గమ్యం దిశగా షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’

జగనన్న వదిలిన బాణం శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరబోతోంది. 'విజయ ప్రస్థానం స్థూపం' దిశగా వేగంగా దూసుకుపోతోంది. కనుచూపు దూరంలో తుది లక్ష్యం ఉంది. దాన్ని ఆదివారం మధ్యాహ్నానికి అధిగమించబోతోంది. ఎండా వాన, చలిని లెక్కచేయకుండా సాగుతున్నఈ అలుపెరగని సుదీర్ఘ బాటసారి వడివడిగా అడుగులు వేసి ముందుకు సాగుతున్నారు. చరిత్రాత్మక పాదయాత్రకు ముగింపు పలికి..  చరిత్ర పుటల్లో తనదైన పేజీని సృష్టించుకోనున్నారు శ్రీమతి షర్మిల.


ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా) :

మాటను నిర్బంధించాలన్న కుట్రను, పేదవాడి గుండె చప్పుడును నిలువరించాలనే కుతంత్రాన్ని ఎండగడుతూ... అప్పులు, అవమానాలను తట్టుకోలేక ఉరితాళ్ళకు వేలాడుతున్న అన్నదాతల కన్నీళ్ళు తుడిచి వెన్ను తడుతూ.. చెట్టంత ఎదిగిన బిడ్డలు ఫీజుల ఉచ్చుకు చిక్కి.. కళ్ళ ముందే కూలిపోయి గర్భశోకం అనుభవిస్తున్న తల్లిదండ్రులను ఓదారుస్తూ.. పేద విద్యార్థులకు ధైర్యాన్నిస్తూ... పండుటాకులకు ఊతకర్రై... ఎండిన బతుకులకు నీటిచలమై సాగిన నిరుపమాన యాత్ర 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, అధికార పార్టీతో అంటు కాగుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నిర్వాకాన్ని ఎండగడుతూ మహానేత డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ముద్దుల తనయ శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర రాష్ట్ర సరిహద్దు పట్టణం ఇచ్ఛాపురం శివారుకు చేరింది.

శ్రీమతి షర్మిల పాదయాత్ర శనివారం 229వ రోజు జలంత్రకోటలో ఉదయం ప్రారంభమైంది. అప్పటికే అక్కడికి చేరుకున్న మహిళలు, యువకులు జగనన్న సోదరిని చూడగానే జై జగన్ ‌నినాదాలతో హోరెత్తించారు. ‘వస్తున్నాయ్ వస్తున్నా‌య్ అదిగో జగన్నాథ రథచక్రాలు’ అనే పాటకు యువత చిందులేస్తూ పాదయాత్రలో కొనసాగారు. అశేష జనవాహిని మధ్య జాతీయ రహదారిపై ముందుకు కదిలారు. మరో‌వైపు అభిమానులు వైయస్ఆర్ పతాకాలను పట్టుకుని ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి జయహో జగ‌న్ అంటూ నినదించారు. అక్కడ పశ్చిమ గోదావరి‌ జిల్లాకు చెందిన వృద్ధుడు పిల్లి సత్యనారాయణను రాజన్న తనయ ఆప్యాయంగా పలకరించగా.. ఇడుపులపాయ నుంచి శ్రీమతి షర్మిలతో కలిసి నడిచి వస్తున్న ఆయన ఆనందంలో మునిగితేలారు.

అక్కడి నుంచి కంచిలి జాతీయ రహదారిపైకి వచ్చేసరికి శ్రీమతి షర్మిలను చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. హారతులిచ్చి, పూల వర్షం కురిపించి అభిమానంతో స్వాగతం పలికారు. రాజన్నబిడ్డతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. జీడి కార్మికులు తమ సమస్యలను ఆమెకు వివరించారు. కంచిలి జంక్షన్‌లో జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు బారులు తీరి డ్రిల్ మా‌ర్కు చప్పట్లతో  అపూర్వ స్వాగతం పలికారు. శ్రీమతి షర్మిల కూడా పిల్లందరితో కరచాలనం చేసి అభినందనలు అందించారు. కాంట్రాక్టు అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ శ్రీమతి షర్మిలకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం బైరి మీదుగా శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగింది. శ్రీమతి షర్మిలమ్మ వస్తున్న వార్త తెలిసి అటు ఒడిశా, ఇటు ఆంధ్రా ప్రయాణికులు బస్సులు ఆపి మరి జగనన్న సోదరిని ఆప్యాయంగా పలకరించారు. దారి పొడవునా యువతీ యువకులు పాదయాత్రను చిత్రీకరించేందుకు, సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసేందుకు పరుగులు తీశారు. సంత గ్రామ సమీపంలో 104 శ్రీకాకుళం జిల్లా ప్రతినిధులు రఘు, చంద్రశేఖర్,‌ కృష్ణ తదితరులు శ్రీమతి షర్మిలను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన రాజన్న బిడ్డ జగనన్న సీఎం కాగానే సంచార సంజీవినికి ఊపిరి పోస్తారన్నారు. మధ్యాహ్న భోజనం విరామం తర్వాత పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

 జాడుపూడి, గొర్లెపాడు మీదుగా అభిమానుల కోలాహలంతో ముందుకు పాదయాత్ర కొనసాగింది. మార్గమధ్యలో ఖజూడు వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి‌ శ్రీమతి షర్మిల నివాళులు అర్పించారు. ఆర్.కరపాడు మీదుగా కవిటి కూడలికి పాదయాత్ర చేరేసరికి స్థానికులు పెద్ద ఎత్తున హైవే మధ్య డివైడర్‌పై బారులుతీరి అఖండ స్వాగతం పలికారు. అక్కడి నుంచి గుడ్డిభద్ర మీదుగా రాత్రి బస ప్రాంతానికి శ్రీమతి షర్మిల చేరుకున్నారు. దారి పొడవునా ఆమెకు అభిమానులు నీరాజనాలు పట్టారు.

Back to Top