేమలు పెనవేసుకుంటు.. ప్రమాణాలు చేసుకుంటు.. చరిత తిరగ రాసుకుంటూ.. మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై.. మహానేత ఆశయాలు సాధించుటకై..' మరో ప్రజా ప్రస్థానం కోసం ప్రముఖ పాటల అనంత శ్రీరామ్ కలం నుంచి ఉరకలెత్తిన ఉత్సాహం ఇది. దూసుకుంటు.. తోసుకుంటు... ఇలాంటి ప్రాసలు ఉంటే పల్లవి ఉర్రూతలూగిస్తుందని, శ్రోతలను బాగా ఆకట్టుకుంటుందని ఈ బాణీలో పాట రాసినట్లు అనంత శ్రీరామ్ వివరించారు. ఈ పాటపై ఆయన మాటల్లోనే...

"మరో ప్రజాప్రస్థానం లయ చూస్తే ఆ పదంలో 'పదండి ముందుకు పదండి తోసుకు' లాంటి శ్రీశ్రీ గేయంలోని పోలికలు కనిపిస్తాయి. మరో ప్రజాప్రస్థానం అనే పేరు వినగానే పాటకు శ్రీశ్రీ శైలిలో ఎత్తుగడ ఉంటేనే బాగుంటుదని అనిపించింది. దానికి తగ్గట్టు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ‌జగన్‌ పేరు కలిసి వచ్చేలా 'జగన్నాథ రథచక్రాలు' వాక్యాలు ఎందుకు వాడుకోకూడదని మాటల రచయిత రాజేంద్రకుమార్ సలహా ఇచ్చారు.

శ్రీశ్రీ మహా ప్రస్థానంలోని 'వస్తున్నాయొస్తున్నాయ్‌ జగన్నాథ రథచక్రాలు' కవితను మరోసారి అధ్యయనం చేసి ఆ ఒక్క లైన్‌ను మాత్రమే తీసుకుని ఇప్పటి సన్నివేశానికి అనుగుణంగా చేద్దామనుకున్నాను. పల్లవి ఉత్సాహం కలిగించేలా ఉండాలని రథచక్రాలు ఎలా వస్తున్నాయనే రథచక్రాల గమనాన్ని వర్ణించడానికి పల్లవిని లయాత్మకంగా రాశాను.

నాయకులు, కార్యకర్తలు చేసిన అధ్యయన సమాచారాన్ని కాస్త అలంకారాలు జతచేసి పాటగా కూర్చాల్సిన బాధ్యత గీత రచయితకు ఉంటుంది. మంత్రాన్ని మామాలుగా చదివితే దాని ఫలితం ఉండదు. వేదానికి ఒక స్వరం రాస్తారు. ఆ నాదం వల్ల ఆ మంత్రానికి మహిమ వస్తుంది. అది మన చెవిలో పడితే ఫలితం వస్తుంది. అలాగే, పాటకు సంగీతం వల్ల, నాదంలోని వైబ్రేషన్ వల్ల పాట ఎక్కువ ప్రభావితం చేస్తుంది. దానికి తోడు ప్రజల సమస్యలు పాటలో ప్రతిబింబిస్తే దాన్ని శ్రోతలు ఎక్కువగా సొంతం చేసుకుంటారు. ఆ పాట వచ్చేటప్పటికి వాళ్ళలో తెలియని ఉత్సాహం కలుగుతుంది. ఎక్కువ జనం ఉన్నచోట, ఎక్కువ మంది ప్రజలు కనిపించే మాధ్యమాల్లో ఆ పాట మోగుతుంటే వారిలో మరింత హుషారు పెరిగే అవకాశం ఉంటుంది."

ఒక మహిళ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడమనే అంశంపై అనంత శ్రీరామ్‌ స్పందిస్తూ, ఆ భావాన్నే ఈ పాటలో ప్రతిబింబించేలా వివరించినట్లు తెలిపారు. వరసగా సమస్యలు చెప్పడం, వాటికి పరిష్కారం.. జగన్‌ పరిపాలన రావడమే అనే అంశాన్ని వివరించి, ఆఖరి లైన్‌లో 'నా మాటగ చెప్పమని తన చెల్లిని పంపాడో జగనన్న' అంటూ ప్రతి చరణం ముగించినట్లు చెప్పారు. జగన్నాథ రథానికి చక్రాలు ఎవరు? ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న షర్మిల కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. దీనినే సూచనప్రాయంగా ఈ పాటలో చెప్పినట్లు తెలిపారు.

ఈ పాట పాడే వారికి కంచుకంఠం లక్షణాలుండాలి. అదే కంఠంలో మాధుర్యం కూడా ఉండాలి. ఆ కంఠమే ఎన్నో భావాలను వ్యక్తపరచగలిగేలా ఉంటే బాగుంటుందని ముందుగానే అనుకున్నట్లు అనంత శ్రీరామ్‌ చెప్పారు. ఆ క్రమంలోనే సంగీత దర్శకుడు వందేమాతరం‌ శ్రీనివాస్ దగ్గర పాడే శ్రీకాంత్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయన కూడా నాలుగైదు గంటలు కష్టపడి ఈ పాటను పాడారని అభినందించారు.
Back to Top