సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు

హైదరాబాద్, 29 జనవరి 2013: సహకార సంఘాల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు, కుతంత్రాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించిన కారణంగా ఎలాగూ ఓడిపోవడం ఖాయమన్న భయంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షాలపై ప్రధానంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలపై ఒక పక్కన దాడులకు తెగబడుతోంది. మరో పక్కన వైయస్‌ఆర్‌సిపి తరఫున నామినేషన్లు వేసిన, వేస్తున్న అభ్యర్థులను అపహరించి అన్యాయాలకు తెరతీస్తోంది. అప్పటికీ పరిస్థితి తనకు అనుకూలం కాదనుకుంటే తన ‘చేతి’లో ఉన్న బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తోంది. వైయస్‌ఆర్‌సిపి అభ్యర్థుల విజయం తథ్యం అనుకున్న చోటల్లా ఎన్నికలను వాయిదా వేయించే దుస్తంత్రాన్ని ప్రయోగిస్తోంది. అక్కడితో ఆగకుండా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని శత్రువుగా భావిస్తున్న టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయి ఉమ్మడిగా అభ్యర్థులను పోటీలో దించుతున్నాయి.

డబ్బు సంచులతో కాంగ్రెస్‌ ఎర:
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి డివిజన్‌లో జరిగే సహకార సంఘ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి విజయడంకా మోగిస్తుందని గ్రహించిన అధికార పార్టీ నాయకులు అనేక కుయుక్తులు పన్నుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష అభ్యర్దులను డబ్బులతో కోనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వైయస్‌ఆర్‌సిపి నాయకులకు అధికార పార్టీ నాయకులకు మధ్య తోపులాటలు, వాగ్వావాదాలు జరిగాయి.

శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని కాపు గున్నేరి సహకార సంఘ‌ కార్యాలయంలో నామినేషన్ వేస్తున్న వై‌యస్‌ఆర్‌సిపి మద్దతుదారులను టిడిపి, కాంగ్రెస్ ‌నాయకులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేశారు. తోట్టంబేడు సహకార సంఘంలో ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా కాంగ్రెస్, టిడిపి నాయకులు ఇద్దరు దగ్గరుండి నామినేషన్లు వేయించారు.‌ వరదయ్యపాళెం సహకార సంఘాన్ని ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష అభ్యర్ధులకు డబ్బు ఇస్తుండగా వైయస్‌ఆర్‌సిపి నాయకులు అడ్డుకొన్నారు. దాంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. వరదయ్యపాళెం పోలీసులకు వైయస్‌సిపి నాయకులు ఫిర్యాదు చేశారు.

నామినేషన్ల సందర్భంగా తాడిపత్రిలో ఉద్రిక్తత :
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలం గార్లదిన్నె సహకార సంఘం నామినేషన్ల దాఖలుకు సమయం దాటిపోయినా తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులు హనుమంతరెడ్డి, రామకృష్ణారెడ్డి అధికారులపై ఒత్తిడి తెచ్చారు.నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారం సాయంత్రమే ముగిసింది. ‌గడువు ముగిసిందన్న ఎన్నికల అధికారి రవీంద్రతో వారు వాగ్వాదానికి దిగారు. సమయం ముగిశాక నామినేషన్లు తీసుకోవడానికి వీల్లేదని వైయస్‌ఆర్‌సిపి నాయకులు కరుణాకర్, భాస్క‌ర్‌ తదితరులు అభ్యంతరం చెప్పారు. అయినా తీసుకోవాల్సిందేనని జేసీ అనుచరులు పట్టుబట్టారు. ఈ సందర్భంగా మాటామాటా పెరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పోలీసు బలంతో ‌కాయంపేట‌లో కాంగ్రెస్ ఎన్నిక‌: :
డిసిసి అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి, మంత్రి గల్లా అరుణకుమారి పీలేరులో తొలివిడత సహకార ఎన్నికల్లో అమలుచేసిన ఫార్ములానే మలివిడత ఎన్నికల్లోనూ అమలుచేశారు. పోలీసులను కాంగ్రెస్ మద్దతుదారు‌లుగా మార్చి అమాస తన కాయంపేట సొసైటి ఎన్నికను ఏకగ్రీవం చేసుకున్నారు. మంత్రి తన నియోజకవర్గంలోని తహశీల్దార్లు అందుబాటులో లేకుండా చేసి వైయస్‌ఆర్‌సిపి మద్దతుదారులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ కాకుండా చేశారు. సభ్యత్వ నమోదు సమయంలోనే అమాస రాజశేఖరరెడ్డి అధికార దుర్వినియోగానికి తెర తీశారు. రెండు వేల మందికి పైగా రైతులు ఉన్న కాయంపేట సొసైటీలో ఓటర్ల సంఖ్యను 171 కి కుదింపచేశారు. ఈ ఓటర్లను 13 మందికి విభజించి అధికారులు వార్డులు ఖరారు చేశారు.

కాయంపేట సొసైటీలో తనకు బలం లేదన్న సాకుతో టిడిపి పోటీ నుంచి తప్పుకుంది. ఇక వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నుంచే పోటీ ఎదురవు‌తుందని అంచనా వేసిన అమాస పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపచేశారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల దాకా కాంగ్రెస్ మద్దతు దారులే నామినేషన్లు ‌వేశారు. ఎన్నికల అధికారి వద్దే అమాస రాజశేఖరరెడ్డి కూర్చుని కార్యక్రమం పూర్తి చేయించారు. అభ్యర్థులు తప్ప ఇతరులెవరూ సొసైటీ కార్యాలయం సమీపానికి రాకూడదని నిషేధాజ్ఞలు అమలు చేసిన పోలీసులు కాంగ్రెస్ నేతలకు మాత్రం సడలింపు ‌ఇచ్చారు. నామినేషన్ వేయడానికి వెళ్లిన వై‌యస్‌ఆర్‌సిపి మద్దతుదారులను కాంగ్రెన్ ‌నాయకులు కొట్టి, వారి నామినేషన్‌ ఫారాలు చించివేసినా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన వైయస్‌ఆర్‌సిపి సీఈసీ సభ్యురాలు ఆర్.కె.రోజా, యువనేత మిథు‌న్‌రెడ్డిలను పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా అరెస్టు చేశారు.

చంద్రగిరి నియోజకవర్గంలో మంత్రి అరుణకుమారి తహశీల్దార్లను అందుబాటులో ఉండకుండా చేశారు.‌ రిజర్వుడ్ స్థానాల్లో ప్రతిపక్షాల మద్దతుతో ఎవరూ పోటీ చేయకూడదనే ఈ వ్యూహం అమలు చేశారు. దీంతో అనేక స్థానాలకు శాశ్వత కుల ధ్రువీకరణపత్రాలు జోడించి నామినేషన్లు వేశారు. మల్లంగుంటలో వైయస్‌ఆర్‌సిపి మద్దతు ఇచ్చిన అభ్యర్థిని కిడ్నాప్ చేయించి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది.

వైయస్‌ఆర్‌సిపి బిసి నాయకునిపై దాడి:
కడప జిల్లా రాజంపేట రాజంపేట మండలం కంబాలవారిపల్లెలో మన్నూరు సొసైటీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వైయస్‌ఆర్‌సిపి బిసి సెల్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు శ్రీనువాసగౌ‌డ్‌పై దాడి జరిగింది. మన్నూరు పిఎసిఎస్‌ బరిలో ఉన్న కె. వెంకటేశుకు మద్దతుగా శ్రీనువాసగౌడ్ ప్రచారం చే‌స్తుండగా ఆ వార్డు నుంచి పోటీచేస్తున్న మరో అభ్యర్థికి చెందిన వారు కట్టెలతో దాడి చేశారు.

నామినేషన్లలో అక్రమాలు :
కర్నూలు జిల్లా సహకార సంఘాల ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. వైయస్‌ఆర్‌సిపి మద్దతుదారులు బలంగా ఉన్న మద్దూరులో వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. అందుకు అధికారులు కూడా వత్తాసుపలకడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైయస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలతో పోలీసులు, టిడిపి, కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. నామినేషన్లు వేయడానికి ఇంకా పది నిమిషాల సమయం ఉండగానే పోలీసులు కార్యాలయం గేట్లను మూసేశారు.

అధికార పక్షానికి పోలీసు 'సహకారం' : 
అధికార పక్షానికి పోలీసు సహకారం కూడా తోడవడంతో కర్నూలు జిల్లాలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ మద్దతుదారురాలు కిడ్నాప్‌కు గురయ్యారు. వైయస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రె‌డ్డి పోరాట ఫలితంగా చివరికి కిడ్నాప్ చెర నుంచి వై‌యస్‌ఆర్‌సిపి మద్దతుదారురాలు బయటపడి నామినేషన్ వేయాల్సి వచ్చింది.‌

వాయిదాలతో కాంగ్రెస్ 'సహకారం'! :
విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎన్నికను‌ కాంగ్రెస్‌ పార్టీ కుట్రపూరితంగా వాయిదా వేయించింది. జిల్లాలో మరో ఏడు సొసైటీలపైనా అదే వేటు వేసింది. ఇంకా మరెన్ని సొసైటీలపై వాయిదా వేటు వేస్తారో తెలియని పరిస్థితి. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరుగనున్న తరుణంలో వాయిదా జీఓలు వెలువడుతుండటం సర్వత్రా ఆందోళనకు కారణమవుతోంది. వాయిదా వేయించిన సొసైటీలపై ఫిర్యాదు దార్లంతా అధికార కాంగ్రెస్ పార్టీ వారే‌ కావడం గమనార్హం.

గడువు ముగిశాక కాంగ్రెస్ ‌నామినేషన్లు :
పశ్చిమగోదావరి జిల్లా కొంతేరు సహకార సంఘానికి నిర్ణీత సమయం దాటిన తరువాత కాంగ్రెస్ వర్గీయులు నామినేషన్లు వేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ నాయకులు ముచ్చర్ల శ్రీరా‌మ్, గుణ్ణం నాగబాబు, గుబ్బల వేణుగోపాలస్వామి ఈ వ్యవహారంపై రిటర్నింగ్ అధికారు‌లను నిలదీశారు. దీనితో కాంగ్రెస్ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గా‌లవారూ తోపులాటకు దిగారు.
Back to Top