కొండలను కొల్లగొడుతున్న తమ్ముళ్లు

–బినామీల పేరిట పంచాయతీల్లో తీర్మానం
–అనుమతులు లేకుండా గ్రావెల్‌ తవ్వకాలు
–ఇప్పటికే లక్షల క్యూబిక్‌ మీటర్లు అమ్మకం
–చోద్యం చూస్తున్న అధికారులు

తుని :అధాకారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకునేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని టీడీపీ నేతలు వదిలిపెట్టడడం లేదు. నదులు, వాగుల్లో ఇసుక, చెరువుల్లో మట్టిని అమ్ముకున్నారు. ఇప్పడు రెవెన్యూ పరిధిలో ఉన్న కొండలపై దృష్టి పెట్టారు. రూ. కోట్లు విలువ చేసే గ్రావెల్‌ను తన్నుకు పోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. తుని నియోజకవర్గం పరిధిలో ఉన్న పంచాయతీల్లో రెవెన్యూకు సంబంధించిన కొండలు, గుట్టలు లీజు పేరిట పొందడానికి అధికారాన్ని ఉపయోగించారు. అధికారపార్టీకి చెందిన సర్పంచులు ఉన్న పంచాయతీల నుంచి తీర్మానం చేయించారు. తుని, తొండంగి మండలాల పరిధిలో ఆరు కొండలను బినామీల పేరిట తీర్మానం తీసుకుని దందాకు శ్రీకారం చుట్టారు. నిబంధనల ప్రకారం గనులశాఖ అనుమతి ఇచ్చిన కొండల నుంచి మాత్రమే గ్రావెల్‌ తవ్వకం చేయాలి. ఇందుకు క్యూబిక్‌ మీటరుకు రూ. 25 నుంచి 50 లు చెల్లించాలి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టే రోడ్లు, భవనాలు, ఇతర వాటికి మాత్రమే తీసుకోవాలి. ఇందు బిన్నంగా గ్రావెల్‌ను తవ్వి అమ్ముకుంటున్నారు.

జోరుగా తవ్వకాలు : తుని మండలం పరిధిలో ఎస్‌.అన్నవరం, హంసవరం, తేటగుంట, వల్లూరు, వి.కోత్తూరు, తొండంగి మండలంలో బెండపూడి,కొత్తపల్లి, కొమ్మనాపల్లి పంచాయతీల్లో గ్రావెల్‌ కొండలు ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుమతులు రాకుండానే తవ్వకాలు చేస్తున్నారు. గ్రావెల్‌ తవ్వకం, రవాణా కోసం భారీ యంత్రాలు, లారీలను వినియోగిస్తున్నారు. పగలు పూట తవ్వకాలకు విశ్రాంతి ఇచ్చి చీకటి పడిన తర్వాత వందలాది లారీల్లో తరలిస్తున్నారు. అధికారుల అంచనా ప్రకారం రూ. 10 కోట్లు విలువ చేసే గ్రావెల్‌ తరలించినట్టు సమాచారం. ప్రభుత్వానికి రూపాయి కూడ చెల్లించకుండా అడ్డదారిలో గ్రావెల్‌ను దర్జాగా అమ్ముకుంటున్నారు.

కన్నెత్తి చూడని అధికారులు : గ్రానవెల్‌ తవ్వకాలు ఎక్కడెక్కడ జరగుతున్నాయో అధికారులకు తెలిసినా అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కావడంతో మౌనం వహిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎవరైనా పేదలు ట్రాక్టరు గ్రావెల్‌ తవ్వుకుంటే అధికారులు క్షణాల్లో వాలిపోయి వాహనాన్ని సీజ్‌ చేసి, కేసులు పెడుతున్నారు. భారీ యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు చేస్తుంటే వీరికి కనిపించడం లేదానని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే గ్రావెల్‌ తవ్వకంతో చదునుగా ఉండే భూములను కబ్జా చేసేందుకు తమ్ముళ్లు రంగం సిద్ధం చేస్తున్నారు. 
Back to Top