నేరచరితులకే బాబు ప్రయారిటీ

– టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో నేర చరితులు
– అనంతపురంలో దీపక్‌రెడ్డి, నెల్లూరులో వాకాటి నారాయణరెడ్డి
– కబ్జా కేసులో ఆధారాలతో దొరికిపోయిన దీపక్‌రెడ్డి
– రూ. 400 కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టిన వాకాటి

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి పరాకాష్టకు చేరింది. న్యాయం, ధర్మం, నీతి, నిబంధనలు అన్నింటికి నీళ్లు వదిలేసింది ప్రభుత్వం. తాజాగా 
చంద్రబాబు తనకు ఆప్తులుగా ఉండాలంటే.. తన వద్ద పదవులు పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో చెప్పకనే చెప్పాడు. తెలుగుదేశం పార్టీ తరఫున తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఇద్దరి జాతకాలు విచిత్రంగా ఉన్నాయి. వీరిలో ఒకరు కబ్జా వ్యవహారంలో కేసును ఎదుర్కొంటుండగా, మరొకరు బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయల లోన్లు ఎగ్గొట్టిన జాబితాలో ఉన్నారు. ఇవి కేవలం ఆరోపణలు కాదు నిరూపించబడ్డ అంశాలు. వీళ్లు అక్యూస్డ్‌ కాదు.. అంతకు మించి!

అనంతపురంలో దీపక్‌రెడ్డి ....
ముందుగా అనంతపురం జిల్లాకు చెందిన దీపక్‌ రెడ్డి.. ఈయన ఆ జిల్లా స్థానిక సంస్థలకోటా నుంచి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఇదే సమయంలో హైదరాబాద్‌ లో కోట్ల రూపాయల విలువైన ఒక స్థలాన్ని కబ్జా చేయడంలో దీపక్‌ రెడ్డి పేరు హైలెట్‌ అయ్యింది. తప్పుడు  డాక్యుమెంట్లు ప్రొడ్యూస్‌ చేసి.. ఆ స్థలాన్ని చేపట్టే ప్రయత్నం చేశాడు దీపక్‌ రెడ్డి. చాలా ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఒక స్థలానికి సంబంధించి ముందుగా వేరే వ్యక్తుల మీద దొంగ పత్రాలు  పుట్టించాడు దీపక్‌ రెడ్డి. ఆ తర్వాత ఆ వ్యక్తుల నుంచి తను ఆ స్థలాన్ని కొన్నట్టుగా కొత్త పత్రాలను పుట్టించాడు. మరి ఎన్ని కబ్జాలు చేశారోకానీ.. చాలా మాస్టర్‌ మైండ్‌ తో ఈ వ్యవహారాన్ని నడిపించబోయారు. చివరకు అసలు యజమానులు కోర్టుకు ఎక్కడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల మీడియాలోనేం దీపక్‌ రెడ్డి కబ్జా తతంగం గురించి పూర్తి వివరాలతో కూడిన కథనాలు వచ్చాయంటే.. కథేంటో అర్థం చేసుకోవచ్చు.

నెల్లూరులో వాకాటి.. 
బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టి తిరుగుతున్న వ్యక్తి వాకాటి నారాయణరెడ్డికి నెల్లూరు నుంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.  నాలుగు బ్యాంకులకు రూ. 443. 27 కోట్లు ఎగ్గొట్టి తిరుగుతున్న వాకాటి నారాయణరెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు.  వాకాటికి చెందిన వీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్, పవర్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్,బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకుకు 443. 27 కోట్లు ఎగ్గొట్టారు. వాకాటి స్పందించకపోవడంతో ఆయనకు చెందిన స్థిరాస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్టు జనవరి 17న బ్యాంకులు ప్రకటనలు కూడా విడుదల చేశాయి. వాకాటి కూడా తాను బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన విషయాన్ని నామినేషన్‌ పత్రాల్లో పొందుపరచకుండా దాచిపెట్టారు. వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన నామినేషన్‌కు ఆమోదం తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అన్ని వందల కోట్ల రూపాయల  లోన్లు తీసుకుని ఆ కంపెనీలు బోర్డు తిప్పేశాయి. ఈ వ్యవహారం ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది. అప్పులు చెల్లించనందుకుగాను సదరు కంపెనీల ఆస్తులతో పాటు.. వాకాటి నారాయణ రెడ్డి వ్యక్తిగత ఆస్తులను కూడా బ్యాంకులు స్వాధీనం చేసుకునే ప్రకటనలు చేశాయి. మరి ఈ లెక్కన ఈయన డీఫాల్టరే. ఒకవైపు ఇలాంటి విల్‌ ఫుల్‌ డీఫాల్టర్ల గురించి అనునిత్యం చర్చ జరుగుతూనే ఉంది. అయినా కూడా చంద్రబాబు  మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇలాంటి వ్యక్తినే బరిలో దించడం విశేషం. అసలుకు నెల్లూరు  జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో టీడీపీకి బలమే లేదు.. అయినా కూడాం అభ్యర్థిని నిలపడమే అక్రమం, అప్రజాస్వామికం. 
Back to Top