జగన్ 'సమైక్య శంఖారావం‌' నేడు

హైదరాబాద్ :

ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని విభజించరాదని, సమైక్యంగానే ఉంచాలనే అత్యధిక ప్రజల బలమైన ఆకాంక్షను ఢిల్లీకి చాటిచెప్పేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం‌ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం బహిరంగ సభ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ పార్టీ నాయకులు శుక్రవారం సమావేశమై చర్చించారు. విభజన జరిగితే రాష్ట్రం శాశ్వతంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నందున.. భారీ వర్షాలు, వరదలతో తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా నష్టాలొచ్చినా లెక్కచేయకుండా సమైక్య శంఖారావం నిర్వహించాల్సిందేనని అన్ని ప్రాంతాల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. సమైక్య రాష్ట్రం ముక్కలైతే భవిష్యత్ తరాలకు భరోసా ఏదీ? సీమాంధ్రకు తాగునీరు, సాగునీటికి భద్రత ఏదీ? అంటూ రాష్ట్రం నలుమూలల నుంచీ వ్యక్తమైన ఆవేదనను ఢిల్లీకి వినిపించి తీరాలని అన్ని వర్గాల వారూ స్పష్టం చేశారు. దీనితో సభను వైయస్ఆర్ కాంగ్రెస్ ‌యథావిధిగా నిర్వహి‌స్తోంది.

సమైక్య శంఖారావం సభ జరిగే ఎల్బీ స్టేడియం తాజా పరిస్థితిని నాయకులు సమీక్షించారు. సభ నిర్వహణకు ఏర్పాట్లను దగ్గరే ఉండి మరీ పూర్తిచేశారు. సమైక్య శంఖారావం సభను యథావిధిగా నిర్వహిస్తున్నట్టు పార్టీ నాయకుల నుంచి ప్రకటనలు వెలువడిన వెంటనే సుదూర ప్రాంతాల వారు శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు బయలుదేరారు. రాష్ట్ర విభజనతో ఉత్పన్నమయ్యే శాశ్వత నష్టాన్ని నిరోధించే లక్ష్యంతో తాత్కాలిక ఇబ్బందులను అధిగమించి జనం పెద్ద ఎత్తున కదిలారు.

భారీ వర్షాలూ వరదల్లోనూ చెదరని సంకల్పంతో.. ఏ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా సమైక్య లక్ష్యం సాధించాల్సిందేనని అకుంఠిత దీక్షతో శనివారం మధ్యాహ్నానికి కూడా జనం తరలివస్తూనే ఉన్నారు. అనేక చోట్ల స్థానికులు దగ్గరుండి మరీ ఉత్సాహవంతులను ప్రోత్సహిస్తూ సభకు పంపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో సమైక్య వాణిని ఢిల్లీకి వినిపించడానికి ఇదొక్కటే సరైన వేదికగా ప్రజలు కదిలారని పార్టీ నాయకులు చెప్పారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సజావుగా, శాంతియుతంగా సభను నిర్వహించడానికి పార్టీ నాయకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సభ నిర్వహణకు సంబంధించి పలుమార్లు ముఖ్య నాయకులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సమైక్య శంఖారావం నిర్వహిస్తున్న ఎల్బీ స్టేడియానికి హైదరాబాద్ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత బూర్గుల రామకృష్ణారావు ప్రాంగణంగా ‌పేరుపెట్టారు. పార్టీ అధ్యక్షుడితో పాటు ఇతర ముఖ్య నేతలు ఆసీనులయ్యే వేదికకు తెలుగువారందరికీ ఒకే రాష్ట్రం కావాలంటూ ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు.

జాప్యం తగదు :
రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా విభజన ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళుతోంది. వచ్చే నెల 7న కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) సమావేశం నిర్వహించి విభజన ప్రక్రియను వేగవంతం చేయనున్న నేపథ్యంలో సమైక్య వాణిని బలంగా వినిపించాలని, ఆ విషయంలో ఇక ఏమాత్రం జాప్యం చేయరాదని భావించి.. వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ సభ జరుపుతున్నట్టు నిర్వాహకులు చెప్పారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే ప్రత్యేక రైళ్లు, స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో హైదరాబాద్ దిశగా జనం తరలి వస్తున్నారు.

వరదలపై జగన్ సమీక్ష :
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులుగా ఆయన అన్ని జిల్లాల పార్టీ ఇన్‌చార్జులు, కన్వీనర్లకు ఫోన్లు చేసి పరిస్థితి గురించి సవివరంగా తెలుసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ తలపెట్టిన సమైక్య శంఖారావం నిర్వహణపై శుక్రవారం కూడా పార్టీ నాయకులతో సమావేశమై సమీక్షించారు. జిల్లాల వారీగా నాయకులతో ఫోన్లో మాట్లాడినప్పుడు సమైక్యం కోసం ఎన్ని వర్షాలనైనా ఎదుర్కొని శంఖారావం సభకు వస్తామని ప్రజలు తెలిపారని వారు చెప్పారు.

Back to Top