విలేజ్‌ సెక్రటేరియట్‌తో గ్రామ స్వరాజ్యం

– ప్రతి గ్రామంలో విలేజ్‌ సెక్రటేరియట్‌
– పది మంది ఉద్యోగుల నియామకాలు 
– 72 గంటల్లో సమస్యల పరిష్కారం 


గ్రామస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో విలేజ్‌ సెక్రటేరియట్‌(గ్రామ సచివాలయం) ఏర్పాటు చేయడం ద్వారా ఆదిలోనే సమస్యలు పరిష్కరించేందుకు పార్టీ అధినేత ప్రణాళిక రూపొందించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం ఆయన పాదయాత్ర వైయస్‌ఆర్‌ జిల్లా దాటి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమ్రరిలోని ముత్యాలపాడు బస్టాండ్‌ సెంటర్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. గతంలోనే పలు సందర్బాల్లో ప్రకటన చేసిన వైయస్‌ జగన్‌.. ఈ మేరకు ఏం చేయబోతున్నారో ప్రకటించారు. 
72 గంటల్లో సమస్యల పరిష్కారం
విలేజ్‌ సెక్రటేరియట్‌ల ద్వారా ప్రజా సమస్యలను 72 గంటల్లో పరిష్కరించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఆయా గ్రామాల్లో విలేజ్‌ సెక్రటేరియట్‌లు ఏర్పాటు చేసి పది మంది ఉద్యోగులను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. రేషన్, పింఛన్లు, ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ కార్డులు సమస్యలేవైనా తక్షణం పరిష్కరించే దిశగా విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు. దరఖాస్తుల పట్టుకుని మండల కార్యాలయాలు తిరిగే అవసరం లేకుండా.. విలేజ్‌ సెక్రటేరియట్‌లోనే దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో పరిష్కరించేందుకు ఉద్యోగులు పనిచేయనున్నారు. 
జన్మభూమి కమిటీల్లా కాకుండా...
గత మూడేళ్లుగా రాష్ట్రంలో జన్మభూమి కమిటీలు చేస్తున్న అరాచాకాలను చూసిన జనం విసిగిపోయారు. గ్రామంలో ఏ పని జరగాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే. పింఛన్లు, రేషన్‌ కార్డులు దక్కాలన్నా వారికి నచ్చిన వారికే కేటాయిస్తారు. దీంతో అనేక మంది లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదు. అన్ని అర్హతలున్న వికలాంగులకు సైతం వైయస్‌ఆర్‌సీపీ వారనే కారణంతో పింఛన్లు నిరాకరిస్తున్నారు. దీంతోపాటు జన్మభూమి కమిటీల అవినీతి ఆగడాలతో.. వారి అంతర్గత కుమ్ములాటల కారణంగా గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం కేటాయించే చాలీచాలని నిధులు వారి అవినీతి అకౌంట్‌లోకి చేరిపోతున్నాయి. గ్రామస్థాయి ఉద్యోగులు కూడా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉండటం లేదు. 

రాజకీయాలకు అతీతంగా నియామకాలు
విలేజ్‌ సెక్రటేరియట్‌లో పనిచేయబోయే ఉద్యోగుల నియామకాలు రాజకీయాలకు అతీతంగా ఉంటాయని ప్రకటించారు. కులమతాలు, ప్రాంతాలు, పార్టీలకు సంబంధం లేకుండా ఉద్యోగుల నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోకుండా.. దళారుల మాటలు నమ్మి డబ్బు వదిలించుకోకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాంతోపాటు పింఛన్‌ లబ్ధిదారుల వయస్సు 45 ఏళ్లకు తగ్గించనున్నట్లు పేర్కొన్నారు. 
Back to Top