ఉపయోగపడని పరిశోధనలు కట్టిపెట్టండి

హైదరాబాద్:

రైతుకు గిట్టుబాటుధర గురించి దేశ వ్యవసాయ పరిశోధనా రంగం ఆలోచించడంలేదని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐసీఏఆర్)లో రైతు ప్రతినిధి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం(ఇక్రిశాట్) ఆధ్వర్యంలో ‘రూరల్ లేబర్ మార్కెట్ అండ్ అగ్రికల్చర్’ అన్న అంశంపై ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్డడీస్’(సెస్) ఆవరణలో నిర్వహించిన సదస్సులో ఆయన  పాల్గొన్నారు. ప్రొఫెసర్ హనుమంతరావు దీనికి  అధ్యక్షత వహించారు. వ్యవసాయంలో రైతులు స్వయంసమృద్ధి సాధించారనీ, తిండిగింజల ఉత్పత్తిని మూడున్నరకోట్ల టన్నుల నుంచి 25 కోట్ల టన్నులకు పెంచారనీ ఆయినప్పటికీ ఇలాంటి పరిస్థితి కొనసాగుతుండడం తగదన్నారు. పౌష్టికాహార భద్రతపై మేధోమథనం చేస్తున్న పరిశోధనా రంగం  యాభై ఏళ్లలో ఒక్కసారి కూడా ‘రైతుకు గిట్టుబాటు’పై దృష్టిపెట్టలేదన్నారు.  రైతులకు ఉపయోగపడని పరిశోధనలను కట్టిపెట్టాలని ఆయన కోరారు.  1950లో దేశంలో 35 కోట్ల జనాభా ఉంటే, మూడున్నర కోట్ల టన్నుల తిండిగింజలను రైతులు పండించారనీ, పాల ఉత్పత్తి రోజుకు 1.20 కోట్ల లీటర్లు, చేపల ఉత్పత్తి 7 లక్షల టన్నులనీ  వివరించారు.

     2012కల్లా జనాభా 120 కోట్లకు చేరుకోగా, తిండి గింజలు 25 కోట్ల టన్నులకూ, పాల ఉత్పత్తి రోజుకు 12.1 కోట్ల లీటర్లు, చేపల ఉత్పత్తి 83 లక్షల టన్నులూ ఉత్పత్తవుతున్నాయన్నారు. ఇంత పురోగతి సాధించినా రైతుల ఆత్మహత్యలకు కారణాలేమిటో విశ్లేషించకపోవడం సమంజసం కాదని నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1995-2011 మధ్య 2,70,940 మంది ఆత్మహత్య చేసుకున్నారని, లెక్కల్లోకి ఎక్కని ఆత్మహత్యలు మరో రెండు లక్షలకు పైమాటేనని అన్నారు. రైతుల వాస్తవ పరిస్థితి ప్రాతిపదికగా వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనలు ఉండాలని నాగిరెడ్డి సూచించారు.

Back to Top